upcoming telugu movies: ఈ వారం సినిమాలు నవ్విస్తాయ్‌.. భయపెడతాయ్‌..!

upcoming telugu movies: దసరా తర్వాత గత వారం అన్నీ చిన్న చిత్రాలు విడుదల కాగా, నవంబరు మొదటి వారంలోనూ మరికొన్ని చిన్న చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆసక్తికరమైన కథాంశాలతో రూపొందిన ఆ చిత్రాలు ఏంటో చూసేయండి

Published : 30 Oct 2023 10:08 IST

నవ్వించే ‘కీడా కోలా’

వైవిధ్యమైన కథలతో సినిమాలను తెరకెక్కిస్తూ, నటుడిగానూ తళుక్కున మెరుస్తున్నారు తరుణ్‌ భాస్కర్‌. ఆయన దర్శకత్వంలో రూపొందిన కామెడీ మూవీ ‘కీడా కోలా’ (keedaa cola). బ్రహ్మానందం, చైతన్యరావు, తరుణ్‌భాస్కర్‌, రాగ్‌మయూర్‌, రఘురామ్‌, రవీంద్ర విజయ్‌, జీవన్‌ కుమార్‌, విష్ణు కీలక పాత్రల్లో నటించారు. కె.వివేక్‌ సుధాంషు, సాయికృష్ణ గద్వాల్‌, శ్రీనివాస్‌ కౌశిక్‌, శ్రీపాద్‌ నందిరాజ్‌, ఉపేంద్ర వర్మ నిర్మించారు. రానా దగ్గుబాటి సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబరు 3న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


మొదటి భాగానికి మించి..

త్యం రాజేష్‌, కామాక్షి, బాలాదిత్య, గెటప్‌ శ్రీను కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘మా ఊరి పొలిమేర’. అనిల్‌ విశ్వనాథ్‌ దర్శకుడు. కరోనా కారణంగా ఓటీటీలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. చివరి 20 నిమిషాలు ప్రేక్షకుడిని ఉత్కంఠతో ఊపేశారు. ‘పొలిమేర’ ఇచ్చిన విజయోత్సాహంతో ఇప్పుడు ‘మా ఊరి పొలిమేర2’ (Maa Oori Polimera 2)ను తెరకెక్కించారు. మొదటి భాగానికి మించి థ్రిల్‌ను పంచేలా సినిమాను తీర్చిదిద్దినట్లు చిత్ర బృందం చెబుతోంది. నవంబరు 3న ఈ మూవీ థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


‘విధి’ ఏం చేసింది?

రోహిత్ నందా, ఆనంది జంటగా శ్రీకాంత్ రంగనాథన్, శ్రీనాథ్ రంగనాథన్ రచన దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘విధి’ (Vidhi). నో ఐడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్ మీదుగా రంజిత్. ఎస్ నిర్మించారు. నవంబరు 3న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఓ జంట జీవితంలో విధి ఎలాంటి మలుపులకు కారణమైందనే ఆసక్తికర కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు.


తెలుగులో 12th ఫెయిల్‌..

విక్రాంత్‌ మస్సే హీరోగా, విధు వినోద్‌ చోప్రా తెరకెక్కించిన చిత్రం ‘12 ఫెయిల్‌’. మనోజ్‌ కుమార్‌ అనే వ్యక్తి జీవితం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఒక గ్రామంలో ఉండే నిరుపేద యువకుడు 12వ తరగతి ఫెయిల్‌ అవుతాడు. కానీ పట్టుదలతో చదివి, దృఢ సంకల్పంతో ఐపీఎస్‌ అధికారి అవుతాడు. ఆ యువకుడు తన లక్ష్యాన్ని ఎలా చేరుకున్నాడన్న ఆసక్తికర కథతో ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. అనురాగ్‌ పాఠక్‌ రాసిన నవలల్లో అత్యధికంగా అమ్ముడుపోయిన వాటిల్లో  ‘12 ఫెయిల్‌’ ఒకటి. ఇప్పుడు అదే పేరుతో వస్తున్న ఈ సినిమా ఇప్పటికే హిందీలో విడుదలై అలరిస్తోంది. నవంబరు 3న తెలుగులోనూ ప్రేక్షకుల ముందుకు రానుంది.


రెండు వారాలు ఆలస్యంగా తెలుగులో..

కన్నడ స్టార్‌ శివ రాజ్‌కుమార్‌(Shiva Rajkumar) నటించిన పాన్‌ ఇండియా చిత్రం ‘ఘోస్ట్‌’ (Ghost). శ్రీని దర్శకుడు. సందేశ్‌ నాగరాజ్‌ నిర్మిస్తున్నారు. దసరా కానుకగా కన్నడలో విడుదలైన ఈ సినిమా నవంబరు 4న తెలుగులోనూ రానుంది. ‘ఆసక్తికరమైన యాక్షన్‌ థ్రిల్లర్‌ కథతో రూపొందుతోన్న చిత్రమిది. స్క్రీన్‌ప్లే చాలా కొత్తగా ఉంటుంది. క్లైమాక్స్‌ సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’ అని చిత్ర బృందం చెబుతోంది. మరి ఈ ఘోస్ట్‌ తెలుగు ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.



ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలు/సిరీస్‌లివే!

  • అమెజాన్‌ ప్రైమ్‌
  • పి.ఐ. మీనా (హిందీ) నవంబరు 3
  • సోనీలివ్‌
  • స్కామ్‌ 2003: పార్ట్‌-2 (హిందీ) నవంబరు 3
  • ఆహా
  • ఆర్‌ యూ ఓకే బేబీ (తమిళ్‌) అక్టోబరు 31
  • నెట్‌ఫ్లిక్స్‌
  • లాక్‌డ్‌ ఇన్‌ (హాలీవుడ్‌) నవంబరు 1
  • జవాన్‌ (హిందీ) నవంబరు 2
  • డిస్నీ+హాట్‌స్టార్‌
  • స్కంద  (తెలుగు) నవంబరు 2
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని