Pushpa 2: ‘పుష్ప2’ ఇంటర్వెల్‌.. మాస్‌ మూవీస్‌కు భిన్నంగా..?

Pushpa 2: అల్లు అర్జున్‌ నటిస్తున్న ‘పుష్ప2’ చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర విషయాలు సామాజిక మాధ్యమాల వేదికగా వైరల్‌ అవుతున్నాయి.

Published : 22 Feb 2024 01:37 IST

హైదరాబాద్‌: అల్లు అర్జున్‌ (Allu Arjun) కథానాయకుడిగా సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందుతున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘పుష్ప: ది రూల్‌’ (Pushpa 2: The Rule). శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమాకు సంబంధించి రోజుకో అప్‌డేట్‌ సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఇంటర్వెల్‌ బ్యాంగ్‌ డిఫరెంట్‌గా ప్లాన్‌ చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది.

సాధారణంగా సెకండ్‌ ఆఫ్‌పై ఆసక్తి పెంచేలా స్క్రీన్‌ప్లేని నడిపిస్తూ అనూహ్యమైన సంఘటనలతో ఇంటర్వెల్‌ వచ్చేలా దర్శకులు ప్లాన్‌ చేసుకుంటారు. అసలు ప్రేక్షకుడు ఊహించలేని ట్విస్ట్‌ లేదా హై ఓల్టేజ్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ ఉండేలా చూసుకుంటారు. కానీ, అందుకు భిన్నంగా ‘పుష్ప1’ ఇంటర్వెల్‌ ఉంటుంది. మంగళం శ్రీను అతడి అనుచరులకు వార్నింగ్‌ ఇస్తూ ‘పుష్ప అంటే ఫ్లవర్‌ అనుకుంటివా.. ఫైరు’ అనే డైలాగ్‌తో విరామం ఇచ్చారు. కానీ, ఈసారి ఇంకాస్త భిన్నంగా హీరో, విలన్స్‌ మధ్య వచ్చే ఓ ఎమోషనల్‌ సాంగ్‌తో ఇంటర్వెల్‌ ఉండేలా ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌. ఇప్పటికే దీనికి సంబంధించిన సీక్వెన్స్‌ను కూడా తీశారట. విరామానికి ముందు డైలాగ్స్‌ కంటే మంచి పాట ఉంటే కథనం మరింత ఆసక్తిగా ఉంటుందని సుకుమార్‌ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మరి ఇది నిజమా? కాదా? అనేది తెలియాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే!

రష్మిక (Rashmika) కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో ఫహద్‌ ఫాజిల్‌ (Fahadh Faasil) ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. ఆగస్టు 15న సినిమాను విడుదల చేస్తామని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించగా, జూన్‌ లేదా జులై మొదటి వారానికి చిత్రీకరణ పూర్తి చేసి,  అదే నెలలో పోస్ట్‌ ప్రొడక్షన్‌ను కూడా పూర్తి చేయాలని భావిస్తున్నారు. ‘పుష్ప1’ ప్రచారం చేసేందుకు సరైన సమయం దొరకలేదు. అయినా కూడా అల్లు అర్జున్‌ నటన, సుకుమార్‌ టేకింగ్‌, దేవిశ్రీ పాటల కారణంగా మౌత్‌ టాక్‌తోనే దూసుకుపోయింది. బాలీవుడ్‌లోనూ అదరగొట్టింది. దీంతో ఈసారి ప్రచారానికి తగిన సమయం కేటాయించాలని భావిస్తున్నారు. రూ.300 కోట్ల భారీ బడ్జెట్‌తో మైత్రీ మూవీ మేకర్స్‌ ‘పుష్ప:ది రూల్‌’ (Pushpa 2) తీర్చిదిద్దుతున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని