Maidaan: ఆ పాత్రలో ఆయన నటించలేరనుకున్నా : అమిత్‌ శర్మ

అజయ్‌ దేవగణ్‌ అబ్దుల్‌ రహీంగా నటించలేరని తాను అభిప్రాయపడినట్లు అమిత్‌శర్మ తెలిపారు. 

Published : 27 Mar 2024 17:45 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత ఫుట్‌బాల్‌ కోచ్‌ సయ్యద్‌ అబ్దుల్‌ రహీం పాత్రలో అజయ్‌ దేవగణ్‌ (Ajay Devgn) నటిస్తున్న చిత్రం ‘మైదాన్‌’ (Maidaan). రహీం జీవితం ఆధారంగా అమిత్‌ శర్మ దీనిని తెరకెక్కిస్తున్నారు. ప్రియమణి కథానాయిక. జీ స్టూడియోస్‌, బోనీకపూర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా ఏప్రిల్‌ 10న ప్రేక్షకుల ముందుకురానుంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమిత్‌శర్మ అజయ్‌ దేవగణ్‌ గురించి మాట్లాడారు.

‘‘అజయ్‌ దేవగణ్‌కు రహీం గురించి చెప్పి కథ వివరించాను. వెంటనే ఆయన ‘నేను ఏం చేయాలో చెప్పు’ అన్నారు. ఇందులో ఎక్కువ డైలాగ్స్‌ ఉండవని చెప్పాను. కానీ ఆయన ఎలాంటి ప్రశ్నలు అడగలేదు. దాంతో ఆ పాత్రకు ఆయన న్యాయం చేయగలరా, లేదా అన్న సందేహం కలిగింది. ఇప్పుడు నా అభిప్రాయం తప్పని అర్థమైంది. ‘సింగం’ అజయ్‌ నుంచి ఆయన అబ్దుల్‌ రహీంగా మారడాన్ని ‘మైదాన్‌’లో చూశాను. ఈ పాత్రలో ఆయన కాకుండా ఎవరూ నటించలేరు. దర్శకులను ఇబ్బందిపెట్టేలా అజయ్‌ ఎప్పుడూ ప్రశ్నలు వేయలేదు. ఈ సినిమా చేయాలని అనుకున్నప్పుడు రహీం గురించి పరిశోధనలు మొదలుపెట్టాం. రహీం కుమారుడిని, మరికొందరు ఫుట్‌బాల్‌ క్రీడాకారులను కలిశాను. ఆయన గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్న తర్వాత సినిమాను ప్రారంభించాం’’ అని అమిత్‌ శర్మ అన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని