Anand Deverakonda: రష్మిక అలా ఎందుకన్నారో తెలియదు

‘ప్రతి సినిమాతోనూ ఏదో ఒక కొత్తదనం తీసుకు రావాల్సిందే’ అంటున్నారు ఆనంద్‌ దేవరకొండ. ఇప్పటివరకూ చేసిన పక్కింటి కుర్రాడి తరహా పాత్రలకి భిన్నంగా ‘గం గం గణేశా’లో కనిపిస్తానని చెబుతున్నారు

Updated : 30 May 2024 07:18 IST

‘ప్రతి సినిమాతోనూ ఏదో ఒక కొత్తదనం తీసుకు రావాల్సిందే’ అంటున్నారు ఆనంద్‌ దేవరకొండ. ఇప్పటివరకూ చేసిన పక్కింటి కుర్రాడి తరహా పాత్రలకి భిన్నంగా ‘గం గం గణేశా’లో కనిపిస్తానని చెబుతున్నారు. నటుడిగా తనని మరో మెట్టు ఎక్కించిన ‘బేబీ’ తర్వాత, ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రమే... ‘గం గం గణేశా’. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది ఈ సందర్భంగా ఆనంద్‌ దేవరకొండ హైదరాబాద్‌లో విలేకరులతో ముచ్చటించారు. ఆ విషయాలివీ... 

ఈ సినిమా ప్రయాణం: ‘బేబీ’, ‘గం గం గణేశా’.. ఒకేసారి నా దగ్గరికొచ్చాయి. ‘బేబీ’ కోసం జుట్టు, గడ్డం పెంచడం, ఆ సినిమా కోసం వేసిన సెట్‌ భారీవర్షం వల్ల కూలిపోవడం తదితర కారణాలతో ‘గం గం గణేశా’ ఆలస్యమవుతూ వచ్చింది. స్వతహాగా నాకు ‘స్వామి రారా’ తరహా క్రైమ్‌ కామెడీ సినిమాలంటే ఇష్టం. దర్శకుడు ఉదయ్‌ శెట్టి ఈ కథ చెప్పాకా ఆ సినిమానే గుర్తొచ్చింది. వినాయకుడి విగ్రహం నేపథ్యంలో, అత్యాశ, భయం, కుట్ర అనే అంశాల చుట్టూ సాగే కథ ఇది. 

కామెడీ చేయడం కష్టమా?: ఏడిపించడం కంటే నవ్వించడమే చాలా కష్టం. ఈ కథ విన్నాక కామెడీ టైమింగ్‌ నేను పక్కాగా పట్టుకోగలనా అనే భయం కలిగింది. అందుకోసం కొన్ని వర్క్‌షాప్స్‌ కూడా చేశాం. గతంలో నేను చేసిన ‘మిడిల్‌క్లాస్‌ మెలోడీస్‌’, ‘పుష్పక విమానం’ చిత్రాల్లోనూ కామెడీ చేశా. కాకపోతే అది సందర్భోచితంగా పండే సహజమైన కామెడీ. ఇందులో భిన్నంగా ఉంటుంది. ఇందులో నాతోపాటు పది, పదిహేను కీలకమైన పాత్రలు ఉంటాయి.  

వాణిజ్య కోణం: హీరోగా నా ఇమేజ్‌ కోసమో, కమర్షియాలిటీ కోణంలోనో ఆలోచించి చేసిన సినిమా కాదిది. కథ కొత్తగా అనిపించింది. నేను కూడా ఇలాంటి కథలు, స్క్రిప్ట్‌లు ప్రయత్నించవచ్చు కదా అనిపించి చేశానంతే. అయితే ఇందులో నా డాన్సులు చూసి చాలా మంది మెచ్చుకుంటున్నారు. నాకు గత సినిమాల్లో డాన్సులు చేసే అవకాశం రాలేదు, ఇందులో వచ్చింది. ‘బేబీ’లో ఓ డాన్స్‌ నంబర్‌ చేసినా.. ఎడిటింగ్‌లో తీసేశారు. 

‘బేబీ’ తర్వాత?: ‘బేబీ’కి రూ.వంద కోట్లు వసూళ్లు వచ్చాయని తర్వాత సినిమాకి రూ.150 కోట్లు రావాలనుకోను. హీరోగా నేను కానీ, నా సినిమాల స్థాయి కానీ ఒక్కసారిగా పెరిగేది కాదు. ‘బేబీ’ ఓ ప్రేమకథ, ఇది కామెడీ ప్రధానంగా సాగే కథ. ఈ వేసవిలో కుటుంబమంతా కలిసి చూసే సినిమాలు రాలేదు. కచ్చితంగా ఆ లోటుని ‘గం గం గణేశా’ తీరుస్తుంది. పెట్టిన డబ్బు తిరిగొచ్చి, అందరూ బాగుందని మెచ్చుకుంటే మేం విజయం అందుకున్నట్టే.

కొత్త సినిమాలు: నాకు నాటుగా సాగే యాక్షన్‌ సినిమాలంటే చాలా ఇష్టం. ధనుష్‌ చేసిన ‘కర్ణన్‌’, ‘అసురన్‌’ తరహాలో ఓ సినిమా చేయాలని ఉండేది. ఆ కోరిక వినోద్‌ అనంతోజు సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ కలయికలో రూపొందుతున్న సినిమాతో తీరనుంది. దర్శకుడు సాయిరాజేశ్, నిర్మాత ఎస్‌.కె.ఎన్‌తో కలిసి ఓ సినిమా చేస్తున్నాం. స్టూడియో గ్రీన్‌ సంస్థలో ‘డ్యూయెట్‌’ చేస్తున్నా.

మీ సినిమాలకి రష్మిక హాజరవడం.. మీపై ఆధారపడతాననడం?

రష్మిక నా సినిమా కార్యక్రమాల్లో పాల్గొన్నది రెండుసార్లే (నవ్వుతూ). మేం ఫ్యామిలీ ఫ్రెండ్స్‌. అందుకే మొన్న వేడుకలో మనం ఫ్యామిలీ అన్నారు. ఆ అనుబంధంతోనే నా సినిమా వేడుకల్లో పాల్గొంటుంటారు. మరి నాపై ఆధారపడుతుంటానని ఎందుకన్నారో నాకూ తెలియదు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని