The Idea of You: ఆడిషన్‌ అంటూ పది మందిని ముద్దు పెట్టుకోమన్నారు: స్టార్‌ హీరోయిన్‌

గతంలో ఓ ఆడిషన్‌లో తనకు ఎదురైన సంఘటన గురించి స్టార్‌ హీరోయిన్‌ ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆమె ఎవరంటే?

Updated : 23 Apr 2024 18:27 IST

 

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆడిషన్స్‌లో భాగంగా దర్శక, నిర్మాతలను మెప్పిస్తేనే సినీ ఔత్సాహికులకు నటించే అవకాశం వస్తుంది. తమ సినిమాకు కావాల్సిన వారిని ఎంపిక చేసుకునేందుకు ఒక్కొక్కరు ఒక్కో టాస్క్‌ ఇస్తుంటారు. భారీ డైలాగ్స్‌ చెప్పమనో, ఎమోషన్స్‌ చూపించమనో పలువురు ఫిల్మ్‌మేకర్స్‌ యువ ప్రతిభను వెలికితీసే ప్రయత్నం చేస్తే.. మరికొందరు నవరసాలు పలికించమంటారు. కానీ, వీటికి భిన్నమైన పరిస్థితిని తాను ఎదుర్కొన్నానంటూ హాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అన్నే హాత్వే (Anne Hathaway) ఓ ఇంటర్వ్యూలో గతాన్ని గుర్తు చేసుకున్నారు. తనను ఆడిషన్‌ చేసిన ప్రక్రియపై అసహనం వ్యక్తంచేశారు. తన కొత్త చిత్రం ‘ది ఐడియా ఆఫ్‌ యు’ (The Idea Of You) ఓటీటీ అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో మే 2న విడుదల కానున్న సందర్భంగా హాలీవుడ్‌ మ్యాగజైన్‌తో ఆమె మాట్లాడారు.

‘‘తొలినాళ్లలో నేనో సినిమా ఆడిషన్‌కు వెళ్లా. హీరో- హీరోయిన్ల కెమిస్ట్రీ ఎలా ఉంటుందో పరీక్షించేందుకు అక్కడికి వచ్చిన పది మంది అబ్బాయిలని ముద్దు పెట్టుకోమని నాకు చెప్పారు. కెమిస్ట్రీ ఎలా ఉంటుందో టెస్ట్‌ చేసేందుకు నటీనటులను కలిసి నటించమని అడగడం సాధారణం. కానీ, పది మందిని కిస్‌ చేయమని చెప్పడం సరైన పద్ధతి కాదు. అది వరస్ట్‌ ప్రాసెస్‌. నేను అప్పటికి వయసులో చిన్నదాన్నే అయినా.. కష్టమనే పేరుతో ప్రతీదీ వదిలేస్తే జీవితంలో ముందుకెళ్లలేమనే ఆలోచనతో ఉండేదాన్ని. ఆమేరకు ఉత్సాహంగానే ఉన్నట్లు వారి ముందు నటించా’’ అని పేర్కొన్నారు. ఏ సినిమా ఆడిషన్‌లో తనకు ఇలా జరిగిందో అన్నే వెల్లడించలేదు.

టెలివిజన్‌ సిరీస్‌ ‘గెట్‌ రియల్‌’తో నటిగా కెరీర్‌గా ప్రారంభించిన ఆమె 2001లో వచ్చిన ‘ది ప్రిన్సెస్‌ డైరీస్‌’తో హీరోయిన్‌గా మారారు. తర్వాత, ‘లవ్‌ అండ్‌ అదర్‌ డ్రగ్స్‌’, ‘వన్‌ డే’, ‘ది ఇంటర్న్‌’, ‘ది డార్క్‌ నైట్‌ రైజెస్‌’, ‘వాలంటైన్స్‌ డే’, ‘ఇంటర్‌స్టెల్లార్‌’లతో మంచి విజయాలు అందుకున్నారు. నటిగానే కాకుండా నిర్మాతగా వ్యవహరించిన ‘ది ఐడియా ఆఫ్‌ యు’.. ‘సౌత్‌ బై సౌత్‌వెస్ట్‌ ఫిల్మ్‌, మ్యూజిక్‌, అండ్‌ మీడియా ఫెస్ట్‌వల్‌ ఆఫ్‌ ఆస్టిన్‌’ (టెక్సాస్‌) వేదికపై ప్రదర్శితమై, ప్రశంసలు అందుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని