Anupam Kher: అందుకే 28 ఏళ్లకే 65 ఏళ్ల వ్యక్తిగా నటించా: అనుపమ్‌ ఖేర్‌

ప్రముఖ నటుడు అనుపమ్‌ ఖేర్‌ తన ప్రయాణాన్ని గుర్తుచేసుకున్నారు. 

Updated : 28 May 2024 19:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: 40 ఏళ్ల సుదీర్ఘ ప్రయాణం చేసిన నటుడు అనుపమ్‌ ఖేర్‌ (Anupam Kher). 540కిపైగా చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించారాయన. కొత్త సినిమా ‘ఛోటా భీమ్‌ అండ్‌ ది కర్స్‌ ఆఫ్‌ దమయాన్‌’ (Chhota Bheem and the Curse of Damyaan) ప్రచారంలో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో తన కెరీర్‌ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. ‘‘సినీ పరిశ్రమలో ప్రతిభ కంటే హెయిర్ స్టైల్ రాజ్యమేలుతోన్న సమయంలో నేను నటుడిని కావాలనుకున్నా. నేను ఈ నగరానికి (ముంబయి) వచ్చినప్పుడు బట్టతలతో సన్నగా ఉండేవాడిని. టాలెంట్‌ మాత్రమే ముఖ్యమని నమ్మాను కాబట్టి 28 ఏళ్ల వయసులోనే 65 ఏళ్ల వ్యక్తిగా నటించా. నేను నటించే ప్రతీ పాత్రా వైవిధ్యంగా ఉండాలని కోరుకుంటా. అందుకే ఇన్నేళ్లపాటు ఇండస్ట్రీలో ఉన్నానని భావిస్తున్నా. కెరీర్‌ ప్రారంభంలో ఆర్థికంగా సమస్యలు చుట్టుముట్టాయి. రైల్వే ప్లాట్‌ఫామ్‌పై పడుకునేవాణ్ని. నాకు పని చేసే అవకాశం ఇవ్వమని తప్ప భగవంతుడిని మరేదీ కోరలేదు’’ అని పేర్కొన్నారు.

డ్యాన్స్‌ గురించి మాట్లాడుతూ.. ‘‘నాకు డ్యాన్స్‌ చేయడం రాదు. నా యాక్టింగ్‌లోనే డ్యాన్స్‌ ఉందని అనుకుంటున్నా’’ అని అన్నారు. 65 ఏళ్ల వ్యక్తిగా ఆయన నటించిన చిత్రమే ‘సారాంశ్‌’ (1984). హిందీ, తమిళ్‌, మలయాళం, కన్నడ, తెలుగు, పంజాబీ, మరాఠీ, ఇంగ్లిష్‌, చైనీస్‌ చిత్రాల్లోనూ ఆయన నటించారు. 1987లో వచ్చిన ‘త్రిమూర్తులు’ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయమయ్యారు. చాలాకాలం తర్వాత తెలుగులో ‘కార్తికేయ 2’ (Karthikeya 2), ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) సినిమాల్లో కీలక పాత్రలు పోషించి అలరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని