Baby movie: డ్రగ్స్‌ తీసుకునే సీన్స్‌.. ‘బేబీ’ మూవీ నిర్మాతలకు పోలీసుల నోటీసు

డ్రగ్స్ ఏవిధంగా వినియోగదారులు ఉపయోగించాలనే దృశ్యాలను ‘బేబీ’ (Baby Movie) మూవీలో చూపించారని, ఇలాంటి దృశ్యాలను చిత్రీకరించవద్దని చిత్ర పరిశ్రమను హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ (CV Anand) కోరారు. ఇకపై ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుందని స్పష్టం చేశారు.

Updated : 14 Sep 2023 19:50 IST

హైదరాబాద్‌: ‘బేబీ’ (Baby Movie) మూవీలో డ్రగ్స్ ఏవిధంగా వినియోగదారులు ఉపయోగించాలనే దృశ్యాలను చూపించినందుకు గానూ సదరు చిత్ర నిర్మాతలకు నోటీసులు పంపనున్నట్లు హైదరాబాద్‌ సీపీ సీవీ ఆనంద్‌ (CV Anand) తెలిపారు. మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న, వినియోగిస్తున్న ముఠాను నార్కోటిక్ విభాగం పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో అందుకు సంబంధించిన వివరాలను సీవీ ఆనంద్‌ వెల్లడించారు. తాజాగా మదాపూర్‌లో నార్కోటిక్ విభాగం డ్రగ్స్ స్వాధీనం చేసుకుందని, ఈ కేసులో ముగ్గురు నైజీరియన్లతో పాటు, మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న వారిని అరెస్ట్ చేసినట్లు తెలిపారు.

‘‘ఈ కేసులో మొత్తం ఐదుగురిని అరెస్టు చేశాం. అందులో ముగ్గురు నైజీరియన్లు ఉన్నారు. డ్రగ్స్‌ను బెంగుళూరు నుంచి తీసుకొచ్చి ఇక్కడ విక్రయిస్తున్నట్లు గుర్తించాం. ఆర్గనైజేషన్ ఏర్పాటు చేసుకొని మరీ డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. వీసా గడవు ముగిసినా కొందరు నైజీరియన్లు ఇక్కడే ఉన్నారు. డ్రగ్స్ కోనుగోలు చేస్తున్న వారిలో వరంగల్‌కు చెందిన వ్యక్తి ఉన్నట్లు గుర్తించాం. సోషల్ మీడియా ద్వారా విక్రయాలు జరుపుతున్నట్లు మా విచారణలో తేలింది. మాజీ ఎంపీ కుమారుడు దేవరకొండ సురేష్‌రావును కూడా అరెస్ట్  చేశాం. వినియోగదారులు డ్రగ్స్ ఏ విధంగా ఉపయోగించాలో తెలిసేలా దృశ్యాలను ‘బేబీ’ సినిమాలో చూపించారు. ఇలాంటి దృశ్యాలను చిత్రీకరించవద్దని చిత్ర పరిశ్రమకు విజ్ఞప్తి చేస్తున్నా. ‘బేబీ’ మూవీ నిర్మాతలకు కూడా  నోటీసులు ఇస్తాం. ఇప్పటి నుంచి ప్రతి సినిమాపై పోలీసుల నిఘా ఉంటుంది. బెంగుళూరులో 18 మంది నైజీరియన్లు ఉన్నారని గుర్తించాం. ఈ కేసులో నవదీప్ వినియోగదారుడిగా ఉన్నాడు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు’’ అని సీవీ ఆనంద్‌ తెలిపారు.

బేబీ సినిమాలో ఒక సన్నివేశం గురించి ఆరా తీశారు: సాయి రాజేశ్‌

‘బేబీ’ మూవీలో డ్రగ్స్ సన్నివేశాలను ఎందుకు పెట్టాల్సి వచ్చిందో పోలీసులు వివరణ అడిగారని దర్శకుడు సాయి రాజేశ్‌ తెలిపారు. చిత్ర నిర్మాత ఎస్‌కేఎన్‌తో కలిసి ఆయన సీవీ ఆనంద్‌ను కలిశారు. అనంతరం సాయి రాజేశ్‌ మాట్లాడుతూ..  ‘‘కథలో భాగంగానే ఆ సన్నివేశంలో డ్రగ్స్‌ సీన్‌  పెట్టాల్సి వచ్చిందని పోలీసులకు వివరణ ఇచ్చా. అలాంటి సన్నివేశాలు మాదాపూర్ డ్రగ్స్ కేసులో బయటకు వచ్చాయని పోలీసులు చెప్పారు. ప్రజలకు ఆదర్శంగా ఉండేలా సినిమాలు తీయాలని సూచించారు. తెలుగు సినీ పరిశ్రమకు ఈ విషయాలను తెలియజేయాలని కోరారు. అడ్వైజరీ నోటీస్ ఇచ్చారు’ అని సాయి రాజేశ్‌ తెలిపారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని