Tamannaah: రాజమౌళి ఆ ప్రశ్నకు ఎప్పుడూ సమాధానం చెప్పలేదు: తమన్నా

నటి తమన్నా ఓ కార్యక్రమంలో ‘బాహుబలి’ని గుర్తుచేసుకున్నారు. రాజమౌళికి సంబంధించిన ఆసక్తికర విషయాలను చెప్పారు. 

Updated : 26 Feb 2024 14:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. తెలుగు సినిమా స్థాయిని అమాంతం పెంచేసిన ఈ చిత్రంలో ‘అవంతిక’గా తమన్నా (Tamannaah) ఆకట్టుకున్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఈ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

‘‘బాహుబలి’ నటీనటులకే కాదు.. దేశ సినిమా చరిత్రకే కీలకమలుపు. ఈ చిత్రం తర్వాత ప్రపంచమంతా భారతీయ సినీ పరిశ్రమ గురించి మాట్లాడుకుంది. ఇంత గొప్ప చిత్రంలో రాజమౌళి నాకు అవంతిక పాత్రను ఇచ్చారు. దీంతో నటిగా నిరూపించుకోవడానికి నాకు అవకాశం లభించింది. నన్నే ఎంపిక చేయడానికి కారణమేమిటని దర్శకుడిని ఎన్నోసార్లు అడిగాను. ఆయన ఎప్పుడూ సమాధానమివ్వలేదు. ఆ ప్రశ్న అడిగిన ప్రతిసారీ నవ్వుతూ వెళ్లేవారు. నా టాలెంట్‌ను రాజమౌళి అర్థం చేసుకొన్నారని.. ఆ పాత్రలో నటించడం మొదలుపెట్టాకే తెలిసింది’’ అని తమన్నా చెప్పారు. ప్రస్తుతం దక్షిణాది సినీ పరిశ్రమ గురించి అంతర్జాతీయ స్థాయిలో గొప్పగా మాట్లాడుకుంటున్నారని ఆమె ప్రశంసించారు. 

ఈ వారం థియేటర్‌ / ఓటీటీ చిత్రాలివే!

ఇండస్ట్రీకి రావాలని నిర్ణయించుకున్నప్పుడు కొందరు తన పేరులో మార్పు చేసుకుంటే బాగుంటుందని సూచించారని.. అందుకే అదనంగా రెండు ఇంగ్లిషు అక్షరాలను చేర్చుకున్నట్లు తమన్నా చెప్పారు. ఇక గతేడాది వరుస వెబ్ సిరీస్‌లు, సినిమాలతో విజయాలను సొంతం చేసుకున్న ఆమె ప్రస్తుతం బాలీవుడ్‌ చిత్రాలతో బిజీగా ఉన్నారు. రాజ్‌కుమార్‌ రావ్‌, శ్రద్ధా కపూర్‌ జంటగా నటిస్తున్న ‘స్త్రీ 2’ చిత్రం కోసం ప్రత్యేక గీతంలో నటించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని