Balakrishna: మాస్‌ డైరెక్టర్‌తో బాలకృష్ణ.. నాలుగోసారి రిపీట్‌ కానున్న కాంబో

బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా కొత్త సినిమాను ప్రకటించారు. బాబీ దర్శకత్వంలో రానున్న సినిమా పోస్టర్‌ను విడుదల చేశారు. 

Updated : 10 Jun 2024 11:49 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఇండస్ట్రీలో కొన్ని కాంబినేషన్స్‌కు ప్రత్యేక అభిమానులుంటారు. అలాంటి వాటిలో ఒకటి బాలకృష్ణ-బోయపాటిల కాంబో. వీళ్లిద్దరి సినిమా వస్తుందంటే మాస్‌ ప్రేక్షకులకు పండగే. గతంలో వీళ్లిద్దరు కలిసి చేసిన ‘సింహ’, ‘లెజెండ్‌’, ‘అఖండ’.. మూడు చిత్రాలు బాక్సాఫీస్‌ వద్ద భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు నాలుగోసారి ఈ మాస్‌ కాంబో రిపీట్‌ కానుంది. నేడు బాలకృష్ణ (Balakrishna) పుట్టినరోజు సందర్భంగా సోషల్‌ మీడియాలో ఆయనకు విషెస్‌ వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో బోయపాటితో (Boyapati Srinu) సినిమాను అధికారికంగా ప్రకటించారు. #BB4 అనే వర్కింగ్‌ టైటిల్‌తో ఇది తెరకెక్కనుంది. 14రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ బ్యానర్‌పై రామ్‌ ఆచంట, గోపి ఆచంట దీని నిర్మిస్తున్నారు. ఇక ఈ చిత్రానికి బాలయ్య కూతురు తేజస్విని కూడా నిర్మాతగా వ్యవహరించడం గమనార్హం. 

2021లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘అఖండ’ (Akhanda) బాలయ్య కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌ల జాబితాలో చేరింది. దీనికి సీక్వెల్‌ ఉంటుందని బోయపాటి గతంలో చెప్పిన విషయం తెలిసిందే. ఇప్పుడీ #BB4.. ‘అఖండ’నా లేదంటే కొత్త సినిమానా అనేది క్లారిటీ రావాల్సి ఉంది. ఇటీవల ఈ సీక్వెల్‌ గురించి బోయపాటి మాట్లాడుతూ..‘‘ ఎన్నికల హడావిడి పూర్తయ్యాక ‘అఖండ2’ పై అధికారిక ప్రకటన ఉంటుంది. ‘అఖండ’లో పసిబిడ్డ.. ప్రకృతి.. పరమాత్మ.. కాన్సెప్ట్‌లనే చూపించాం. దీని సీక్వెల్‌లోనూ సమాజానికి కావాల్సిన ఓ మంచి విషయం ఉంటుంది. దైవత్వం మనందరిలో ఒక భాగం. దాన్ని తెరపై చూపిస్తే ప్రేక్షకులు ఆదరిస్తారు’ అని తెలిపారు. ఇప్పుడు ఎన్నికల హడావిడంతా అయిపోయింది కాబట్టి దీని గురించే ప్రకటన చేశారా అని సినీ ప్రియులు భావిస్తున్నారు.

ప్రస్తుతం బాలకృష్ణ బాబీ దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్‌ (#NBK109) చేస్తోన్న సంగతి తెలిసిందే. నేడు ఆయన బర్త్‌డే సందర్భంగా గ్లింప్స్‌ను విడుదల చేసి విషెస్‌ చెప్పింది. అందులో బాలయ్య మాస్‌ లుక్‌లో ఉన్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్‌ నటుడు బాబీ దేవోల్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు