Bharathanatyam: ఆ హద్దులు లేకుండా భరతనాట్యం చేశా

‘‘ప్రేక్షకుడికి వినోదం పంచడానికి ఏయే అంశాలు కావాలో అవన్నీ ‘భరతనాట్యం’లో చాలా బాగా కుదిరాయి

Updated : 02 Apr 2024 09:41 IST

‘‘ప్రేక్షకుడికి వినోదం పంచడానికి ఏయే అంశాలు కావాలో అవన్నీ ‘భరతనాట్యం’లో చాలా బాగా కుదిరాయి. ఇలాంటి అంశంతో ఇప్పటివరకూ సినిమా రాలేదు’’ అన్నారు దర్శకుడు కె.వి.ఆర్‌.మహేంద్ర. తొలి చిత్రం ‘దొరసాని’తో ప్రేక్షకుల్ని మెప్పించిన ఆయన, రెండో ప్రయత్నంగా ‘భరతనాట్యం’ తెరకెక్కించారు. సూర్య తేజ ఏలే, మీనాక్షి గోస్వామి జంటగా నటించగా, పాయల్‌ సరాఫ్‌ నిర్మించారు. ఈ చిత్రం ఈ నెల 5న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా  కె.వి.ఆర్‌.మహేంద్ర సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘భరతనాట్యం’.. పేరునిబట్టి నృత్యంతో ముడిపడిన కథా అంటున్నారు. నృత్యానికీ, ఈ కథకీ సంబంధం లేదు. సహజమైన ఓ పీరియాడిక్‌ కథతో నా తొలి చిత్రం ‘దొరసాని’ చేశా. ఆ కథకు తగ్గట్టుగా  కొన్ని హద్దుల మధ్యే ఆ సినిమా చేయాల్సి వచ్చింది. కానీ ‘భరతనాట్యం’ చిత్రాన్ని ఆ హద్దులు లేకుండా చేశా. ‘దొరసాని’ చేసిన అనుభవం కూడా తోడైంది. దర్శకుడిగా నా ప్రయాణాన్ని చాలా ఆస్వాదించా. నటులంతా వాళ్లు గతంలో చేసిన పాత్రలకి భిన్నంగా కనిపిస్తారు. వాళ్ల కోసం కొత్త పాత్రల్ని సృష్టించేలా నా సినిమా ప్రభావం చూపిస్తుంది. సూర్యతేజ ఈ కథ రాస్తున్నప్పుడు తాను హీరోగా చేస్తానని అనుకోలేదు. కానీ తను కథ చెబుతున్నప్పుడు తను కథానాయకుడి పాత్రలో ఉన్నట్టే అనిపించింది. ఓ రచయిత ప్రతి పాత్రలోకీ వెళ్లగలడు. అందుకే సూర్యతేజ చేస్తే ఈ పాత్ర బాగుంటుందని నమ్మా. దర్శకుడు కావాలని కలలుగంటూ ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న ఓ సహాయకుడిగా తను కనిపిస్తాడు. ఆ సహాయ దర్శకుడికీ, నేర ప్రపంచానికీ మధ్య సంబంధమేమిటనేది ఈ చిత్ర కథ. నిర్మాత ఎక్కడా రాజీ పడలేదు’’.  

 ‘‘మంచి కథ ఉన్న సినిమాల్ని ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వేసవి వినోదం అంటే మనకు సినిమానే. బాగున్న ప్రతి చిత్రాన్ని చూస్తారు. ఆ నమ్మకంతోనే ఏప్రిల్‌ 5న వస్తున్నాం. ఇది డార్క్‌ కామెడీతో కడుపుబ్బా నవ్విస్తుంది. తర్వాత క్రైమ్‌ డ్రామాతోనే సినిమా చేయబోతున్నా. రేపటి నుంచే చిత్రీకరణ మొదలు పెట్టేలా మూడు స్క్రిప్ట్‌లు సిద్ధంగా ఉన్నాయి’’.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని