Bujji And Bhairava: బుజ్జి అండ్‌ భైరవ.. యానిమేటెడ్‌ సిరీస్‌ ఎలా ఉంది?

‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా రూపొందించిన బుజ్జి అండ్‌ భైరవ.. యానిమేటెడ్‌ సిరీస్‌ ఎలా ఉందంటే?

Updated : 01 Jun 2024 14:06 IST

Bujji And Bhairava: ప్రస్తుతం భారతీయ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) ఒకటి. పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ (Prabhas) కథానాయకుడిగా నాగ్‌ అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ జూన్‌ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ప్రచార కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భైరవ పాత్రలో ప్రభాస్‌ నటిస్తుండగా, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సాయంతో ఆలోచించే మెషీన్‌.. ‘బుజ్జి’గా కీలక పాత్ర పోషిస్తోంది. దీనికి కథానాయిక కీర్తి సురేశ్‌ వాయిస్‌ ఓవర్‌ అందించారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్‌ వచ్చింది. ఈ క్రమంలో భైరవ, బుజ్జి అసలు ఎలా కలిశారన్న పాయింట్‌ను ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు నాగ్‌ అశ్విన్‌ టీమ్‌ సరికొత్త పంథాను అనుసరించింది. ‘బుజ్జి అండ్‌ భైరవ’ పేరుతో యానిమేటెడ్‌ సిరీస్‌ తీసుకొచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో వేదికగా స్ట్రీమింగ్‌ అవుతున్న ఈ సిరీస్‌ ఎలా ఉంది? (Bujji And Bhairava Review) బుజ్జి, భైరవ ఎలా కలిశారు?

కథేంటంటే: అది 2896 ఏడీ. అంటే కల్కి మూవీ జరిగే కాలానికి రెండేళ్ల ముందు. ఎన్నో ఏళ్లుగా కార్గో వెహికల్‌లో పనిచేసే ఏఐ మెషీన్‌ బుజ్జికి ప్రమోషన్‌ వచ్చి, కాంప్లెక్స్‌ మెంబర్‌ అయిన వ్యక్తికి ప్రైవేటు వెహికల్‌ కావడానికి సిద్ధమవుతుంటుంది. ఈ క్రమంలో చివరి కార్గో డెలివరీ చేయడానికి వెళ్తుండగా రెబల్స్‌ అటాక్‌ చేసి, ఆ షిప్‌ను కూల్చేస్తారు. దీంతో బుజ్జికి కాంప్లెక్స్‌ సిటీతో కనెక్షన్‌ కట్‌ అయిపోయి స్క్రాప్‌లోకి వెళ్లిపోతుంది. కాశీ పట్టణంలో సరదాగా తిరుగుతూ దొంగలను, దోపిడీదారులను పట్టుకుని యూనిట్స్‌ (క్రిప్టో కరెన్సీలాంటిది) బాగా సంపాదించి, కాంప్లెక్స్‌ మెంబర్‌ కావాలనుకుంటాడు భైరవ (ప్రభాస్‌). కానీ, ఏ పని చేసినా వచ్చే లాభం కన్నా నష్టమే ఎక్కువ. పైగా ఇంటి యజమాని (బ్రహ్మానందం)కి అద్దె కూడా చెల్లించడు. దొంగలను పట్టుకునే క్రమంలో ఓ బైక్‌ ముక్కలైపోవడంతో దాన్ని స్క్రాప్‌నకు వేసేందుకు తీసుకెళ్తాడు. అక్కడే భైరవకు బుజ్జి పరిచయం అవుతుంది. బుజ్జి ఆలోచనతో భైరవ ఓ స్పెషల్‌ కారును ఎలా తయారు చేశాడు? ఈ క్రమంలో అతడికి ఎదురైన పరిస్థితులు ఏంటి?

ఎలా ఉందంటే..: సాధారణంగా హిట్‌ అయిన సినిమాలకు కొనసాగింపుగా కామిక్స్‌, సిరీస్‌లు, బుక్స్‌ వస్తుంటాయి. ‘బాహుబలి’కి సంబంధించి ఇలాంటివి చూశాం. కానీ, ఇంకా విడుదల కాని సినిమా, అందులోని పాత్రలను ప్రేక్షకులకు చేరువ చేసేందుకు యానిమేటెడ్‌ సిరీస్‌ ద్వారా పరిచయం చేయాలనుకున్న దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ ఆలోచనకు హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. లార్జర్‌ దేన్‌ లైఫ్‌ సినిమాల్లోని పాత్రలను పోస్టర్స్‌, టీజర్స్‌ ద్వారా పరిచయం చేసినా, ప్రేక్షకుడు వాటికి కనెక్ట్‌ కావడానికి కొద్ది సమయం పడుతుంది. తాను తీస్తున్న ‘కల్కి’లాంటి  సైన్స్‌ ఫిక్షన్‌ మూవీస్‌ విషయంలో ఇలాంటి వాటికి తావులేకుండా చేసేందుకు తీసుకొచ్చిన ‘బుజ్జి అండ్‌ భైరవ’ యానిమేటెడ్‌ సిరీస్‌లో ఆ రెండు పాత్రలను పరిచయం చేసిన తీరు అరటిపండు వలిచినట్లు ఉంది. కార్గో షిప్‌లో బుజ్జి, కాశీ పట్టణంలో భైరవ ఇలా రెండు పాత్రలు, వాటి స్వభావాలను తొలి ఎపిసోడ్‌లో పరిచయం చేసి, ఇద్దరూ కలిసి ఏం చేశారన్నది రెండో ఎపిసోడ్‌లో చూపించారు. ప్రభాస్‌ పాత్రకు యాక్షన్‌తో పాటు ఎంటర్‌టైనింగ్‌ జోడించడం బాగుంది. మధ్యలో బ్రహ్మానందం పాత్ర చెప్పే డైలాగ్‌లు నవ్వులు పంచుతాయి. గ్రీన్‌ గోల్డ్‌ యానిమేషన్‌ సంస్థ సిరీస్‌ను చక్కగా తీసుకొచ్చింది. ఎడిటింగ్‌ కూడా షార్ప్‌గా ఉంది. మూవీ థీమ్‌కు సరిపోయేలా పాత్రలను డిజైన్‌ చేసిన విధానం, కాశీని చూపించిన తీరు బాగున్నాయి. ఇక బుజ్జి పాత్రకు కీర్తిసురేశ్‌ వాయిస్‌ సరిగ్గా సరిపోయింది. బుజ్జి, భైరవ తమ లక్ష్యాల కోసం కలిసి ఏం చేశారన్నది ఇంకా కొనసాగిస్తారేమో చూడాలి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని