Nag Ashwin: సాహసోపేతమైన ప్రయోగమిది: నాగ్‌ అశ్విన్‌

‘కల్కి 2898 ఎ.డి’ చిత్రంతో సినీప్రియుల్ని అలరించనున్నారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించారు.

Published : 31 May 2024 01:51 IST

‘కల్కి 2898 ఎ.డి’ చిత్రంతో సినీప్రియుల్ని అలరించనున్నారు ప్రభాస్‌. ఆయన కథానాయకుడిగా నటించిన ఈ చిత్రాన్ని నాగ్‌ అశ్విన్‌ తెరకెక్కించారు. వైజయంతీ మూవీస్‌ సంస్థ నిర్మించింది. దీపికా పదుకొణె కథానాయిక. అమితాబ్‌ బచ్చన్, కమల్‌హాసన్, దిశా పటానీ ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 27న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార పర్వాన్ని వేగవంతం చేసింది చిత్ర బృందం. ఇందులో భాగంగా ఇటీవల బుజ్జి కారును పరిచయం చేశారు. ఇప్పుడు బుజ్జితో కలిసి భైరవగా ప్రభాస్‌ చేసే సాహసాల్ని ‘బుజ్జి అండ్‌ భైరవ’ పేరుతో ఓ యానిమేటెడ్‌ సిరీస్‌ రూపంలో అందుబాటులోకి తీసుకొస్తున్నారు. ఆ సిరీస్‌ ఈ రోజు నుంచి ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌లో సందడి చేయనుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్‌లో దీని ట్రైలర్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా దర్శకుడు నాగ్‌ అశ్విన్‌ మాట్లాడుతూ.. ‘‘ఈ చిత్రంలో బుజ్జి, భైరవల వినోదం అందర్నీ బాగా అలరిస్తుంది. సినిమా విడుదలకు ముందే ఇలాంటి ఓ సిరీస్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం మా నిర్మాణ సంస్థ చేసిన సాహసోపేతమైన ప్రయోగం. అసలే మాకిది కొత్త జానర్‌. ఈ చిత్రాన్ని యానిమేషన్‌ సిరీస్‌తో ప్రారంభించడం కొత్త విషయం. రెండేళ్ల క్రితం మాకు ఈ ఆలోచన వచ్చినప్పుడు ఇదెంత కష్టమో మాకు తెలియదు. మేము ఈ సిరీస్‌ కోసం ‘ఛోటా భీమ్‌’ లాంటి యానిమేషన్‌ సిరీస్‌లను రూపొందించిన గ్రీన్‌ గోల్డ్‌ సంస్థతో పని చేశాం. వాళ్ల సహకారానికి కృతజ్ఞతలు. ఈ ‘కల్కి..’ కోసం మేము వైజయంతీ మూవీస్, వైజయంతీ ఆటోమొబైల్స్, వైజయంతీ యానిమేషన్‌ అనే మూడు విభిన్న కంపెనీల్ని నడిపించాము’’ అన్నారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని