Curry and Cyanide: నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టిస్తున్న క్రైమ్‌ డాక్యుమెంటరీ

Curry And Cyanide: ‘కర్రీ అండ్‌ సైనైడ్‌’ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్‌ అవుతున్న టాప్‌-10 కంటెంట్‌లలో ఒకటిగా నిలిచింది.

Published : 05 Jan 2024 01:40 IST

హైదరాబాద్‌: ఎలాంటి కమర్షియల్‌ హంగులు లేకుండా వాస్తవ పరిస్థితులు, నిజ జీవిత సంఘటనలను సూటిగా చెబుతాయి డాక్యుమెంటరీలు. సినిమాలు, వెబ్‌సిరీస్‌లు చూడటానికి ఇష్టపడే యువత డాక్యుమెంటరీల విషయంలో కాస్త వెనుకబడిందనే చెప్పాలి. కానీ, నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా ఇటీవల విడుదలైన ‘కర్రీ అండ్‌ సైనైడ్‌’ (Curry & Cyanide) మాత్రం భాషతో సంబంధం లేకుండా ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 30కు పైగా దేశాల ప్రేక్షకుల ఆదరణ పొందింది. కేరళలో జరిగిన వరుస హత్యల నేపథ్యంలో ‘కర్రీ అండ్‌ సైనైడ్‌: ది జాలీ జోసెఫ్‌ కేస్‌’ రూపొందింది. క్రిస్టో టామీ దీనికి దర్శకత్వం వహించారు. డిసెంబర్‌ 22వ తేదీ నుంచి అందుబాటులోకి వచ్చిన ఈ డాక్యుమెంటరీ నెట్‌ఫ్లిక్స్‌ టాప్‌-10 స్ట్రీమింగ్‌ కంటెంట్‌లలో ఒకటిగా నిలిచింది.

ఇంతకీ కథేంటంటే: కేరళలోని కూడతైకి చెందిన జాలీ అలియాస్‌ జాలీ జోసెఫ్‌కు విలాసవంతమైన జీవితం గడపాలని ఆశ. అందుకు అడ్డుగా ఉన్న అత్తను, ఆస్తి కోసం మామను, అనుమానించాడని భర్తను, బాబాయ్‌ను ఆహారంలో సైనైడ్‌ పెట్టి చంపేసింది. తాను మరో పెళ్లి చేసుకోవడానికి అడ్డుగా ఉందని స్నేహితురాలు, ఆమె కూతురుకి సైనైడ్ ఇచ్చి దారుణంగా హతమార్చింది. ఆరుగురిని హత్య చేసినా పోలీసులకు ఏ మాత్రం అనుమానం రాకుండా జాగ్రత్త పడింది. దాదాపు ఆరేళ్ల తర్వాత జాలీ ఆడపడుచు ధైర్యం చేసి, పోలీసులకు చెప్పడంతో ఈ దారుణాలు వెలుగులోకి వచ్చాయి. గంటన్నర నిడివి గల ‘కర్రీ అండ్‌ సైనైడ్‌’ తెలుగు భాషలోనూ స్ట్రీమింగ్‌ అవుతోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని