ప్రపంచంలో ఎక్కువ మంది చూసిన టీవీ షో ఇదే.. ఎన్ని కోట్లమంది చూశారంటే..

ప్రపంచంలో అత్యధిక మంది చూసిన టీవీ షోగా బేవాచ్‌ రికార్డు సృష్టించింది.

Published : 22 Mar 2024 00:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వినోదరంగంలో సినిమాలకు ఎంత ప్రాధాన్యం ఉంటుందో టీవీ షోలకు, సీరియల్స్‌కు కూడా అంతే క్రేజ్‌ ఉంటుంది. కోట్ల మంది ప్రేక్షకులు వీటిని చూసి ఎంజాయ్‌ చేస్తుంటారు. అయితే ఇప్పటివరకు ప్రపంచంలో ఎక్కువమంది చూసిన టీవీ షో ఏది.. దాన్ని ఎన్ని కోట్ల మంది వీక్షించారో ఇప్పుడు తెలుసుకుందాం..

కొన్ని సంవత్సరాల క్రితం మన దూరదర్శన్‌లో వచ్చిన రామాయణం, మహాభారతం సీరియల్స్‌ను ఎవరూ మర్చిపోలేరు. అవి మన దేశంలో ఎక్కువ వ్యూస్‌తో రికార్డు సృష్టించాయి. అయితే, ప్రపంచంలో ఎక్కువమంది చూసిన షో మాత్రం ‘బేవాచ్‌’ (Baywatch). ఈ అమెరికన్‌ టీవీ షోను 1996లో ఒక్క వారంలోనే 110కోట్ల మందికి పైగా వీక్షించారు. దీంతో ఇది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డును సొంతం చేసుకుంది. అప్పుడు నమౌదైన ఆ రికార్డును 28 ఏళ్లు గడుస్తున్నా ఏ ఇతర టీవీ షో కూడా బ్రేక్‌ చేయలేకపోయింది. లాస్‌ ఏంజిల్స్‌, కాలిఫోర్నియాలోని బీచ్‌ల్లో ఉండే కొందరు లైఫ్ గార్డ్స్‌ జీవితాల చుట్టూ తిరిగే కథే ఈ ‘బేవాచ్‌’. 1989 సెప్టెంబర్‌ 22న దీని మొదటి ఎపిసోడ్‌ ప్రసారమైంది. 1990ల్లో యువత దీన్ని అసలు మిస్‌ కాకుండా ఫాలో అయ్యేవారు. ఈ షోను ఏకంగా 148 దేశాల్లో 44 భాషల్లో టెలీకాస్ట్‌ చేయడం విశేషం.

ఇండియాలో ఒకప్పుడు రామాయణం, మహాభారతం సీరియల్స్ కోసం ప్రేక్షకులు ఎదురుచూసేవారు. ఆ ఇతిహాసాలను మొత్తం 16 కోట్ల మంది వీక్షించారు. ‘బేవాచ్‌’ను వీటి కంటే ఏడురెట్లు ఎక్కువ మంది ప్రేక్షకులు వీక్షించారు. ఇండియన్‌ సీరియల్సే కాదు.. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది మెచ్చిన అనేక అమెరికన్‌ షోలు కూడా ‘బేవాచ్‌’ రికార్డును చేరుకోలేకపోయాయి. నెట్‌ఫ్లిక్స్‌లో సంచలనం సృష్టించిన కొరియన్‌ సెన్సేషన్‌ ‘స్క్విడ్‌ గేమ్‌’ వెబ్‌ సిరీస్ కూడా గరిష్ఠంగా 50కోట్ల మార్క్‌నే చేరుకోగలిగింది. అంటే ‘బేవాచ్‌’ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఏరేంజ్‌లో ఉందో అర్థమవుతోంది. భవిష్యత్తులో దీని రికార్డును చేరుకోగలిగే షో ఏమైనా వస్తుందేమో వేచిచూడాలి.

‘బేవాచ్‌’ విషయానికొస్తే.. మైఖేల్ బెర్క్, డగ్లస్,  గ్రెగొరీ, బోనాన్‌లు దీన్ని రూపొందించారు. 1989 నుంచి 2001 వరకు మొత్తం 11 సీజన్లు ఇది ప్రసారమైంది. దీని ఆధారంగానే 2017లో ‘బేవాచ్‌’ అనే పేరుతో సినిమాను తెరకెక్కించారు. అందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా నటించి మెప్పించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని