Adipurush: ‘ఆదిపురుష్‌’.. రావణుడి పాత్రను అలా చూపడం నచ్చలేదు: ‘రామాయణ్‌’ సీత

‘ఆదిపురుష్‌’లో పాత్రల వేషధారణ చూసి తనకు ఎంతో బాధేసిందని రామాయణ్ నటి దీపికా చిఖ్లియా అన్నారు. తాజాగా ఓ ఆంగ్ల ప్రతికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సినిమాపై మాట్లాడారు.

Published : 09 Jun 2024 00:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభాస్‌ హీరోగా ఓంరౌత్‌ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్‌’ (Adipurush). ఈ చిత్రంలోని పాత్రల వేషధారణలపై ఎన్నో వివాదాలు వచ్చిన సంగతి తెలిసిందే. రామాయణ్‌ సీరియల్‌లో సీతగా నటించిన దీపికా చిఖ్లియా (Dipika Chikhlia) తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ చిత్రంలోని పాత్రలపై అసంతృప్తి వ్యక్తంచేశారు.

కథను.. కళను నమ్మిన సంస్థే ‘ఉషా కిరణ్‌’.. సినీ రంగంలో రామోజీ ప్రస్థానమిది

‘ఆదిపురుష్‌’ చూసిన పిల్లలు రామాయణం అంటే ఇలానే ఉంటుందేమోనని భావిస్తారు. అది భవిష్యత్తుకే ప్రమాదకరం. ఆ విషయం తలచుకుంటే బాధేస్తుంది. ఈ చిత్రంలో చూపించినట్లు రావణుడు ఉండడని వాళ్లకు ఎవరూ వివరించడం లేదు. దీంతో రామాయణంలో రాముడు, సీత కూడా ఇలానే ఉంటారని వారు నిర్ణయించుకుంటున్నారు. రావణుడు గొప్ప శివభక్తుడు. ఆయనలో చాలా మంచి లక్షణాలున్నాయి. ఆయన జీవితంలో చేసిన ఒకేఒక్క తప్పు సీతను అపహరించడమే. ఆ ఒక్కటి చేయకపోతే ఆయన గొప్ప పండితుడిలా ఉండేవారు. అంత గొప్ప వ్యక్తిని ‘ఆదిపురుష్‌’లో రోడ్‌సైడ్ రౌడీలా చూపించడం నన్ను బాధించింది. నేను ఈ సినిమాను ఇప్పటివరకు పూర్తిగా చూడలేదు. టీవీలో కొంతభాగం చూసేసరికే తట్టుకోలేకపోయాను. సీతాదేవిని గులాబీరంగు చీరలో చూపడం, రావణాసురుడిని విభిన్నమైన ఆహార్యంలో చూపించడం ఏమాత్రం నచ్చలేదు. సృజనాత్మకంగా ఏదో కొత్తగా చూపించాలనే తాపత్రయంలో రామాయణం గొప్పతనాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ ఇతిహాసాల జోలికిపోకుండా యువతలో స్ఫూర్తి నింపే స్వాతంత్ర్య సమరయోధుల చరిత్రలను సినిమాలుగా తీస్తే బాగుంటుంది’ అని దీపికా అభిప్రాయపడ్డారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని