Dipika Chikhlia: ఆ సినిమా చేసుంటే.. ‘సీత’ పాత్ర దక్కేది కాదేమో!

సీనియర్‌ నటి దీపికా చిఖ్లియా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని, పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. 

Published : 27 May 2024 16:20 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: రామానంద్‌ సాగర్‌ రూపొందించిన‌ ‘రామాయణ్‌’ (Ramayan) సీరియల్‌లో సీతగా నటించి, ప్రేక్షకులను విశేషంగా అలరించిన నటి దీపికా చిఖ్లియా (Dipika Chikhlia). తనకెంతో గుర్తింపు తీసుకొచ్చిన ఆ పాత్ర అవకాశం ఎలా దక్కిందో తాజాగా పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ‘రామ్‌ తేరీ గంగా మైలీ’ (Ram Teri Ganga Maili) సినిమాలో నటించకపోవడం వల్లే సీతగా నటించే సదవకాశం తనకు దక్కిందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

‘‘కెరీర్‌ ప్రారంభంలో హీరోయిన్‌గా కొన్ని చిన్న సినిమాల్లో నటించా. అది సంతృప్తినివ్వకపోవడంతో ఇండస్ట్రీని వదిలేయాలనుకున్నా. ఆ సమయంలో ఓ ఆడిషన్‌ గురించి తెలిసింది. రీమా (నటుడు, దర్శకుడు రాజ్‌కపూర్‌ కుమార్తె)  ఫ్రెండ్ వాళ్ల నాన్న, మా నాన్న స్నేహితులు. ఆయన ఓ రోజు నన్ను కలిసి.. రాజ్‌కపూర్‌ ‘రామ్‌ తేరీ గంగా మైలీ’ సినిమా కోసం వర్ధమాన నటులను ఎంపిక చేసే ఆలోచనలో ఉన్నారని చెప్పారు. ఆసక్తితో నేను రాజ్‌కపూర్‌ని మీట్‌ అయ్యా. ఆయన నన్ను అడిగిన తొలి ప్రశ్న ‘నీ వయసెంత?’. 17 ఏళ్లు అని సమాధానమిచ్చా. ‘చాలా చిన్న వయసు..’ అనుకుంటూ నన్ను తిరస్కరించారు. కొంతకాలం తర్వాత సినిమా విడుదలైంది. మా అమ్మతో కలిసి చిత్రాన్ని చూసేందుకు థియేటర్‌కు వెళ్లా. కొన్ని సీన్స్‌ చూసి షాకయ్యా. ఆ మూవీలో నటించే ఛాన్స్‌ మిస్‌ కావడంతో మంచే జరిగింది అనుకున్నా. ఒకవేళ ఆ చిత్రంలో నటించి ఉంటే ‘రామాయణ్‌’లో సీత పాత్ర దక్కేది కాదేమో’’ అంటూ నాటి సంగతులు నెమరు వేసుకున్నారు.

‘ది గోట్‌’.. ఫ్యాన్స్‌ ఖుష్ అయ్యే అప్‌డేట్‌ ఇచ్చిన మ్యూజిక్‌ డైరెక్టర్‌

‘లవ కుశ్‌’, ‘ది స్వార్డ్‌ ఆఫ్‌ టిప్పు సుల్తాన్‌’ తదితర ధారావాహికల్లో నటిస్తూనే హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళ్‌, గుజరాతీ, తెలుగు చిత్రాల్లోనూ నటించారు దీపికా చిఖ్లియా. ‘యమపాశం’, ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యారు. రాజీవ్‌ కపూర్‌, మందాకిని ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన సినిమానే ‘రామ్‌ తేరీ గంగా మైలీ’. 1985లో విడుదలైంది. మందాకిని బిడ్డకు పాలివ్వడం, జలపాతం వద్ద ట్రాన్స్‌పరెంట్‌ చీరలో స్నానం చేయడం వంటి సన్నివేశాలు అప్పట్లో తీవ్ర వివాదానికి దారితీశాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని