Dhruva Natchathiram: ఇన్నేళ్లలో ఏం చేశారంటూ నెటిజన్‌ ప్రశ్న.. దర్శకుడి సమాధానమేంటంటే?

విక్రమ్‌ హీరోగా దర్శకుడు గౌతమ్‌ మేనన్‌ తెరకెక్కించిన చిత్రం ‘ధ్రువ నక్షత్రం’. ఆరేళ్ల క్రితం విడుదలకావాల్సిన ఈ చిత్రం ఇప్పుడు వస్తుండడంపై ఓ నెటిజన్‌ కామెంట్‌ చేయగా గౌతమ్‌ స్పందించారు.

Published : 27 Oct 2023 01:43 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరేళ్ల క్రితం విడుదలకావాల్సిన ‘ధ్రువ నక్షత్రం’ (Dhruva Natchathiram) ఇప్పుడు విడుదలకానుండంపై ఓ నెటిజన్‌ పెట్టిన పోస్ట్‌కు ఆ చిత్ర దర్శకుడు గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ (Gautham Vasudev Menon) స్పందించారు. ‘‘నేను కాలేజీలో సెకండ్‌ ఇయర్‌ చదివే రోజుల్లో ‘ధ్రువ నక్షత్రం’ సినిమాని ప్రకటించారు. ప్రస్తుతం నేను ఓ మల్టీ నేషనల్‌ కంపెనీలో పనిచేస్తున్నా. మూడేళ్లు అనుభవం గడించా. ఇన్నేళ్లలో మీరేం చేశారు?’’ అని సదరు నెటిజన్‌ తన ఫాలోవర్స్‌ను ప్రశ్నించారు. తనను ట్యాగ్‌ చేయకపోయినా గౌతమ్‌ మేనన్‌ దీనికి బదులిస్తూ.. ‘‘వృత్తిపరంగా నేనెంతో నేర్చుకున్నా. ఇన్నేళ్లలో నేను దర్శకత్వం వహించిన మూడు సినిమాలు, నాలుగు ఆంథాలజీ వెబ్‌సిరీస్‌లు, ఐదు మ్యూజిక్‌ వీడియోలు విడుదలయ్యాయి. మరొకటి సిద్ధంగా ఉంది’’ అని తెలిపారు.

విక్రమ్‌ సినిమా పూర్తి చేయడానికే నటుడిగా మారా: గౌతమ్‌ మేనన్‌

సెలబ్రిటీ ఇంత పాజిటివ్‌గా రిప్లై ఇవ్వడం చూడలేదంటూ కొందరు నెటిజన్లు కామెంట్లు పెట్టారు. మరోవైపు, ఇటీవల విడుదలైన ధ్రువ నక్షత్రం సినిమా ట్రైలర్‌ బాగుందని చెప్పిన వారికి గౌతమ్‌ కృతజ్ఞతలు తెలిపారు. తమిళ నటుడు విక్రమ్‌ (Vikram) హీరోగా రూపొందిన చిత్రమిది. స్పై, యాక్షన్‌ థ్రిల్లర్‌గా సిద్ధమైన ఈ సినిమా  2017లోనే విడుదలకావాల్సి ఉంది. అయితే, పలు కారణాల వల్ల వాయిదా పడింది. కొన్ని రోజుల క్రితమే సెన్సార్‌ పూర్తయింది. దాదాపు 2 గంటల 25 నిమిషాల నిడివి ఉన్న ఈ చిత్రానికి యూ/ఏ సర్టిఫికేట్‌ను సెన్సార్‌ బోర్డు జారీ చేసింది.  రీతూవర్మ, సిమ్రాన్‌, ఐశ్వర్య రాజేశ్‌, రాధిక, తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం నవంబరు 24న రిలీజ్‌ కానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని