Eagle: అందుకే ‘ఈగల్‌’ టైటిల్‌ పెట్టాం.. రవితేజ నుంచి నేర్చుకుందదే : దర్శకుడు కార్తీక్

రవితేజ నటించిన తాజా చిత్రం ‘ఈగల్‌’.  ఫిబ్రవరి 9న సినిమా విడుదల కానున్న సందర్భంగా దర్శకుడు కార్తీక్‌ ఘట్టమనేని విలేకరుల సమావేశంలో పాల్గొని, పలు విషయాలు పంచుకున్నారు.

Updated : 08 Feb 2024 18:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘కార్తికేయ’, ‘కార్తికేయ 2’, ‘నిన్నుకోరి’, ‘ధమాకా’ తదితర చిత్రాలకు సినిమాటోగ్రఫీ అందించి గుర్తింపు పొందారు కార్తీక్‌ ఘట్టమనేని (Karthik Gattamneni). ‘సూర్య వర్సెస్‌ సూర్య’ (Surya vs Surya)తో దర్శకుడిగా మారిన ఆయన.. కొంత విరామం అనంతరం ‘ఈగల్‌’ (Eagle)ను తెరకెక్కించారు. రవితేజ (Ravi Teja) హీరోగా రూపొందిన ఈ సినిమా ఈనెల 9న ప్రేక్షకుల ముందుకురానుంది. ఈసందర్భంగా దర్శకుడు హైదరాబాద్‌లో మీడియాతో ముచ్చటించారు. సినిమాకు ఆ టైటిల్‌ ఎందుకు పెట్టాల్సివచ్చిందో, రవితేజ నుంచి తానేం నేర్చుకున్నారో చెప్పారు.

‘‘రవితేజ సర్‌తో ‘ధమాకా’ సినిమాకి పనిచేస్తున్న సమయంలో ‘ఈగల్‌’ కథ వినిపించా. ‘బాగుంది చేసేద్దాం’ అని నాలో జోష్‌ నింపారు. ఆయన నటన గురించి సంగతి అందరికీ తెలిసిందే. ఇందులో కొత్త రవితేజను ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేశా. హీరో పాత్రే కాదు దాన్ని ఎలివేట్‌ చేసే ఇతర పాత్రలూ ఆడియన్స్‌పై మంచి ప్రభావం చూపుతాయి. కొన్ని కిలోమీటర్ల ఎత్తులో ఉన్నా ఈగల్‌ భూమిపై ఉండే వాటిని స్పష్టంగా చూడగలదు. ఈ సినిమాలోని కథానాయకుడికి అలాంటి ‘ఐ’ పవర్‌ ఉంటుంది. పైగా ఆ క్యారెక్టర్‌ కోడ్‌ నేమ్‌ కూడా ఈగల్‌. అందుకే ఈ చిత్రానికి ఆ పేరు పెట్టాం. ఇదే టైటిల్‌తో హిందీలో ఓ సినిమా ఉండడంతో ‘సహదేవ్‌ వర్మ’ (హీరో పాత్ర పేరు)గా అక్కడ విడుదల చేస్తున్నాం. క్లైమాక్స్‌ షూటింగ్‌ను వారంలో పూర్తి చేయాలనుకుంటే 17 రాత్రుళ్లు పట్టింది. ఈ స్టోరీకి సౌండ్‌ డిజైనింగ్‌ ప్రధాన బలం. దానికోసం ఆరు నెలలు కష్టపడ్డాం. యూరప్‌లో నిజమైన తుపాకీలు పేల్చి, ఆ సౌండ్‌ని రికార్డు చేశాం’’

ఆ విషయం ముందే చెప్పడం నాకు ఇష్టంలేదు: వరుణ్‌తేజ్‌తో రవితేజ

‘‘రవితేజ సెల్ఫ్‌ కంట్రోల్‌ ఉన్న మనిషి. ఆయన్నుంచి క్రమశిక్షణ నేర్చుకున్నా. నేను తదుపరి తేజ సజ్జాతో ఓ సినిమా చేయబోతున్నా. త్వరలోనే సంబంధిత వివరాలు ప్రకటిస్తాం’’ అని డైరెక్టర్‌ తెలిపారు. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రూపొందిన ‘ఈగల్‌’లో కావ్యా థాపర్‌, అనుపమ పరమేశ్వరన్‌, నవదీప్‌, వినయ్‌రాయ్‌, అవసరాల శ్రీనివాస్‌ కీలకపాత్రలు పోషించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని