Krishna Vamsi: ప్రేక్షకులదెప్పుడూ తప్పు కాదు.. నాదే కావొచ్చు: అభిమానికి కృష్ణవంశీ రిప్లై

‘‘హనుమాన్‌’ కంటే ‘శ్రీ ఆంజనేయం’ సినిమా నాకు నచ్చింది. అది ప్రేక్షకులకు అర్థం కాలేదు’’ అని ఓ సినీ అభిమాని పెట్టిన పోస్ట్‌పై దర్శకుడు కృష్ణవంశీ స్పందించారు.

Updated : 12 Feb 2024 17:50 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సామాజిక మాధ్యమం ఎక్స్‌ (ఇంతకుముందు ట్విటర్‌)లో యాక్టివ్‌గా ఉండే దర్శకుల్లో కృష్ణవంశీ (Krishna Vamsi) ఒకరు. వ్యక్తిగత విషయాలు ఎక్కువగా పంచుకోకపోయినా అభిమానులు ఎవరైనా తన సినిమాల గురించి పోస్ట్‌ పెడితే స్పందిస్తుంటారు. తనదైన శైలిలో సమాధానమిస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తారు. ‘‘ఎందుకో తెలియదుగానీ ‘హనుమాన్‌’ (Hanu-Man)కంటే ‘శ్రీ ఆంజనేయం’ (Sri Anjaneyam) చిత్రమే నాకు బాగా నచ్చింది. శ్రీ ఆంజనేయం.. సూపర్‌ సినిమా. ప్రేక్షకులకు అది అర్థం కాలేదు’’ అని ఓ సినీ అభిమాని పోస్ట్‌ పెట్టాడు. దానికి కృష్ణవంశీ రిప్లై ఇస్తూ.. ‘‘ప్రేక్షకులదెప్పుడూ తప్పు కాదు. వారికి సినిమా నచ్చలేదంటే ఏదో పొరపాటు జరిగి ఉండొచ్చు లేదా ఆ సినిమా చేరువకావడంలో సమస్య ఉండి ఉంటుంది. అందుకే ఆడియన్స్‌ను నిందించొద్దు. కొన్ని అంశాల విషయంలో నాది తప్పయి ఉండొచ్చు’’ అని అన్నారు.

‘ఎంత వినయంగా సమాధానం చెప్పారు సర్‌.. నిజమే ఆడియన్స్‌ ఎప్పుడూ తప్పు కాదు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ‘‘శ్రీ ఆంజనేయం’లోని హీరోయిన్‌ ఛార్మి రోల్‌ చిరాకు తెప్పించేలా ఉంది’’ అని ఓ యూజర్‌ కామెంట్‌ చేయగా ‘‘గాడ్‌ బ్లెస్‌ యూ’’ అంటూ కృష్ణవంశీ రిప్లై ఇచ్చారు. ‘ఖడ్గం 2’ ప్రశ్నపై స్పందిస్తూ.. ఖడ్గం ఒకటే ఉండాలంటూ దానికి సీక్వెల్‌ లేదనే విషయాన్ని స్పష్టంచేశారు.

ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్‌

‘శ్రీ ఆంజనేయం’లో హనుమంతుడిగా ప్రముఖ నటుడు అర్జున్‌, హనుమాన్‌ భక్తుడు అంజిగా నితిన్‌ నటించారు. 2004లో విడుదలైన ఈ సినిమా ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. హీరోయిన్‌ పాత్ర లేకపోయింటే ఈ చిత్రం హిట్‌ అయి ఉండేదని అప్పట్లోనే టాక్‌ వచ్చింది. ఈ సినిమాలో మాంత్రికుడిగా నటించిన పృథ్వీరాజ్‌ సైతం ఇటీవల పాల్గొన్న ఓ ఇంటర్వ్యూలో అదే అభిప్రాయం వ్యక్తం చేయడం గమనార్హం. హనుమంతుడి శక్తుల్ని పొంది అంజనాద్రి కోసం హీరో ఎలా పోరాటం చేశాడనే కథాంశంతో రూపొందిన ‘హనుమాన్‌’ చిత్రం ఈ సంక్రాంతి కానుకగా విడుదలై ఘన విజయాన్ని అందుకుంది. రూ. 300 కోట్లకుపైగా వసూళ్లు సాధించి, ఔరా అనిపించింది. తేజ సజ్జా హీరోగా దర్శకుడు ప్రశాంత్‌ వర్మ తెరకెక్కించిన ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌’ రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని