Prudhvi Raj: ఆ కష్ట సమయంలో నన్ను ఆదుకుంది ఇండస్ట్రీనే: పృథ్వీరాజ్‌

హాస్యనటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్‌ ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి హాజరయ్యారు. తన సినీ, రాజకీయ అనుభవాలను పంచుకున్నారు.

Published : 13 Feb 2024 02:14 IST

సినిమాలు, మైథలాజికల్‌ సీరియల్స్‌తో ప్రేక్షకాదరణ పొందిన నటుడు బలిరెడ్డి పృథ్వీరాజ్‌. ‘థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ’ అంటూ తనదైన నటనతో అందరినీ ఆకట్టుకున్నారు. రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా ఈటీవీ న్యూస్‌ ఛానల్‌లో ప్రసారమయ్యే ‘చెప్పాలని ఉంది’ కార్యక్రమానికి అతిథిగా హాజరయ్యారు. తన అనుభవాలు పంచుకున్నారు. ఆయన చెప్పిన సంగతులు మీకోసం..

మొదటి సినిమా అవకాశం ఎలా వచ్చింది?

పృథ్వీ: ‘ఆ ఒక్కటీ అడక్కు’తో నా ప్రయాణం మొదలైంది. ఆంధ్రా యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమానికి అతిథిగా ప్రభాకర్‌రెడ్డి,  రావుగోపాలరావు వచ్చారు. ప్రభాకర్‌రెడ్డి నన్ను చూసి ‘యాక్టర్‌ అవ్వాలనుకుంటే చదువు అయిపోయిన తర్వాత నన్నొచ్చి కలువు’ అన్నారు. నేను అనుకున్నదే ఆయన చెప్పారని పదో రోజే వెళ్లి కలిశాను. ‘చదువు పూర్తి చేసి రమ్మన్నాను. ఇప్పుడే కాదు’ అంటూనే రావుగోపాలరావు వద్దకు వెళ్లమని చెప్పారు. ఆయన ఈవీవీ సత్యనారాయణను కలవమన్నారు.

కృష్ణవంశీ ‘సింధూరం’ చేయడానికి చాలా గ్యాప్‌ వచ్చింది ఎందుకు?

పృథ్వీ: ‘ఆ ఒక్కటీ అడక్కు’, ‘వారసుడు’ మంచి విజయాలనిచ్చాయి. దాంతో అవకాశాలు వస్తాయనుకున్నా. కానీ, ఎవరూ పిలవడం లేదు. అప్పుడు దర్శకుడు బాపు ‘భాగవతం’ సీరియల్‌లో ఇంద్రుడి పాత్ర కోసం ఆడిషన్స్‌ చేస్తున్నారని తెలిసింది. నేను వెళ్లేసరికి చాలా మంది ఉన్నారు. కొద్దిసేపు వేచి చూశా. బయటకి వెళ్తున్న బాపు నన్ను చూసి పిలిచారు. ‘మేకప్‌ టెస్ట్‌ అవసరం లేదు. ఈయన్నే తీసుకుందాం’ అని ఆ పాత్రని నాకిచ్చారు.  దీని తర్వాత ‘సింధూరం’లో అవకాశం వచ్చింది.

పృథ్వీరాజ్‌ అని పేరు పెట్టింది ఎవరు?

పృథ్వీ: నా అసలు పేరు మూర్తిశేషు. ‘నీ సర్టిఫికెట్‌లో అలాగే ఉండనీ.. ఇకపై నీ పేరు పృథ్వీరాజ్‌’ అని నాకు పేరు పెట్టింది ప్రభాకర్‌ రెడ్డి. ఆయనే నా తొలిగురువు. నేను సుమన్‌గారితో కలిసి ఈటీవీలో చాలా సీరియల్స్‌ చేశా. ఆయన నన్ను పిలిచి ‘మీరు ఎస్వీ రంగారావులా ఉన్నారు, మంచి భవిష్యత్తు ఉంద’ని చెప్పారు. అదే ఆయనతో మాట్లాడిన ఆఖరి మాటలు.

థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పేరుతో పాటు మీకు సమస్యలు తెచ్చాయంట?

పృథ్వీ: ‘ఖడ్గం’లో నాకు అవకాశం ఇవ్వకపోతే ఎలా? అంటూ నేను కృష్ణవంశీతో గొడవపడ్డా. దాంతో వీరపాండ్య కట్టబ్రహ్మన వేషం ఇచ్చారు. షూట్‌ మధ్యలో ‘రైటర్‌ ఎక్కడ?ఆ లైట్‌ ఏంటి? అలా ఉన్నాయి. థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ నాకు తెలీదా’ అన్నాను. ఒక్కసారిగా అందరూ నవ్వేశారు. ‘కృష్ణవంశీ ఇది బాగుంది. దీన్నే ఇంకొంచెం మార్చి వాడదామ’న్నారు. సినిమా విడుదలైన తర్వాత సంధ్య థియేటర్‌లో షో వేస్తే ఇంటర్వెల్‌ సమయానికే అందరూ నన్ను గుర్తు పట్టడం మొదలు పెట్టారు. ఒక వ్యక్తి నా దగ్గరకు వచ్చి ‘థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ..  బాగా చేశావ్‌ కాకా’ అని షేక్ హ్యాండ్‌ ఇచ్చాడు. అప్పటి నుంచి థర్టీ ఇయర్స్‌ ఇండస్ట్రీ పృథ్వీ పేరు స్థిరపడిపోయింది.

‘పోకిరి’, ‘కిక్‌’ సినిమాల్లో అవకాశాలు ఎలా వచ్చాయి?

పృథ్వీ: పూరీ జగన్నాథ్‌ పిలిచి ‘పోకిరి’లో అవకాశం ఇచ్చారు. ఫస్ట్‌డే షూటింగ్‌ నాదే. బిల్డర్‌ పాత్ర. అది మంచి విజయాన్ని ఇచ్చింది. ఆ సినిమాకు రూ.30వేలు ఇచ్చారు.  తర్వాత శ్రీనువైట్ల ‘దూకుడు’ కూడా సక్సెస్‌. ఆ సినిమాకు ఏకంగా రూ.50వేలు ఇచ్చారు. అలా ఇండస్ట్రీలో అదొక సెంటిమెంట్‌ అయింది. సినిమాలో నేను ఉంటే, కాస్త రిలీఫ్‌గా ఉంటుందని పెద్ద హీరోలందరూ దర్శకులకు నన్ను సూచించారు. ‘గబ్బర్‌సింగ్‌’లో ఎలాగైనా చేయాలని హరీష్‌ శంకర్‌ను కలిసి అడిగాను. పవన్‌కల్యాణ్‌తో చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ఆయన చాలా మంచి వ్యక్తి. అది చూసేవారికి అర్థం కాదు. ఆ తర్వాత త్రివిక్రమ్‌ ‘అత్తారింటికి దారేది’. ఆయన్ని మాటల మాంత్రికుడు అని ఊరికే అనరు. కెమెరా పెట్టిన విషయం కూడా చెప్పరు.

విలన్‌ పాత్రల్లో అవకాశం ఎలా?

పృథ్వీ: వరుసగా కామెడీ పాత్రలు వస్తుండటంతో వైవిధ్యం కోసం కోట శ్రీనివాసరావుగారిలా విభిన్న పాత్రలు చేయాలనుకున్నా. వాటికే ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించుకున్నా. అందుకే ‘బ్రో’లో నిడివి తక్కువ ఉన్నా చేశాను. ‘లౌక్యం’లోని బాయిలింగ్‌ స్టార్‌ బబ్లూ క్యారెక్టర్‌ భోజ్‌పురి చిత్రంలో హీరో పాత్రకు వాడుతున్నారు. అది కూడా నాకు మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ సినిమా రైటర్‌తో మరో అయిదు సినిమాలు చేయబోతున్నా.

మీరు సీరియస్‌ పాత్రలు చేశారు. ఎలా అనిపించింది?

పృథ్వీ: నేను మాంత్రికుడిగా నటించిన సినిమా ‘శ్రీ ఆంజనేయం’. అందులో హీరోయిన్‌ సీన్స్‌ లేకుంటే హనుమాన్‌ కంటే గొప్ప విజయం సాధించేది.

ఎస్వీబీసీలో ఛైర్మన్‌గా మీరు చేసిన మార్పులు ఏమిటి?

పృథ్వీ: ఛైర్మన్‌గా కాంట్రాక్ట్‌ కార్మికుల సంక్షేమం కోసం కృషి చేశా.  బ్రహ్మోత్సవాలు చేయడం నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఉత్సవాల్లో ఎక్కడ చూసినా నేనే కనిపిస్తుండటంతో దాన్ని కొందరు తీసుకోలేకపోయారు. వివాదాలను సృష్టించారు.

మీరు ఇంతకు ముందు ఉన్న పార్టీ మారారు ఎందుకు?

పృథ్వీ: అధికారంలోకి వచ్చాక చాలా మందికి అహంకారం పెరిగిపోయింది. ‘నేను చెప్పేది న్యాయం.. ధర్మం..’ అన్న ధోరణి పెరిగిపోయింది. నా మీద ఆరోపణలు వచ్చినప్పుడు అందరూ ఒకవైపే చూశారు. నేనూ, నా భార్య కలిసి సీఎం ఆఫీస్‌కు వెళ్లాం. ‘నాయకుడు అంటే ఖద్దరు దుస్తులు వేసుకోవడం కాదు. నిజానిజాలు తెలుసుకోవాలి. మావారు అలా చేయలేదని తెలుసు. నిజంగా మా ఆయన తప్పు చేసి ఉంటే, ఇప్పటికిప్పుడే ఆయన్ను పోలీసులకు అప్పగిస్తా’ అని నా భార్య చెప్పింది. ఆయనేమో ‘మాట్లాడదాం అమ్మా’ అంటూ ఏదో చెప్పబోయారు. ‘ఇక ఇవన్నీ మాకు వద్దు సర్‌’ అని నమస్కారం పెట్టి బయటకు వచ్చేశాం. ఆ వెంటనే రాజీనామా చేశాను. సెకండ్‌వేవ్‌లో నేనూ కరోనా బారినపడ్డా. ఆస్పత్రిలో బెడ్‌ కావాలని సీఎం క్యాంపు ఆఫీస్‌కు ఫోన్‌ చేసినా ఎవరూ స్పందించలేదు. అప్పుడు నాగబాబుగారు, సాయికుమార్‌గారు స్పందించి, నావైపు నిలబడ్డారు. ఫిల్మ్‌ ఇండస్ట్రీనే నన్ను ఆదుకుంది. నేను రాజకీయాల్లోకి వచ్చానంటే కారణం సినిమానే. ఇకపై పవన్‌ కల్యాణ్‌తోనే ఉంటాను.

ఏపీ రాజకీయాల్లో కాళ్లు మొక్కే సంస్కృతి ఉందన్నారు?

పృథ్వీ: అధికారంలోకి వచ్చాక వారిలో అవినీతి బయటపడింది. బోర్డు సభ్యులు  కావాలంటే డబ్బులు ఉంటే చాలు. ప్రస్తుతం అక్కడ నియంతృత్వ పాలన నడుస్తోంది.

సినిమాలు, రాజకీయాలు ఏది సంతృప్తిని ఇస్తుంది?
పృథ్వీ: రెండూ నాకు చాలా ఇష్టమైనవే. నా కుమార్తెను పరిచయం చేస్తూ సినిమా చేశాను. బాగుంది అంటూ ప్రశంసలు వచ్చాయి. దర్శకుడిగా నేను సినిమా చేస్తుంటే ఎవరూ నాకు సపోర్ట్‌ చేయలేదు. అప్పుడు నన్ను ఆదుకుంది పవన్‌కల్యాణ్‌. ఆయనికి రుణపడి ఉంటాను.

రాజకీయాల్లో షర్మిల పాత్ర ఏంటి?

పృథ్వీ: ఏపీలో జగన్‌ ప్రభుత్వం ఏర్పడటానికి కారణం షర్మిలనే. ఆమె కాంగ్రెస్‌ వదిలిన బాణం.

జనసేనలో మీ బాధ్యతలు ఏంటి?

పృథ్వీ: జనసేన-టీడీపీ కలిసి మ్యానిఫెస్టో రూపొందిస్తున్నాయి. వాటిని ప్రజలకు తెలియజేస్తాం. ప్రజల కష్టాలు, ఓటు విలువను నాటక రూపంలో ప్రతీ ఊళ్లోనూ ప్రదర్శిస్తాం. కళాకారుల బృందంగా ఏర్పడి ప్రజలకు వివరిస్తాం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని