NTR 31: ఎన్టీఆర్‌తో సినిమా.. అంచనాలు పెంచేలా ప్రశాంత్‌ నీల్‌ అప్‌డేట్‌

#NTR31 ప్రాజెక్టు అప్‌డేట్‌ ఇచ్చారు దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌. ‘సలార్‌’ ప్రచారంలో భాగంగా పలు విశేషాలు పంచుకున్నారు.

Published : 07 Dec 2023 02:05 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఎన్టీఆర్‌ (NTR)తో తాను తెరకెక్కించబోయే సినిమా అప్‌డేట్‌ ఇచ్చి.. దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) అభిమానుల్లో ఆసక్తి పెంచారు. ఇప్పటి వరకు తాను తీసిన చిత్రాలకు అది విభిన్నంగా ఉంటుందని తెలిపారు. కానీ, ఆ కథ ఏ నేపథ్యంలో సాగుతుందో చెప్పేందుకు నిరాకరించారు. ప్రేక్షకులు యాక్షన్‌ చిత్రమని భావిస్తున్నారని, జానర్‌ ఏదైనా అది వారికి బాగా కనెక్ట్‌ అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో చిత్రీకరణ ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. ‘కేజీయఫ్‌ 3’ (KGF 3) గురించి మాట్లాడుతూ.. ‘‘ఆ సినిమా తప్పక ఉంటుంది. స్క్రిప్టు సిద్ధమైంది. సీక్వెల్‌ చేయాలనే ఆలోచనతోనే ‘కేజీయఫ్‌ 2’ ఎండింగ్‌లో హింట్‌ ఇచ్చాం’’ అని తెలిపారు. బాలీవుడ్‌ ప్రముఖ నటుడు అమితాబ్‌ బచ్చన్‌ సినిమాలు చూస్తూ పెరిగానని, ఆయనతో ఓ సినిమా చేయాలనుందని మనసులో మాట బయటపెట్టారు. ‘సలార్‌ పార్ట్‌ 1- సీజ్‌ఫైర్‌’ (Salaar: Part 1- Ceasefire) త్వరలో విడుదల కానున్న సందర్భంగా ఓ మీడియాతో మాట్లాడుతూ ఈ సంగతులు పంచుకున్నారు.

అందుకు వారికి సారీ.. ‘సలార్‌’ రూమర్స్‌పై ప్రశాంత్‌ నీల్‌ క్లారిటీ

ప్రభాస్‌ (Prabhas) హీరోగా ప్రశాంత్‌ తెరకెక్కిస్తున్న చిత్రమే ‘సలార్‌’. శ్రుతి హాసన్‌ కథానాయిక. పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, జగపతి బాబు, ఈశ్వరీరావు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా తొలి భాగం డిసెంబరు 22న విడుదల కానుంది. ‘కేజీయఫ్‌ 1’, ‘కేజీయఫ్‌ 2’ చిత్రాలతో ఈ దర్శకుడు దేశ వ్యాప్తంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఆ ఘన విజయాల తర్వాత దర్శకత్వం వహించిన సినిమాకావడంతో ‘సలార్‌’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. 2021లోనే ఎన్టీఆర్‌తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారాయన. #NTR31, #NTRNEEL అనేవి వర్కింగ్‌ టైటిల్స్‌గా ఉన్నాయి. ఎన్టీఆర్‌ ప్రస్తుతం ‘దేవర’ (Devara)తో బిజీగా ఉన్నారు. శివ కొరటాల దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా తొలి భాగం 2024 ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని