Tiger Nageswara Rao: ఎప్పటికీ ఇది గ్రేట్‌ ఫిల్మ్‌.. వారి ప్రేమను తట్టుకోలేకపోతున్నా: డైరెక్టర్‌ వంశీ

రవితేజ నటించిన తొలి పాన్‌ ఇండియా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’. ఇది ఎప్పటికీ గ్రేట్‌ ఫిల్మ్‌గా నిలిచిపోతుందని చిత్ర దర్శకుడు వంశీ సక్సెస్‌ మీట్‌లో అన్నారు.

Published : 21 Oct 2023 01:42 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao) ఎప్పటికీ గ్రేట్‌ ఫిల్మ్‌గా నిలిచిపోతుందని దర్శకుడు వంశీ (Vamsi) పేర్కొన్నారు. రవితేజ (Ravi Teja) హీరోగా ఆయన తెరకెక్కించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైన సంగతి తెలిసిందే. చిత్రాన్ని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలిపేందుకు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వంశీ, నిర్మాత అభిషేక్‌ అగర్వాల్‌ (Abhishek Agarwal) పాల్గొన్నారు. అంతకుముందు టపాసులు కాల్చి, కేసు కోసి సంబరాలు చేసుకున్నారు.

రివ్యూ: టైగర్‌ నాగేశ్వరరావు

ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘మేం అనుకున్న దానికంటే ప్రేక్షకుల నుంచి అధిక స్పందన వస్తోంది. ఇలాంటి చిత్రాన్ని నిర్మించడం, భారీ స్థాయిలో విడుదల చేయడం మామూలు విషయం కాదు. నాకు సపోర్ట్‌గా నిలిచిన అభిషేక్‌ సర్‌కి ఈ సందర్భంగా మరోసారి కృతజ్ఞతలు. నేను ఊహించినట్లే ఈ చిత్రానికి పనిచేసిన సాంకేతిక నిపుణులందరికీ మంచి గుర్తింపు దక్కింది. ప్రతి ఫ్రేమ్‌ను గుర్తుపెట్టుకుని మరీ కొందరు ప్రేక్షకులు నాకు మెసేజ్‌లు పెడుతున్నారు. ‘ఇది చూస్తారా, లేదా?’ అని మాకే సందేహం ఉన్న సన్నివేశాలూ బాగున్నాయని అభిమానులు అంటుంటే సంతోషంగా ఉంది. వారి ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నా. ఇప్పుడే కాదు ‘టైగర్‌ నాగేశ్వరరావు’ ఎప్పటికీ గ్రేట్‌ ఫిల్మ్‌. ఈ సినిమా రిజల్ట్‌పై రవితేజ చాలా ఆనందంగా ఉన్నారు. ఆయన ఫ్రీడమ్‌ ఇవ్వకపోయి ఉంటే ఈ సినిమా ఇలా ఉండేది కాదు’’ అని అన్నారు.

‘‘ఈ రోజు మా టైగర్‌ విడుదలైంది. ఈ సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు కృతజ్ఞతలు. అన్ని చోట్లా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వస్తోంది. దేశవ్యాప్తంగా షోల సంఖ్య పెరుగుతోంది. మేం ఆశించిన దానికంటే ఎక్కువ ఫలితం కనిపిస్తోంది. అందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని అభిషేక్‌ అగర్వాల్‌ తెలిపారు. టైగర్‌గా పేరు మోసిన గజదొంగ నాగేశ్వరరావు జీవితాధారంగా రూపొందిన చిత్రమిది. హీరోయిన్లు నుపుర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్‌, అనుకృతి వాస్‌ ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. దాదాపు 20 ఏళ్ల తర్వాత నటి రేణూ దేశాయ్‌ రీ ఎంట్రీ ఇచ్చిన చిత్రమిది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని