Tiger Nageswara Rao Movie Review: రివ్యూ: టైగర్‌ నాగేశ్వరరావు.. రవితేజ ఖాతాలో హిట్‌ పడిందా?

Tiger Nageswara Rao Movie Review: రవితేజ కథానాయకుడిగా వంశీ దర్శకత్వంలో తెరకెక్కిన పీరియాడిక్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘టైగర్‌ నాగేశ్వరరావు’ మూవీ ఎలా ఉందంటే?

Updated : 20 Oct 2023 14:47 IST

Tiger Nageswara Rao Movie Review | చిత్రం: టైగర్‌ నాగేశ్వరరావు, అనుపమ్‌ ఖేర్‌, నుపుర్‌ సనన్‌, రేణు దేశాయ్‌, జిషుసేన్‌ గుప్త, మురళీ శర్మ, గాయత్రీ భరద్వాజ్‌, నాజర్‌ తదితరులు; సంగీతం: జీవీ ప్రకాష్‌ కుమార్‌; సినిమాటోగ్రఫీ: ఆర్‌.మది; ఎడిటింగ్‌: కోటగిరి వెంకటేశ్వరరావు; నిర్మాత: అభిషేక్‌ అగర్వాల్‌; రచన, సంభాషణలు: శ్రీకాంత్‌ విస్సా; దర్శకత్వం: వంశీ; విడుదల తేదీ: 20-10-2023

యాపజయాలతో సంబంధం లేకుండా వరుస చిత్రాలతో అలరిస్తున్న కథానాయకుడు రవితేజ (Ravi tej). ఏడాదికి కచ్చితంగా రెండు మూడు సినిమాలు విడుదలయ్యేలా ప్లాన్‌ చేసుకుంటారు. వంశీ దర్శకత్వంలో ఆయన నటించిన తాజా చిత్రం ‘టైగర్‌ నాగేశ్వరరావు’ (Tiger Nageswara Rao). స్టూవర్టుపురం దొంగ నాగేశ్వరరావు జీవితంలో జరిగిన యథార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కింది. మరి దసరా బరిలో నిలిచిన ఈ మూవీ ఎలా ఉంది? (Tiger Nageswara Rao Review) రవితేజ తొలి పాన్‌ ఇండియా మూవీ మెప్పించిందా?

క‌థేంటంటే: 1970, 80 దశ‌కాల్లో స్టూవర్టుపురం నాగేశ్వ‌ర‌రావు పేరు వింటే చాలు... అటు ప్ర‌జల్లోనూ ఇటు పోలీసు వ్య‌వ‌స్థ‌లోనూ ఓ ర‌కమైన అల‌జ‌డి మొద‌ల‌య్యేది. దోపిడీల‌కి పెట్టింది పేరైన నాగేశ్వ‌ర‌రావు కన్నుప‌డిందంటే చాలు... ఎంత విలువైన‌దైనా, ఎంత క‌ట్టుదిట్ట‌మైన భ‌ద్ర‌త ఉన్నా చెప్పి మ‌రీ దొంగ‌త‌నం చేస్తాడని పేరు. త‌ను దొంగ‌త‌నాలు చేసే ప్రాంతాన్ని టైగ‌ర్ జోన్ అనీ... అత‌న్ని  టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు అనీ పిలుస్తుంటారు. ఇప్ప‌టికీ ఆయ‌న గురించి క‌థ‌లు క‌థ‌లుగా చెప్పుకొంటుంటారు. అంత పేరు మోసిన దొంగ క‌థ‌తో రూపొందిన చిత్ర‌మే.. ‘టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు’. టైటిల్ పాత్ర‌లో ర‌వితేజ న‌టించారు. 1980 నేప‌థ్యంలో క‌థ  మొద‌ల‌వుతుంది. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని స్టూవ‌ర్టుపురం గ్రామానికి చెందిన నాగేశ్వ‌ర‌రావు గురించి దిల్లీలో చ‌ర్చ మొద‌ల‌వుతుంది. (Tiger Nageswara Rao Review) ప్ర‌ధానమంత్రి భ‌ద్ర‌తని స‌మీక్షించే ఇంటిలిజెన్స్ అధికారి రాజ్‌పుత్ (అనుప‌మ్ ఖేర్‌) స్వ‌యంగా రంగంలోకి దిగి స్టూవర్టుపురం గురించి తెలిసిన పోలీస్ అధికారి విశ్వ‌నాథ్ శాస్త్రి (ముర‌ళీశ‌ర్మ‌)ని పిలిపించి నాగేశ్వ‌ర‌రావు గురించి ఆరా తీయ‌డం మొద‌లుపెడ‌తారు. అందుకు కార‌ణ‌మేంటి?అస‌లు ఈ దోపిడీల‌కి పాల్ప‌డుతున్న నాగేశ్వ‌ర‌రావు ల‌క్ష్యం ఏమిటనేది అస‌లు క‌థ‌.

ఎలా ఉందంటే: జీవిత క‌థ‌ల‌తో రూపొందిన సినిమాల్లో స‌హ‌జంగా వాస్త‌వ సంఘ‌ట‌న‌ల మోతాదే ఎక్కువ. అక్క‌డ‌క్క‌డా మాత్ర‌మే స్వేచ్ఛ తీసుకుని స‌న్నివేశాల్ని మ‌లుస్తుంటారు. ఈ సినిమా బ‌యోపిక్‌గానే ప్ర‌చారమైనా.. ఎక్కువ‌గా  ప్ర‌చారంలో ఉన్న విష‌యాల్ని ఆధారంగా చేసుకునే రూపొందించారు. వాస్త‌వాల కంటే క‌ల్పితాలే ఎక్కువ‌. అయితే థియేట‌ర్లోకి వెళ్లి కూర్చున్నాక  తెర‌పై క‌నిపిస్తున్న‌ది వాస్త‌వమా, క‌ల్పిత‌మా అనే విష‌యం కంటే ఆ క‌థ ఆస‌క్తిని రేకెత్తించిందా? లేదా? అనేదే కీల‌కం.  ఈ సినిమా ఒక ద‌శ వ‌ర‌కు ప‌ర్వాలేద‌నిపించినా ఆ త‌ర్వాత గాడి తప్పింది. ర‌క్తం, క‌న్నీరు క‌లిసిన సిరాతో రాసిన చ‌రిత్ర అని చెప్పినా ఇందులో రక్త‌పాత‌మే త‌ప్ప క‌న్నీళ్లు పెట్టించే భావోద్వేగాలు ఎక్క‌డా పండ‌లేదు. (Tiger Nageswara Rao Review in telugu) క‌థ‌లు క‌థ‌లుగా వినిపించే నాగేశ్వ‌ర‌రావు దొంగ‌త‌నాలనైనా థ్రిల్ క‌లిగించేలా తెర‌పైకి తీసుకొచ్చారా అంటే అదీ లేదు. ఓ దొంగ ప్ర‌ధాన‌మంత్రి సీటు వ‌ర‌కూ వెళ్లాడ‌న్న‌ప్పుడు అత‌నిలో ఎంత ధైర్యం, ఎన్ని తెలివితేట‌లు ఉండాలి. అలాంటి సాహ‌సాల్ని కానీ, తెలివి తేట‌ల్ని కానీ నాగేశ్వ‌ర‌రావు దోపిడీల‌లో ఎక్క‌డా చూపించ‌క‌పోవ‌డం ఈ సినిమాలో  ప్ర‌ధాన లోపం.

ప్రారంభ స‌న్నివేశాల్లో రైలు దోపిడీ చూపించారు కానీ అది ఏమాత్రం స‌హ‌జంగా అనిపించ‌దు. విజువ‌ల్స్ మాత్రం ఆక‌ట్టుకుంటాయి. స్టూవర్టుపురం నేర సామ్రాజ్యంతో మొద‌ల‌య్యే ఈ క‌థ‌లో ఆరంభ స‌న్నివేశాలు  మెప్పిస్తాయి. దొంగ‌త‌నాల కోసం స‌న్న‌ద్ధమ‌య్యే తీరు, స్వార్థ‌ప‌రుల వ‌ల్ల దొంగ‌త‌నాలు చేయాల్సిన ప‌రిస్థితులు రావ‌డం వంటి స‌న్నివేశాలు ప్రేక్ష‌కుడిని క‌థ‌లో లీనం చేస్తాయి. కానీ, ఆ వెంట‌నే సినిమా ఫ‌క్తు క‌మ‌ర్షియల్ ఫార్మాట్‌లోకి వెళ్లిపోతుంది. పోలీసుల‌తో ఫైట్‌,  హీరోయిన్‌తో ప్రేమ అంటూ మ‌రోదారి ప‌డుతుంది క‌థ‌.  ద్వితీయార్ధంలో అయితే త‌ల‌లు తెగిప‌డుతూ స‌న్నివేశాలు సాగుతూనే ఉంటాయి త‌ప్ప క‌థ ఎక్క‌డా ఆస‌క్తి రేకెత్తించ‌దు. రాబిన్‌హుడ్ త‌ర‌హాలో నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌ని చూపించారు. (Tiger Nageswara Rao Review in telugu) పెళ్లి, పిల్ల‌లు, ఫ్యాక్ట‌రీ అంటూ ద్వితీయార్ధంలో సుదీర్ఘ‌మైన మ‌రో క‌థ న‌డుస్తుంది. స్టూవర్టుపురం జీవితాల్లో మార్పు కోసం ప‌నిచేసిన హేమ‌ల‌తా ల‌వ‌ణం పాత్ర‌ని కూడా  ప్ర‌భావ‌వంతంగా చూపించ‌లేదు. 80 ద‌శ‌కంలో సాగే ఈ సినిమాలో ర‌వితేజ, ఇత‌ర పాత్ర‌ధారులు  కొన్ని సార్లు ట్రెండీగా క‌నిపిస్తే మ‌రికొన్నిసార్లు చారిత్రాత్మ‌క సినిమాల్లోలాగా క‌నిపిస్తారు. క‌థ‌, క‌థ‌నాల్ని న‌డిపించిన విధానంలో ఎక్క‌డా ప‌రిణ‌తి క‌నిపించ‌దు.

ఎవ‌రెలా చేశారంటే: ర‌వితేజ న‌ట‌న ఈ సినిమాకి ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ. క‌మ‌ర్షియ‌ల్ సినిమాల్లో క‌నిపించిన‌ట్టుగా కాకుండా... గ‌త చిత్రాల‌కి పూర్తి భిన్నంగా నాగేశ్వ‌ర‌రావు పాత్ర‌లో ఒదిగిపోయారు.  లుక్ విష‌యంలోనూ..  పోరాట ఘ‌ట్టాల ప‌రంగానూ ఆయ‌న బ‌ల‌మైన  ప్ర‌భావం చూపిస్తారు. క‌థానాయిక‌లు నుపుర్ స‌న‌న్‌, గాయ‌త్రి భ‌ర‌ద్వాజ్  త‌మ పాత్ర‌ల‌కి న్యాయం చేశారు. గాయ‌త్రి పాత్రే కాస్త ఎక్కువ స‌మ‌యం తెర‌పై క‌నిపిస్తుంది. అనుకృతి పోషించిన పాత్ర చిన్న‌దే. అనుప‌మ్ ఖేర్‌, ముర‌ళీశ‌ర్మ‌, నాజ‌ర్ త‌దిత‌రులు పాత్ర‌ల ప‌రిధి మేర‌కు న‌టించారు. రేణుదేశాయ్‌ చేసిన హేమ‌ల‌తా ల‌వ‌ణం పాత్ర తెర‌పై నిస్తేజంగా క‌నిపిస్తుంది. ఎమ్మెల్యే య‌ల‌మంద పాత్ర‌లో హ‌రీష్ పేర‌డి, ఆయ‌న కొడుకు కాశీగా సుదేవ్ నాయ‌ర్, సీఐ పాత్ర‌లో జిషూ సేన్ గుప్తా విల‌నిజం ప్ర‌ద‌ర్శించారు. (Tiger Nageswara Rao Review in telugu) సాంకేతికంగా సినిమా ఉన్న‌తంగా ఉంది. ముఖ్యంగా జీవీ ప్ర‌కాశ్‌కుమార్ సంగీతం చిత్రానికి ప్ర‌ధాన‌బ‌లం. నేప‌థ్య సంగీతంతో  త‌న‌దైన ప్ర‌భావం చూపించారు. కెమెరా, ప్రొడ‌క్ష‌న్ డిజైన్ విభాగాలు మంచి ప‌నితీరుని ప్రదర్శించాయి. ఈ సినిమాకి క‌థ‌, క‌థ‌నాల‌తోపాటు  నిడివి మ‌రో ప్ర‌ధాన స‌మ‌స్య‌. మాట‌లు బాగున్నాయి. నిర్మాణం ఉన్న‌తంగా ఉంది.

  • బ‌లాలు
  • + ఆరంభ స‌న్నివేశాలు
  • + ర‌వితేజ న‌ట‌న
  • + సంగీతం... ఛాయాగ్ర‌హ‌ణం
  • బ‌ల‌హీన‌త‌లు
  • - ఆస‌క్తి రేకెత్తించని క‌థ‌, క‌థ‌నాలు
  • - కొర‌వ‌డిన భావోద్వేగాలు
  • - నిడివి (Tiger Nageswara Rao Review in telugu)
  • చివ‌రిగా: టైగ‌ర్ నాగేశ్వ‌ర‌రావు... అక్క‌డ‌క్క‌డా మెప్పిస్తాడు!
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని