Eesha Rebba: తెలుగు సినిమాల్లో భాష రాని వారే ఎక్కువ మంది ఉన్నారు: ఈషా రెబ్బా

హీరోయిన్‌ ఈషా రెబ్బా (Eesha Rebba) తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది. టాలీవుడ్‌లో అవకాశాల గురించి తన అభిప్రాయాన్ని పంచుకుంది.

Published : 09 Jul 2023 10:48 IST

హైదరాబాద్‌: ‘అరవింద సమేత’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్’ సినిమాల్లో నటించి గుర్తింపు తెచ్చుకుంది నటి ఈషా రెబ్బా (Eesha Rebba). ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉంది. హీరో సుధీర్ బాబు సరసన ‘మామ మాశ్చీంద్ర’ (Mama Mascheendra)లో నటిస్తున్న ఈషా.. జేడీ చక్రవర్తి సరసన ‘దయా’ అనే మూవీ చేస్తోంది. అలాగే ఓటీటీల్లోనూ వరుస అవకాశాలు అందుకుంటోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆమె.. సినిమాలు, ఓటీటీల్లో ఏదీ ముఖ్యమో పంచుకుంది. అలాగే టాలీవుడ్‌లో సినిమా అవకాశాల గురించి మాట్లాడింది.

‘‘చిన్న స్క్రీన్‌పై చూసే ఓటీటీ సినిమాలకు కూడా థియేటర్లో విడుదలయ్యే వాటిలాగానే గుర్తింపు వస్తుంది. నాకు యాక్షన్‌ సినిమాలు చేయాలని కోరిక ఉంది. అలాగే విభిన్న పాత్రల్లో నటించడం ఇష్టం. ప్రస్తుతం నేను చేస్తున్న ఓ తెలుగు సినిమాలో సోషల్‌మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్‌గా నటిస్తున్నాను. అలాగే మరో సినిమాలో పోలీస్‌గా కనిపించనున్నాను. ఇలాంటి పాత్రలు వచ్చినప్పుడు బాగా నటించడం కోసం కొవిడ్‌ సమయంలో ఆర్చరీ కూడా నేర్చుకున్నాను. నాకున్న నైపుణ్యాలను సద్వినియోగం చేసుకోవడానికి వేచి చూస్తున్నాను’’అని చెప్పింది.

‘‘ప్రస్తుతం మిగతా పరిశ్రమల వాళ్లు కూడా తెలుగు ఇండస్ట్రీ గురించే మాట్లాడుకుంటున్నారు. నేను తమిళ, మలయాళంలో పనిచేస్తున్నప్పుడు కూడా వారంతా టాలీవుడ్‌ గురించే మాట్లాడుకోవడం చూసి గర్వంగా అనిపించేది. కానీ ఇక్కడ తెలుగు భాష వచ్చిన వారి కంటే.. రాని వారికే ఎక్కువ అవకాశాలు ఇస్తున్నారని నా అభిప్రాయం. ఇతర రాష్ట్రాల వాళ్లని హీరోయిన్స్‌గా పెటుకోవాలని ప్రేక్షకులు మేకర్స్‌ని అడగరు. అలాంటప్పుడు వారికే ఎక్కువ అవకాశాలు ఎందుకివ్వాలి? నేను కేవలం నటీమణుల గురించే చెప్పట్లేదు.. అన్ని పాత్రలను ఉద్దేశించి  మాట్లాడుతున్నాను’’ అని ఈషా రెబ్బ తన అభిప్రాయాన్ని తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని