Ananya Panday: షారుక్‌ కుమార్తె నాకూ పోటీయే: అనన్యా పాండే

‘కొత్త టాలెంట్‌ చిత్రసీమకి పరిచయం అయినప్పుడు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వారి నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు’ అంటోంది అనన్యా పాండే.

Updated : 09 Jul 2023 14:15 IST

‘కొత్త టాలెంట్‌ చిత్రసీమకి పరిచయం అయినప్పుడు స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. వారి నుంచి ఎంతో కొంత నేర్చుకోవచ్చు’ అంటోంది అనన్యా పాండే. ప్రముఖ బాలీవుడ్‌ కథానాయకుడు షారుఖ్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ ‘ది ఆర్చీస్‌’ సినిమాతో సినీరంగ ప్రవేశం చేయనుంది. ఈ చిత్రం ఓటీటీ ద్వారా నవంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. సుహానా, అనన్యా మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలో తన స్నేహితురాలు తెరకు పరిచయం కావడం గురించి అనన్యా స్పందించింది. ‘సుహానాకు ఇది మొదటి సినిమా అయినా తను భయపడటం లేదు. ఈ సినిమాపై తాను ఎంతో నమ్మకంగా ఉంది. ఇందులో సుహానా నటన చాలా గొప్పగా ఉండనుందని నేను అనుకుంటున్నాను. ఈ సినిమాలో తన నటనను చూడటానికి ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ‘ది ఆర్చీస్‌’ టీజర్‌ విడుదలైనప్పటి నుంచి సుహానాను, తన నటనను అందరూ ప్రేమిస్తున్నారు, మెచ్చుకుంటున్నారు. ఆమె రాకతో సినీపరిశ్రమలో పోటీతత్వం పెరగనుంది. నేను కూడా ఒక పోటీగా భావిస్తున్నాను.అప్పుడే మరింత కష్టపడి పనిచేయాలనిపిస్తుంది’ అని చెప్పింది అనన్య. ‘ది ఆర్చీస్‌’లో వెరోనికా లాడ్జ్‌ పాత్రలో కనిపించనుంది సుహానా. జోయా అక్తర్‌ దర్శకత్వంలో రీమా కగ్టీ నిర్మిస్తున్నారు. కరణ్‌ జోహర్‌ నిర్మించిన ‘స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2’ సినిమాతో బాలీవుడ్‌కు పరిచయమైన అనన్య పాండే, టాలీవుడ్‌లో విజయ్‌ దేవరకొండకు జోడీగా ‘లైగర్‌’లో కనిపించింది. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా రానున్న ‘డ్రీమ్‌ గర్ల్‌ 2’లో అనన్య నటించనుంది. ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని