Fahadh Faasil: నాకు ఆ రుగ్మత ఉన్నట్లు ఇటీవలే తెలిసింది: ఫహాద్‌ ఫాజిల్‌

41 ఏళ్ల వయసులో తాను ఏడీహెచ్‌డీ గురైనట్లు నటుడు ఫహాద్‌ ఫాజిల్‌ తెలిపారు. దాని చికిత్స గురించి డాక్టర్లను అడిగారు.

Updated : 28 May 2024 12:54 IST

ఇంటర్నెట్‌ డెస్క్: ‘పుష్ప’తో అన్ని భాషల వారికి చేరువయ్యారు మలయాళ నటుడు ఫహాద్‌ ఫాజిల్‌. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ అలరిస్తున్నారు. తాజాగా తన ఆరోగ్యం గురించి ఓ విషయం చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. 41 ఏళ్ల వయసులో అటెన్షన్‌ డెఫిసిట్‌ హైపర్యాక్టివిటీ డిజార్డర్‌ (ADHD) రుగ్మతతో బాధపడుతున్నట్లు  తెలిపారు. ఇది మెదడు పనితీరుపై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. దీని వల్ల దేని మీదా ఎక్కువసేపు శ్రద్ధ పెట్టలేకపోవడం, కొన్నిసార్లు అతి ప్రవర్తన, తొందరగా ఆవేశపడటం వంటివి తనలో గమనించినట్లు తెలిపారు. ఇది పిల్లల్లో సాధారణమని పెద్దలకు అరుదుగా వస్తుందన్నారు. తాజాగా ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన (Fahadh Faasil) తన సమస్యకు చికిత్స గురించి డాక్టర్‌ను అడిగారు. 41 ఏళ్ల వయసులో దీనికి చికిత్స చేయించుకోవచ్చా లేదా అన్న వివరాలు తెలుసుకున్నట్లు చెప్పారు.

ఏంటీ ADHD? లక్షణాలు ఎలా ఉంటాయి?

పిల్లలు ఎక్కువగా ఈ రుగ్మతతో బాధపడుతుంటారు. చెప్పిన విషయాలు మర్చిపోవడం, అర్థం చేసుకోలేకపోవడం, ఎక్కువగా మాట్లాడటం, అజాగ్రత్తతో తప్పులు చేయడం, ప్రతి దానికీ రిస్క్‌ తీసుకోవడం, తరచూ చేతులు, కాళ్లూ కదిలిస్తూ ఉండటం, స్థిరంగా కూర్చోలేకపోవడం, ఎక్కువగా పరిగెత్తడం, గెంతడం, ప్రశ్న పూర్తయ్యేలోపు సమాధానం చెప్పటం, తన వంతు వచ్చే వరకూ వేచి ఉండకుండా ఇతరులకు అంతరాయం కలిగించడం, ఇతరుల వస్తువులను అనుమతి లేకుండా తీసుకోవడం వంటి లక్షణాలు ఉంటే ఏడీహెచ్‌డీతో సమస్య ఉన్నట్లు గుర్తించాలి.

చికిత్స ఉందా?

ఒక వ్యక్తికి ADHD ఎలా వస్తుందని చెప్పడానికి నిర్దిష్ట కారణాలు ఏవీ లేవు. ఇప్పటికీ దీనిపై పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ రుగ్మతతో బాధపడే పిల్లలను పెంచడం ఒక సవాల్‌. దీనికి నియంత్రించడానికి థెరపీ, కొన్ని మందులు అవసరం. అవసరమైతే మానసిక నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది.

‘కేజీయఫ్‌’ ఫార్ములాను ఫాలో అవుతున్న ‘పుష్ప’ రాజ్‌

ఇటీవలే ‘ఆవేశం’తో (Aavesham) పలకరించిన ఫహాద్‌ ఫాజిల్‌ సూపర్‌ హిట్‌ను అందుకున్నారు. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్‌ హిట్‌గా నిలిచిందీ చిత్రం. జీతూ మాధవన్‌ దర్శకత్వంలో రూ.30 కోట్లతో నిర్మించిన ఈ యాక్షన్‌ కామెడీ ఫిల్మ్‌ ప్రపంచవ్యాప్తంగా రూ.150 కోట్లు వసూలు చేసింది. ఈ ఏడాది భారీ వసూళ్లు చేసిన మలయాళ చిత్రాల జాబితాలో చేరింది. ప్రస్తుతం ప్రముఖ ఓటీటీ వేదిక అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమింగ్‌ అవుతోంది. ఇక తెలుగులో సుకుమార్‌ దర్శకత్వంలో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతోన్న ‘పుష్ప2’లో ఎస్పీ భన్వర్‌సింగ్ షెకావత్‌గా నటిస్తున్నారు. మొదటిభాగంతో పోలిస్తే రెండో పార్ట్‌లో ఆయన పాత్ర నిడివి ఎక్కువగా ఉండనుంది. హీరోకు, ఆ పాత్రకు మధ్య చాలా యాక్షన్‌ సన్నివేశాలు ఉండనున్నాయి. ఇప్పటికే ఆయనకు సంబంధించిన చిత్రీకరణ కూడా పూర్తయినట్లు సమాచారం. భారీ అంచనాల మధ్య ఈ సీక్వెల్‌ ఆగస్టు 15న విడుదలకు సిద్ధమైంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని