Vijay Deverakonda: అప్పుడు డబ్బుల్లేకపోతే దిల్‌రాజు అడ్వాన్స్‌ ఇచ్చారు: విజయ్‌ దేవరకొండ

విజయ్‌ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’ (Family Star).

Updated : 01 Apr 2024 16:02 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: విజయ్‌ దేవరకొండ - పరశురామ్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్‌’. మృణాల్‌ ఠాకూర్ కథానాయిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ పతాకంపై దిల్‌రాజు నిర్మించారు. ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో దిల్‌ రాజు, విజయ్ దేవరకొండ, మృణాల్‌ ఠాకూర్‌.. సంప్రదాయ దుస్తుల్లో సందడి చేశారు. సినిమా విశేషాలు పంచుకున్నారు.

‘బొమ్మరిల్లు’, ‘శతమానం భవతి’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ లాంటి కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించారు. ఇప్పుడు ‘ఫ్యామిలీ స్టార్’ రానుంది. ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందని అనుకుంటున్నారు?

దిల్‌రాజు: ఫ్యామిలీతోపాటు యూత్ కూడా చూసిన చిత్రం ‘బొమ్మరిల్లు’. ‘శతమానం భవతి’ ఎక్కువగా ఫ్యామిలీ ఆడియన్స్‌ చూశారు. యూత్‌ నుంచి స్పందన తక్కువగా వచ్చింది. ‘ఫ్యామిలీస్టార్‌’ చిత్రంలో అన్నిరకాల ఎమోషన్స్‌ ఉన్నాయి. ఇది ఫ్యామిలీ బ్యాక్‌డ్రాప్‌లో ఉండే ప్రేమకథా చిత్రం.

ఈ కథ చేయడానికి కారణం ఏమిటి?

విజయ్ దేవరకొండ: ఇలాంటి జానర్‌ చిత్రాలే చేయాలని నేను ఎప్పుడూ అనుకోను. వచ్చిన కథలు వింటుంటా. పరశురామ్‌ ఈ కథ చెప్పినప్పుడు నాకెంతో నచ్చింది. ఫుల్‌ స్క్రిప్ట్‌ కావాలని కోరా. నాతో సినిమా చేయాలని దిల్‌రాజు ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. కథలు కూడా పంపించారు. కొవిడ్‌ సమయంలో డబ్బులు కాస్త ఇబ్బందిగా ఉంటే అడ్వాన్స్‌ కూడా పంపించారు. పరశురామ్‌ చెప్పిన కథ ఆయనకు వివరించా. కొన్ని రోజుల తర్వాత వీరిద్దరూ ఫుల్ స్క్రిప్ట్‌తో నన్ను కలిశారు. వెంటనే ఓకే అన్నా. గౌతమ్‌ తిన్ననూరి, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌కు ప్రత్యేకంగా థ్యాంక్యూ చెప్పాలి. ఎందుకంటే, వాళ్లు అర్థం చేసుకోవడం వల్లే దీనిని త్వరగా పూర్తి చేయగలిగా.

ఈ మధ్య కాలంలో మీరు స్టేజ్‌పై డ్యాన్సులు చేస్తున్నారు. పాటలు పాడుతున్నారు. నటుడిగా ఏమైనా ఎంట్రీ ఇస్తారా?

దిల్‌రాజు: నటుడిగా మారే ఆలోచన నాకు లేదు. ప్రేక్షకులకు చిత్రాన్ని చేరువ చేయడానికి నా వంతు ప్రయత్నం చేస్తున్నా.

స్క్రిప్ట్‌ వినగానే మీకు గుర్తుకు వచ్చింది ఎవరు?

విజయ్ దేవరకొండ: మా నాన్న గోవర్ధన్‌ రావు నాకు ఫ్యామిలీ స్టార్‌. మేము ఏది అడిగినా కాదనేవారు కాదు. ఎంతో కష్టపడేవారు. చిన్నతనంలో మేము హాస్టల్‌లో ఉండేవాళ్లం. వేసవి సెలవుల కోసం ఇంటికి వచ్చినప్పుడల్లా.. సైకిల్‌ కొనమని అడిగేవాడిని. ఇంట్లో ఖర్చులు అప్పట్లో మాకు అర్థమయ్యేవి కాదు. నాకోసం లేడీ బర్డ్‌ సైకిల్‌ సెకండ్‌ హ్యాండ్‌లో తీసుకున్నారు. అందరికీ మా అక్క సైకిల్‌ అని చెప్పేవాడిని.

పెళ్లి ఎప్పుడు?

విజయ్‌ దేవరకొండ: దానికి ఇంకా సమయం ఉంది. అమ్మానాన్నకు నచ్చకుండా చేసుకోను.

సినిమాలో హీరో పాత్రకు పేరు మీరే చెప్పారా?  

విజయ్‌ దేవరకొండ: పరశురామ్‌ స్క్రిప్ట్‌తో వచ్చినప్పుడు పాత్రకు ఎలాంటి పేరు లేదు. మా నాన్న పేరు హీరోకి పెట్టమని అడిగా. మా నాన్నతోపాటు ప్రపంచంలో ఉన్న నాన్నలందరికీ ఇది అంకితం చేస్తున్నా.

పరశురామ్‌ గీతాఆర్ట్స్‌లో ఈ సినిమా చేయాల్సింది. కానీ, ఆయన మీతో చేశారు. దీనివల్ల అల్లు అరవింద్‌ కాస్త హర్ట్‌ అయ్యారని వార్తలు వచ్చాయి?

దిల్‌రాజు: అల్లు అరవింద్‌తో నాకు మంచి అనుబంధం ఉంది. అది అందరికీ తెలుసు. మా మధ్య ఎలాంటి విభేదాల్లేవు.

కేరింత ఆడిషన్‌కు వెళ్లారా?

విజయ్‌ దేవరకొండ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై తెరకెక్కిన ‘కేరింత’ కోసం ఆడిషన్స్‌కు వెళ్లా. నన్ను సెలెక్ట్‌ చేయలేదు. అప్పుడు నేను బాగా హర్ట్‌ అయ్యా. అదే విషయాన్ని కొన్నేళ్ల క్రితం దిల్‌రాజుతోనూ చెప్పా. కరెక్ట్‌ కథ కోసం ఎదురుచూశాం.

దిల్‌రాజు: విజయ్‌తో గతంలో నేనొక భారీ ప్రాజెక్ట్‌ ప్లాన్‌ చేశా.  స్క్రిప్ట్‌ కూడా రెడీ పెట్టుకున్నా. తప్పకుండా చేస్తాం.

కథ విన్నప్పుడు మీకు ఎవరు గుర్తుకువచ్చారు?

మృణాల్‌: మా నాన్న. మాకోసం ఎంతో కష్టపడ్డారు. ఇది ప్రతి ఒక్కరికీ నచ్చే చిత్రం. నేను నటించిన తెలుగు చిత్రాలు హిట్‌ అందుకుంటున్నాయని.. లక్‌ వల్లే అది సాధ్యమవుతుందని పలువురు అంటున్నారు. లక్‌తోపాటు ప్రతి పాత్ర కోసం నేను శ్రమిస్తున్నా.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు