Fighter: నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్‌’.. టాప్‌3లో స్థానం

‘ఫైటర్‌’ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన చిత్రాల్లో టాప్‌3లో నిలిచింది.

Published : 28 Mar 2024 17:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: బాలీవుడ్‌ అగ్ర కథానాయకుడు హృతిక్ రోషన్‌ (Hrithik Roshan), దీపికా పదుకొణె కీలకపాత్రల్లో నటించిన చిత్రం ‘ఫైటర్‌’(Fighter). సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో దేశభక్తి నేపథ్యంలో తెరకెక్కింది. మార్చి 21న నెట్‌ఫ్లిక్స్‌ వేదికగా డిజిటల్‌ ప్రేక్షకుల ముందుకువచ్చిన ఈ చిత్రం రికార్డు క్రియేట్‌ చేసింది. ‘ఫైటర్‌’ ప్రపంచంలోనే అత్యధిక మంది చూసిన మూడో సినిమాగా నిలిచింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ గతవారంలో విడుదలైన సినిమాల వ్యూస్‌ను వెల్లడించింది. ఓటీటీలోకి వచ్చిన నాలుగు రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రాన్ని 59 లక్షల మంది చూశారు. మూడు గంటల నిడివి ఉన్న  ఈ సినిమా 16.2 మిలియన్ గంటల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. దీంతో అత్యధిక వీక్షణలు సొంతం చేసుకున్న ఆంగ్లేతర చిత్రంగా రికార్డు నెలకొల్పింది.

కథేంటంటే: సంషేర్ ప‌ఠానియా అలియాస్ పాటీ (హృతిక్ రోష‌న్‌) భార‌త వైమానిక ద‌ళంలో స్క్వాడ్ర‌న్ లీడ‌ర్‌. సాహ‌సాల‌కి వెనకాడ‌ని ఫైట‌ర్ పైల‌ట్‌. అప్ప‌జెప్పిన బాధ్య‌త‌ల్ని నిర్వ‌ర్తించే క్ర‌మంలో త‌న‌కున్న ప‌రిధుల్ని, నిబంధ‌న‌ల్ని దాటి మ‌రీ సాహ‌సాలు చేస్తుంటాడు. ఆ క్ర‌మంలోనే జ‌రిగిన ఓ దుస్సంఘ‌ట‌న‌కి బాధ్యుడిగా నింద‌ మోస్తూ ఉంటాడు. రెండేళ్ల త‌ర్వాత మ‌ళ్లీ ఓ ఆప‌రేష‌న్ కోసం శ్రీన‌గ‌ర్ వ‌స్తాడు. సీవో రాకీ (అనిల్ క‌పూర్‌) నేతృత్వంలో మిన్ను అలియాస్ మిన‌ల్ సింగ్ రాఠోడ్‌ (దీపికా ప‌దుకొణె), తాజ్ (క‌ర‌ణ్ సింగ్ గ్రోవ‌ర్‌), బాష్ (అక్ష‌య్ ఒబెరాయ్‌) బృందం రంగంలోకి దిగుతుంది. గ‌గ‌న‌త‌లంలో శ‌త్రువుల‌పై వాళ్ల పోరాటం ఎలా సాగింది? పాటీ మ‌ళ్లీ నిబంధ‌న‌ల్ని అతిక్ర‌మించాడా? రెండేళ్ల కింద‌ట జ‌రిగిన ఆ సంఘ‌ట‌న ఏమిటి? త‌నకు ఎదురైన స‌వాళ్ల‌ని దాటి పాటీ నిజ‌మైన ఫైట‌ర్ అని ఎలా చాటుకున్నాడన్నది కథ.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని