Rashmika: ఆనంద్‌ మొహంలో ఆ నవ్వు చూడాలనుకుంటున్నా

‘‘ఆనంద్‌ దేవరకొండ నాకు సోదరుడితో సమానం. తనకు తెలియదు కానీ, తన మీద నేను చాలా ఆధారపడుతుంటా.

Updated : 29 May 2024 05:18 IST

‘‘ఆనంద్‌ దేవరకొండ నాకు సోదరుడితో సమానం. తనకు తెలియదు కానీ, తన మీద నేను చాలా ఆధారపడుతుంటా. ఈ సినిమా విజయవంతమైతే ఆనంద్‌ మొహంలో నవ్వు ఉంటుంది. ఆ నవ్వు చూడాలని కోరుకుంటున్నా’’ అన్నారు ప్రముఖ కథానాయిక రష్మిక. ఆమె ముఖ్య అతిథిగా ఇటీవల హైదరాబాద్‌లో ‘గం గం గణేశా’ విడుదల ముందస్తు వేడుక జరిగింది. ఆనంద్‌ దేవరకొండ కథానాయకుడిగా నటించిన చిత్రమిది. ప్రగతి శ్రీవాస్తవ, నయన్‌ సారిక కథానాయికలు. ఉదయ్‌ శెట్టి దర్శకుడు. కేదార్‌ సెలగంశెట్టి, వంశీ కారుమంచి నిర్మాతలు. ఈ చిత్రం ఈ నెల 31న రానుంది.

ఈ సందర్భంగా వేడుకని ఉద్దేశించి రష్మిక మాట్లాడుతూ ‘‘ఈ బృందానికి ఈ సినిమా ఎంత ముఖ్యమో నాకు తెలుసు. ‘గం గం గణేశా’ పాటలు వింటూ ఇంట్లో నేనూ డ్యాన్సులు చేశా. చేతన్‌ భరద్వాజ్‌ సంగీతం చాలా బాగుంది’’ అన్నారు. సాయి రాజేశ్‌ తీసిన ‘బేబీ’ చూశాక ఆయన దర్శకత్వంలో నటించాలనే కోరిక కలిగిందన్నారు రష్మిక. ఆనంద్‌ దేవరకొండ మాట్లాడుతూ ‘‘నేను ఇప్పటిదాకా ఈ సినిమాలో కనిపించినంత ఉత్సాహంగా మరే సినిమాలో కనిపించలేదు. భావోద్వేగాలతో కూడిన క్రైమ్‌ కామెడీ కథ దొరికితే వదులుకోవాలని అనిపించదు. ఇలాంటి కథని నా దగ్గరికి తీసుకొచ్చిన దర్శకుడు ఉదయ్‌కు కృతజ్ఞతలు. మా సినిమాతో సంబంధం లేని వంద మంది ప్రేక్షకులకు సినిమాని చూపించాం. వాళ్లంతా కథలో మలుపుల్ని, ఉత్కంఠని ఆస్వాదించారు. ఈ వేసవికి తగిన వినోదాత్మక చిత్రమిది. ఈ నెల 31న మాతోపాటు, మరో రెండు సినిమాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. అన్ని సినిమాలూ ఆదరణ పొందాలి. నెలకి కనీసం నాలుగు సినిమాలు ఆదరణ పొందితేనే పరిశ్రమ బాగుంటుంది. అందరికీ ఉపాధి దొరుకుతుంది’’ అన్నారు.

దర్శకుడు ఉదయ్‌ శెట్టి మాట్లాడుతూ ‘‘నా తొలి సినిమాకి ఆనంద్‌ లాంటి హీరో దొరకడం అదృష్టం. ఇందులో ఓ అతిథి పాత్ర ఉంది. థియేటర్లో చూశాక అందరూ  షాక్‌ అవుతారు’’ అన్నారు. ఈ కార్యక్రమంలో దర్శకులు సాయిరాజేశ్, అనుదీప్‌.కె.వి, బన్నీ వాస్, మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్మాత ఎస్‌.కె.ఎన్, నటులు సత్యం రాజేశ్, కృష్ణచైతన్య, యావర్, ఇమ్మానుయేల్, అనురాగ్‌ పర్వతనేని, గీత రచయిత సురేశ్‌ బనిశెట్టి నృత్య దర్శకుడు విజయ్‌ పొలాకీతోపాటు, ఇతర చిత్రబృందం పాల్గొంది.


నువ్వు నా ఫ్యామిలీ

నంద్‌ దేవరకొండ, ఇతర చిత్రబృందంతో కలిసి రష్మిక వేదికపై డ్యాన్సులు చేసి అలరించారు. మీతో కలిసి నటించిన హీరోల్లో మీకు ఇష్టమైన ఒకరు ఎవరు? అంటూ సరదాగా ఆనంద్‌ దేవరకొండ అడిగిన ఓ ప్రశ్నకి రష్మిక స్పందిస్తూ... ‘‘నువ్వు నా ఫ్యామిలీ ఆనంద్‌. ఇలా ఇరికిస్తే ఎలా?’ అంటూ బదులిచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని