Adipurush: ‘ఆదిపురుష్‌’ కోసం... భారతదేశంలోనే తొలిసారి!

‘‘కొత్త సాంకేతికతతో ‘ఆదిపురుష్‌’ తెరకెక్కుతోంది. పెద్ద తెర అనుభూతి కోసం చేశాం. ఈ తరహా ప్రయత్నం భారతదేశంలోనే తొలిసారి’’ అన్నారు కథానాయకుడు ప్రభాస్‌. ఆయన శ్రీరాముడిగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్‌’.

Updated : 07 Oct 2022 06:57 IST

‘‘కొత్త సాంకేతికతతో ‘ఆదిపురుష్‌’ తెరకెక్కుతోంది. పెద్ద తెర అనుభూతి కోసం చేశాం. ఈ తరహా ప్రయత్నం భారతదేశంలోనే తొలిసారి’’ అన్నారు కథానాయకుడు ప్రభాస్‌. ఆయన శ్రీరాముడిగా నటించిన చిత్రం ‘ఆదిపురుష్‌’. కృతిసనన్‌, సైఫ్‌ అలీఖాన్‌ ముఖ్యపాత్రలు పోషించారు. రామాయణం ఆధారంగా ఓం రౌత్‌ తెరకెక్కిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్‌తో కలిసి భూషణ్‌కుమార్‌, రాజేష్‌ నాయర్‌, క్రిషన్‌కుమార్‌, ప్రసాద్‌ సుతార్‌, ఓం రౌత్‌ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. గురువారం రాత్రి హైదరాబాద్‌లో త్రీడీ టీజర్‌ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభాస్‌ మాట్లాడుతూ ‘‘తొలిసారి త్రీడీలో టీజర్‌ చూసినప్పుడు చిన్న పిల్లాడినైపోయా. తొలిసారి నేను త్రీడీలో కనిపించడం, ఆ విజువల్స్‌, అవి మొహంమీదకి రావడం మంచి అనుభూతిని పంచింది. శుక్రవారం  అభిమానుల కోసం అరవై థియేటర్లలో త్రీడీ టీజర్‌ని ప్రదర్శిస్తున్నాం. వాళ్లే మాకు అండ. వాళ్లు చూసి ఏమనుకుంటారనేదే కీలకం. ఈ సినిమాని త్రీడీలో చూడటం ముఖ్యం. కొన్ని వారాల్లో మరో మంచి కంటెంట్‌ని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం. అభిమానులంతా ఆస్వాదిస్తారని నమ్ముతున్నా’’ అన్నారు. దిల్‌రాజు మాట్లాడుతూ ‘‘తొలిసారి టీజర్‌ చూడగానే నచ్చింది. ఒక గంట తర్వాత టీజర్‌పై వేరే అభిప్రాయాలు వ్యక్తమయ్యాయనే మాట వినిపించింది. ‘బాహుబలి’ తొలి ఆట చూసినప్పుడు కూడా అలాంటి అభిప్రాయాలే వినిపించాయి. ఈ సినిమా పెద్ద తెర అనుభవం. ఫోన్‌లో చూసి ఓ నిర్ణయానికి రాకూడదు. నేటి ప్రేక్షకులకి ఎలా చూపించాలో అలా చేశారు. ఓం రౌత్‌ తీసిన ‘తానాజీ’ గొప్పగా ఉంటుంది. విజువల్‌గా ఈ సినిమాని మరింత గొప్పగా తీశారు. విజువల్స్‌ ప్రధానంగా సాగే సినిమాలు వచ్చినప్పుడు అద్భుతాలు సాకారం అవుతాయి’’ అన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు, నిర్మాతలు భూషణ్‌కుమార్‌, రాజేశ్‌ నాయర్‌, ప్రమోద్‌, విక్రమ్‌ పాల్గొన్నారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు