ఈ ప్రయాణంలో నేర్చుకున్నది అదే

తన తొలి సినిమాతో ‘చూసీ చూడంగానే’ నచ్చేసిన కథానాయకుడు శివ కందుకూరి. ప్రేమకథలకి తగ్గ మరో హీరోలా కనిపించాడు. కానీ అలాంటి కథలకే పరిమితం కాకుండా, భిన్నమైన కథలతో ‘గమనం’, ‘మను చరిత్ర’ చేసి తనలోని నటుడిని ఆవిష్కరించాడు.

Published : 01 Mar 2024 01:33 IST

తన తొలి సినిమాతో ‘చూసీ చూడంగానే’ నచ్చేసిన కథానాయకుడు శివ కందుకూరి. ప్రేమకథలకి తగ్గ మరో హీరోలా కనిపించాడు. కానీ అలాంటి కథలకే పరిమితం కాకుండా, భిన్నమైన కథలతో ‘గమనం’, ‘మను చరిత్ర’ చేసి తనలోని నటుడిని ఆవిష్కరించాడు. ఇటీవల ఆయన కథానాయకుడిగా తెరకెక్కిన చిత్రం ‘భూతద్దం భాస్కర్‌ నారాయణ’. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా గురువారం శివ కందుకూరి హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

తొలిసారి డిటెక్టివ్‌ సినిమా చేశారు. ఆ అనుభవాల్ని పంచుకుంటారా?

మనకు క్రైమ్‌ థ్రిల్లర్స్‌, డిటెక్టివ్‌ సినిమాలు  కొత్త కాదు. ‘చంటబ్బాయ్‌’ మొదలుకొని మొన్నటి ‘ఏజెంట్‌ సాయి శ్రీనివాస్‌ ఆత్రేయ’ వరకూ డిటెక్టివ్‌ సినిమాలు చాలానే వచ్చాయి. ఇలాంటి జానర్‌ని మరోసారి స్పృశిస్తున్నప్పుడు కథలో వైవిధ్యం ఉండాలి. పురాణాలతో ముడిపెడితూ దర్శకుడు ఈ కథని మలచడం కొత్తగా, ఆసక్తికరంగా అనిపించింది. డిటెక్టివ్‌ పాత్రని కూడా ప్రత్యేకంగా  డిజైన్‌ చేశారు.

పాత్రలోని ఆ ప్రత్యేకత ఏమిటి?

ఇందులో నా పాత్ర పేరు భాస్కర్‌ నారాయణ. తన ప్రపంచమే నన్ను ఆకట్టుకుంటుంది. సహజంగా డిటెక్టివ్‌ పాత్ర అనగానే తనొక అనాథగా కనిపిస్తుంటాడు. కానీ ఇందులో భాస్కర్‌ నారాయణకి ఓ కుటుంబం ఉంటుంది. తనకి సరిగ్గా కళ్లు కనిపించకపోవడంతో భూతద్దాన్ని గుర్తు చేసే కళ్లద్దాలు ధరిస్తుంటాడు. డిటెక్టివ్‌ అనేసరికి భూతద్దాన్ని వాడుతుంటాం. అలా సినిమా కథకీ, పాత్రకీ సరిపడేలా ‘భూతద్దం భాస్కర్‌నారాయణ’ అనే పేరు పెట్టాం. ఈ కథలో హాస్యం, ప్రేమ నేపథ్యం కూడా మిళితమై ఉంటాయి. కథానాయిక రాశీ సింగ్‌ పాత్ర కూడా చాలా బాగుంటుంది.


కథానాయకుడిగా తొలి అడుగుల్లోనే వైవిధ్యం ప్రదర్శిస్తున్నారు. మీ ప్రయాణంపై సంతృప్తిగా ఉన్నారా?

ప్రతి సినిమాతోనూ ఓ కొత్త జానర్‌ చేస్తూ, కొత్త విషయాల్ని నేర్చుకున్నా. ఎదుగుతున్న ఓ నటుడిగా నేను ఎక్కడ బాగా ఫిట్‌ అవుతానో తెలుసుకోవడం కీలకం. ఆ ప్రయత్నంలో భాగంగా విభిన్నమైన కథల్ని ఎంచుకుంటూ ప్రయాణం చేయాల్సిందే. అలా చేస్తే నటుడిగానూ ఎదుగుతాం. ఇప్పటిదాకా చేసిన ప్రయాణంపై సంతృప్తిగా ఉన్నా. ఏం చేసినా భావోద్వేగాలు ప్రేక్షకులకు కనెక్ట్‌ అయ్యేలా ఉండాలనే విషయాన్ని ఈ ప్రయాణం నాకు బాగా నేర్పించింది.


ఇతర హీరోలతో కలిసి సినిమాలు చేస్తారా?

పెద్ద నటులు కూడా కలిసి మెలిసి సినిమాలు  చేస్తున్న సమయం ఇది. ప్రధాన పాత్రే తమకి  ముఖ్యం కాదని, మంచి సినిమా అయితే చాలని  కథానాయకులు నమ్ముతున్నారు. పరిశ్రమ అలాంటి పురోగతిలో ఉంది. నాకూ కథే ముఖ్యం. శర్వానంద్‌ - శ్రీరామ్‌ ఆదిత్య కలయికలో రూపొందుతున్న సినిమాలో ఓ ప్రధానమైన పాత్ర చేస్తున్నా.


కొత్తగా ఒప్పుకున్న సినిమాల సంగతులేమిటి?

ప్రమోద్‌ అనే కొత్త దర్శకుడితో ఓ సినిమా చేస్తున్నా. ఇది కాకుండా కొత్తగా రెండు సినిమాలున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని