aadi sai kumar: కృష్ణ @ బృందావనం

ఆది సాయికుమార్‌ కథానాయకుడిగా... వీరభద్రమ్‌ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్‌ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్‌’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే.

Updated : 19 Apr 2024 11:45 IST

ది సాయికుమార్‌ కథానాయకుడిగా... వీరభద్రమ్‌ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్‌ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్‌’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. దిగంగన సూర్యవంశీ కథానాయిక. తూము నరసింహా, జామి శ్రీనివాసరావు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. గురువారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైందీ చిత్రం. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత దిల్‌రాజు క్లాప్‌నివ్వగా, నటుడు సాయికుమార్‌ కెమెరా స్విచ్చాన్‌ చేయడంతోపాటు చిత్రబృందానికి స్క్రిప్ట్‌ని  అందజేశారు. దర్శకుడు అనిల్‌ రావిపూడి గౌరవ దర్శకత్వం వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో కథానాయకుడు ఆది సాయికుమార్‌ మాట్లాడుతూ ‘‘నేను, వీరభద్రమ్‌ చౌదరి కలిసి ‘చుట్టాలబ్బాయ్‌’ తర్వాత మరో సినిమా చేయాలని ప్రయత్నించాం. ఇన్నాళ్లకి ఓ మంచి కథ కుదిరింది. కుటుంబమంతా కలిసి హాయిగా నవ్వుకునేలా ఉంటుందీ చిత్రం. జూన్‌ నుంచి చిత్రీకరణ మొదలు పెడతాం. ‘క్రేజీ ఫెలో’ తర్వాత నేను, దిగంగన సూర్యవంశీ కలిసి చేస్తున్న చిత్రమిది. అనూప్‌ రూబెన్స్‌ నా సినిమాలకి మంచి పాటలు ఇస్తుంటారు. మరోసారి ఆయనతో కలిసి సినిమా చేస్తుండడం ఆనందంగా ఉంది’’ అన్నారు. దర్శకుడు మాట్లాడుతూ ‘‘ఈ సినిమాకి అన్నీ కలిసొచ్చాయి. మంచి కథతో, ఆద్యంతం వినోదం పంచేలా చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నాం. ఆది, దిగంగన జోడీ బాగుంటుంది. ఇందులో కథానాయికకీ బలమైన పాత్ర కుదిరింది. రాము సంభాషణలు, శ్యామ్‌ విజువల్స్‌తోపాటు సాంకేతికంగా సినిమా ఉన్నతంగా ఉంటుంది’’ అన్నారు. ‘‘కుటుంబ సమేతంగా చూడదగ్గ సినిమాల్ని తీస్తారు వీరభద్రమ్‌ చౌదరి. ‘కృష్ణ ఫ్రమ్‌ బృందావనం’ కూడా అలాంటిదే. ఎంతో తపన ఉన్న నిర్మాతలు, మంచి కథతో ఈ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా విజయవంతం అవుతుంది’’ అన్నారు సాయికుమార్‌. ఈ కార్యక్రమంలో చిత్రబృందం పాల్గొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని