prasanna vadhanam: విదేశాల్లో వచ్చినా... మన దేశంలో రాలేదు

‘‘సుహాస్‌ అనగానే వినూత్నమైన కథలే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకూ భారతీయ తెరపై చూడని ఓ కొత్త కథని ‘ప్రసన్న వదనం’తో చెబుతున్నాం.

Updated : 30 Apr 2024 09:44 IST

‘‘సుహాస్‌ అనగానే వినూత్నమైన కథలే గుర్తొస్తాయి. అందుకు తగ్గట్టుగానే ఇప్పటివరకూ భారతీయ తెరపై చూడని ఓ కొత్త కథని ‘ప్రసన్న వదనం’తో చెబుతున్నాం.  ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని పంచుతుందీ చిత్రం’’ అన్నారు యువ  నిర్మాత జేఎస్‌ మణికంఠ. సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టిన ఈయన... టి.ఆర్‌.ప్రసాద్‌రెడ్డితో కలిసి ‘ప్రసన్న వదనం’ నిర్మించారు. సుహాస్‌ కథానాయకుడిగా నటించారు. అర్జున్‌.వై.కె దర్శకత్వం వహించారు. ఈ చిత్రం మే 3న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా మణికంఠ సోమవారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు.

‘‘సుహాస్‌కి కొత్త కథలు బాగా నప్పుతాయి. ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ నేపథ్యంలో ఇదివరకు విదేశీ భాషల్లో సినిమాలొచ్చినా, మన దేశంలో మాత్రం రాలేదు. దర్శకుడు  అర్జున్‌ ఫేస్‌ బ్లైండ్‌నెస్‌ నేపథ్యంలో చెప్పిన ఈ కథ వినగానే చాలా బాగా నచ్చింది. సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లడానికి ముందే చాలా మందికి ఈ కథ వినిపించాం. ఓటీటీ సంస్థల దగ్గరకూ ఈ కథని తీసుకెళ్లాం. ఆహా సంస్థకీ మా కథ నచ్చడంతో ఈ సినిమాకీ నిర్మాణంలో భాగమైంది. మైత్రీ, హోంబలే సంస్థలు ఈ సినిమాని పంపిణీ చేస్తున్నాయి.  విడుదలకి ముందే మేం లాభాల్లో ఉన్నాం’’.  

  • ‘‘ఇదొక థ్రిల్లర్‌ కథ. సహజంగా థ్రిల్లర్‌ అనేసరికి తెరపై ఓ రకమైన చీకటిని చూపిస్తుంటారు. మేం మాత్రం అందుకు భిన్నంగా ఈ సినిమాని చేయాలనుకున్నాం. దర్శకుడు అర్జున్‌ చెప్పాలనుకున్న భావోద్వేగాన్ని పక్కాగా తెరపై ఆవిష్కరించారు. తను భవిష్యత్తులో పెద్ద దర్శకుడవుతారు.  కథానాయకుడు సుహాస్‌ తెలుగు పరిశ్రమకి ఓ అదృష్టం. క్రమశిక్షణ కలిగిన నటుడు. నిర్మాతలకి, దర్శకులకు ఆయనతో పనిచేయడం ఎంతో సౌకర్యం. నేను ‘కలర్‌ ఫొటో’,  ‘ఫ్యామిలీడ్రామా’ సినిమాలకి సహ నిర్మాతని’’.
  •  ‘‘ఐపీఎల్‌ మొదలుకొని, ఎన్నికల హడావుడి వరకూ ఎన్నున్నా వేసవి అనగానే అందరికీ సినిమాలే గుర్తొస్తాయి. కుటుంబంతో కలిసి సినిమాకి వెళ్లే ప్రేక్షకులు ఎప్పుడూ ఉంటారు. మా టార్గెట్‌ ప్రేక్షకులు మాకు ఉన్నారు. వాళ్లు ఈ సినిమాని తప్పకుండా చూస్తారు. మా తదుపరి సినిమా సుహాస్‌ కథానాయకుడిగానే ఉంటుంది. అదొక ఫాంటసీ కథతో రూపొందుతుంది’’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని