ఛోటా భీమ్‌ సూపర్‌ పవర్‌

‘ధైర్య సాహసాలతో తన ప్రాణాలు పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఒకడుంటాడు.

Published : 19 May 2024 00:31 IST

‘ధైర్య సాహసాలతో తన ప్రాణాలు పణంగా పెట్టి ఇతరుల ప్రాణాలను కాపాడేందుకు ఒకడుంటాడు. అలాంటి వాడు శతాబ్దాలకోసారి జన్మిస్తాడు. ఇప్పుడు ఛోటా భీమ్‌ వచ్చాడు’ అంటూ ‘ఛోటాభీమ్‌ అండ్‌ ది కర్స్‌ ఆఫ్‌ దమ్యాన్‌’ హంగామా మొదలైంది. ప్రముఖ బాలీవుడ్‌ నటుడు అనుపమ్‌ ఖేర్, మకరంద్‌ దేశ్‌పాండే తదితరులు కీలక పాత్రలు పోషించిన చిత్రమిది. రాజీవ్‌ చిలక దర్శకత్వంలో రానున్న ఈ లైవ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ని మేఘ చిలక నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ని ముంబయి వేదికగా విడుదల చేసింది చిత్రబృందం. సుందరమైన ఢోలక్‌పూర్‌ని దమ్యాన్‌ ఎలా నాశనం చేశాడు, ఆ గ్రామాన్ని తన సూపర్‌పవర్స్‌తో ఛోటా భీమ్‌ ఎలా రక్షించుకున్నాడనే కథనంతో ఈ చిత్రం రానుంది. గురు శంభు పాత్రలో అనుపమ్‌ ఖేర్‌ నటించారు. తన స్నేహితులు చుట్కీ, ఢోలు, భోలు, రాజులతో తెరపై వినోదాన్ని పంచేందుకు భీమ్‌ సిద్ధంగా ఉన్నాడు. ఈ చిత్రం ఈ నెల 31న విడుదల కానుంది. 


స్వీట్‌గా.. క్యూట్‌గా! 

చైతన్య రావు హీరోగా బాల రాజశేఖరుని తెరకెక్కించిన సినిమా ‘హనీమూన్‌ ఎక్స్‌ప్రెస్‌’. కె.కె.ఆర్, బాలరాజ్‌ సంయుక్తంగా నిర్మించారు. హెబ్బా పటేల్‌ కథానాయిక. తనికెళ్ల భరణి, సుహాసిని, అలీ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమాలోని ‘‘క్యూట్‌గా స్వీట్‌గా’’ అనే గీతాన్ని హీరో అడివి శేష్‌ ఇటీవల విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘‘పాట చాలా స్వీట్‌గా ఉంది. కల్యాణి మాలిక్‌ సంగీతం బాగుంది. కిట్టూ విస్సాప్రగడ సాహిత్యం చక్కగా కుదిరింది. సినిమా విజయవంతమవ్వాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ‘‘మంచి మ్యూజికల్‌ రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ ఇది. ఇందులోని ప్రతి పాట అందర్నీ అలరిస్తుంది. త్వరలో ట్రైలర్, విడుదల తేదీని ప్రకటిస్తాం’’ అన్నారు దర్శకుడు బాల రాజశేఖరుని. 


కొత్త కబురు వినిపించారు 

తేడాది ‘చిన్నా’ సినిమాతో ప్రేక్షకుల్ని మెప్పించారు హీరో సిద్ధార్థ్‌. ఇప్పుడు తన 40వ సినిమాని ప్రకటించారు. శ్రీ గణేష్‌ దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ ద్విభాషా చిత్రాన్ని అరుణ్‌ విశ్వ నిర్మించనున్నారు. ఈ సందర్భంగా హీరో సిద్ధార్థ్‌ మాట్లాడుతూ.. ‘‘నేను ‘చిన్నా’ తర్వాత చాలా కథలు విన్నా. గణేష్‌ చెప్పిన ఈ కథ నాకు బాగా నచ్చింది. మా ఇద్దరి కలయికలో ఆహ్లాదకరమైన అనుభూతిని అందించే సినిమా వస్తుందనే నమ్మకం నాకుంది’’ అన్నారు. 


‘డియర్‌ ఉమ’.. నీవెవరో 

‘డియర్‌ ఉమ’తో ప్రేక్షకుల్ని పలకరించనుంది సుమయా రెడ్డి. ఆమె కథానాయికగా నటిస్తూ స్వయంగా నిర్మించిన ఈ సినిమాని సాయి రాజేశ్‌ మహాదేవ్‌ తెరకెక్కించారు. పృథ్వీ అంబర్‌ కథానాయకుడు. శనివారం సుమయా పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి ‘‘నీవెవ్వరో..’’ అనే పాటతో పాటు ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశారు. ‘‘మంచి ఆహ్లాదకరమైన ప్రేమకథతో తెరకెక్కిన చిత్రమిది. నిర్మాతగా సుమయాకు ఇది తొలి చిత్రమైనా ఎక్కడా రాజీ పడకుండా నిర్మించింది. రచయితగానూ తన అభిరుచిని చాటుకునేలా ఈ సినిమా ఉంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. 


వరంగల్‌ అమ్మాయి.. హైదరాబాద్‌ అబ్బాయి

విక్రాంత్, చాందినీ చౌదరి జంటగా సంజీవ్‌ రెడ్డి తెరకెక్కిస్తున్న చిత్రం ‘సంతాన ప్రాప్తిరస్తు’. మధుర శ్రీధర్‌ రెడ్డి, నిర్వి హరిప్రసాద్‌ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. వెన్నెల కిశోర్, అభినవ్‌ గోమఠం తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా శనివారం హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి మంతెన వెంకట రామరాజు క్లాప్‌ కొట్టారు. అంబికా కృష్ణ కెమెరా స్విచ్చాన్‌ చేశారు. మధుర శ్రీధర్‌ గౌరవ దర్శకత్వం చేశారు. చిత్ర దర్శకుడు సంజీవ్‌ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘వరంగల్‌ అమ్మాయి, హైదరాబాద్‌ అబ్బాయి మధ్య కథ జరుగుతుంది. కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే ఓ సమస్యను దీంట్లో వినోదాత్మకంగా చూపించనున్నాం’’ అన్నారు. 


నీ కథే... నీ దారి 

ప్రియతమ్‌ మంతిని, విజయ విక్రాంత్‌ ప్రధాన పాత్రల్లో వంశీ జొన్నలగడ్డ తెరకెక్కించిన చిత్రం ‘నీ దారే నీ కథ’. తేజేష్, వీర, వంశీ, శైలజ జొన్నలగడ్డ నిర్మించారు. అనంత పద్మశాల, అంజన బాలాజీ కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా జూన్‌ 14న రానుంది. ‘‘తండ్రీ కొడుకుల అనుబంధం, స్నేహం, సంకల్పం తదితర అంశాల మేళవింపుతో రూపొందిన చిత్రమిది. యువతను ఆకర్షించే వినూత్నమైన కథతో నిండి ఉంటుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని