సంగీత పరిణామం... మనోహర ప్రయాణం

సంగీత సరిగమల సంద్రంలో.. పదాలే పడవలుగా ప్రయాణం చేస్తూ.. గొప్ప సంగీతకారులుగా ఎదుగుతారు కొందరు. అలా ఎదిగిన వారిలో ఏఆర్‌. రెహమాన్‌ ఒకరు.

Published : 21 May 2024 01:03 IST

సంగీత సరిగమల సంద్రంలో.. పదాలే పడవలుగా ప్రయాణం చేస్తూ.. గొప్ప సంగీతకారులుగా ఎదుగుతారు కొందరు. అలా ఎదిగిన వారిలో ఏఆర్‌. రెహమాన్‌ ఒకరు. ఎన్నో అద్భుతమైన పాటల్ని ప్రేక్షకులకు అందించిన ఈయన పాటల్నే కాదు మంచి చిత్రాల్ని కూడా నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నిర్మించనున్న మ్యూజికల్‌ డాక్యుమెంటరీ ‘హెడ్‌హంటింగ్‌ టు బీట్‌బాక్సింగ్‌’. రోహిత్‌ గుప్తా దర్శకుడు. ఎంతో ప్రతిష్ఠాత్మకంగా జరుగుతున్న కేన్స్‌ చిత్రోత్సవంలో భాగంగా ఈ ప్రాజెక్టు టైటిల్‌ పోస్టర్‌ని విడుదల చేశారు. ‘సంగీత పరిణామాన్ని గుర్తిస్తూ..మనోహరమైన ప్రయాణాన్ని అన్వేషించే ప్రాజెక్టిది. పురాతన సంప్రదాయాల నుంచి సంగీత పునరుజ్జీవనం వరకూ ఈ డాక్యుమెంటరీ ప్రేక్షకులకు మంచి ప్రయాణాన్ని అందిస్తుంద’ని దర్శకనిర్మాతలు తెలిపారు. ప్రస్తుతం నిర్మాణానంతర పనుల్లో ఉన్న ఈ డాక్యుమెంటరీ గురించి మరిన్ని ఆసక్తికర విషయాల్ని త్వరలో ప్రకటిస్తామని రెహమాన్‌ అన్నారు. మ్యూజికల్‌ మాస్ట్రో రెహమాన్‌ ఈ డాక్యుమెంటరీతో ఎలాంటి మ్యాజిక్‌ చేస్తారో తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. 


నవ్విస్తూ థ్రిల్‌ చేసే చిత్రమిది 

‘దసరా’లో నాని మిత్రుడిగా కనిపించి ప్రేక్షకుల్ని అలరించారు కన్నడ నటుడు దీక్షిత్‌ శెట్టి. ఇప్పుడాయన హీరోగా తెలుగు, కన్నడ భాషల్లో రూపొందుతోన్న ద్విభాషా చిత్రం ‘బ్యాంక్‌ ఆఫ్‌ భాగ్యలక్ష్మి’. ఎమ్‌.అభిషేక్‌ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని హెచ్‌.కె.ప్రకాశ్‌ నిర్మిస్తున్నారు. బృందా ఆచార్య కథానాయిక. ఈ చిత్ర ఫస్ట్‌లుక్‌ను ఇటీవల విడుదల చేశారు. అందులో దీక్షిత్‌ తుపాకీ గురి పెట్టి సీరియస్‌గా చూస్తూ కనిపించారు. ‘‘ఇదొక భిన్నమైన క్రైమ్‌ కామెడీ థ్రిల్లర్‌. ఓ వైపు నవ్విస్తూనే ఆద్యంతం ఉత్కంఠత రేకెత్తిస్తూ సాగుతుంది. ఈ నెల 25న ఈ చిత్ర టీజర్‌ను విడుదల చేయనున్నాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాకి సంగీతం: జుధాన్‌ శ్యాండీ, ఛాయాగ్రహణం: జె.అభిషేక్‌. 


మల్లె మొగ్గ తర్వాత తథాస్తు

రామ్‌ తేజ్‌ హీరోగా తోట వెంకట నాగేశ్వరరావు స్వీయ దర్శకత్వంలో నిర్మించిన చిత్రం ‘మల్లె మొగ్గ’. వర్షిణి, మౌనిక కథానాయికలు. భాను చందర్‌ ముఖ్య పాత్ర పోషించారు. ఈ సినిమా ఇటీవల విడుదలైన నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో సక్సెస్‌మీట్‌ను ఏర్పాటు చేశారు. ఈ వేడుకలోనే రామ్‌ తేజ్‌ - నాగేశ్వరరావుల తదుపరి చిత్రం ‘తథాస్తు’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ‘‘మా ‘మల్లె మొగ్గ’ చిత్రానికి బీ, సీ సెంటర్లలో ఆదరణ బాగుంది’’ అన్నారు దర్శక నిర్మాత తోట వెంకట నాగేశ్వరరావు.   


యాక్షన్‌ బ్రదర్‌ 

శివ కంఠమనేని హీరోగా గోసంగి సుబ్బారావు తెరకెక్కించిన చిత్రం ‘బిగ్‌ బ్రదర్‌’. కె.శివ శంకర్‌రావు, ఆర్‌.వెంకటేశ్వరరావు సంయుక్తంగా నిర్మించారు.  ప్రియా హెగ్డే, గుండు సుదర్శన్, రాజేందర్‌ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సినిమా ఈ నెల 24న విడుదల కానున్న నేపథ్యంలో హైదరాబాద్‌లో సోమవారం విడుదల ముందస్తు వేడుక నిర్వహించారు. మురళీ మోహన్, అశోక్‌ కుమార్, కేఎల్‌.దామోదర్‌ ప్రసాద్‌ తదితరులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా దర్శకుడు సుబ్బారావు మాట్లాడుతూ.. ‘‘చాలా రోజుల తర్వాత ఈ సినిమాతో తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తున్నాను. ఇది యాక్షన్‌ ప్రాధాన్యమున్న ఆసక్తికర కథతో తెరకెక్కింది. తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అన్నారు. ‘‘యాక్షన్‌ సినిమాల్ని ఇష్టపడే వారిని ఈ చిత్రం చక్కగా అలరిస్తుంది’’ అన్నారు నిర్మాత ఆర్‌.వెంకటేశ్వరరావు. హీరో శివ మాట్లాడుతూ.. ‘‘ఫ్యామిలీ డ్రామా నేపథ్యంలో సాగే యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ఇది. దీంట్లో టైటిల్‌ పాత్ర పోషించినందుకు గర్వంగా ఉంది’’ అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని