ఆ ఖైదీ జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు?

‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమాలో గడ్డం అనే పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించారు మోహన్‌ భగత్‌. ఇప్పుడాయన హీరోగా వి.అజయ్‌ నాగ్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆరంభం’. అభిషేక్‌ వి.తిరుమలేష్‌ నిర్మించారు.

Updated : 23 May 2024 06:07 IST

‘కేరాఫ్‌ కంచరపాలెం’ సినిమాలో గడ్డం అనే పాత్రలో కనిపించి ప్రేక్షకుల్ని మెప్పించారు మోహన్‌ భగత్‌. ఇప్పుడాయన హీరోగా వి.అజయ్‌ నాగ్‌ తెరకెక్కించిన చిత్రం ‘ఆరంభం’. అభిషేక్‌ వి.తిరుమలేష్‌ నిర్మించారు. రవీంద్ర విజయ్, లక్ష్మణ్‌ మీసాల తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఇటీవలే థియేటర్లలో విడుదలై విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా ఈరోజు నుంచి ఈటీవీ విన్‌ ఓటీటీలో ప్రదర్శితం కానుంది. ఈ నేపథ్యంలోనే బుధవారం ‘ఈనాడు సినిమా’తో ప్రత్యేకంగా చిత్ర విశేషాలు పంచుకున్నారు అజయ్‌ నాగ్‌. 

‘‘నేను దర్శకుడిగా మారడానికి ముందు ‘విందు భోజనం’, ‘ది గ్రేట్‌ ఇండియన్‌ సూసైడ్‌’ చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా వ్యవహరించా. ఇలా ఓవైపు పని చేస్తూనే దర్శకత్వ ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చా. నాకు మొదటి నుంచి నవలలు చదవడమంటే చాలా ఇష్టం. కొవిడ్‌ టైమ్‌లో ‘నీను నిన్నోలాగే ఖైదీ’ అనే కన్నడ నవల చదివా. అది నాకు బాగా నచ్చింది. దీన్నెవరైనా సినిమా తీస్తే బాగుంటుందనిపించింది. ఆ తర్వాత ఆ పుస్తక రచయితను అభినందిద్దామని ఫోన్‌ చేసినప్పుడు తనది మా ఊరే అని తెలిసింది. తనకు దీన్ని సినిమా చేయొచ్చు కదా అని చెప్పినప్పుడు ఆ ప్రయత్నమేదో మీరే చేయండని ప్రోత్సహించారు. అలా ఈ కథతో దర్శకుడిగా నా ప్రయాణం మొదలైంది’’. 

  • ‘‘సైన్స్‌ ఫిక్షన్‌ అంశాలతో ముడిపడి ఉన్న విభిన్నమైన చిత్రమిది. బలమైన భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ట్రైలర్‌లో చూపించినట్లుగా ఓ ఖైదీ జైలు నుంచి తప్పించుకునే సన్నివేశంతో నేరుగా అసలు కథ మొదలైపోతుంది. ఇక ఆ తర్వాత నుంచి అతను జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడన్న ప్రశ్న ప్రేక్షకుల్ని తొలిచేస్తుంటుంది. కానీ, ఈలోగానే వాళ్లను మరో కొత్త ప్రపంచంలోకి ఈ కథ తీసుకెళ్లిపోతుంది. అక్కడ ఓ చిన్న ఫ్యామిలీ కథ చెప్తాం. అదీ అందర్నీ ఆకట్టుకుంటుంది. అయితే ఓవైపు ఈ కథ భావోద్వేగభరితంగా సాగుతున్నా.. ఆ ఖైదీ జైలు నుంచి ఎలా తప్పించుకున్నాడు? తనకు ఎవరు సాయం చేశారన్న? ప్రశ్న చివరి వరకు ప్రేక్షకుల్ని సీటు అంచున కూర్చోబెట్టేలా చేస్తుంది’’.
  • ‘90స్‌’ సిరీస్‌ వచ్చినప్పటి నుంచి ఈటీవీ విన్‌ను అందరూ చూస్తూనే ఉన్నారు. మంచి కథా బలమున్న చిత్రాల్ని ఎంచుకుని ప్రేక్షకులకు అందిస్తోంది. ఇప్పుడీ వేదిక ద్వారా మా ‘ఆరంభం’ సినీప్రియుల ముందుకొస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది. ప్రయోగాలని చెప్పను కానీ, భవిష్యత్తులో వినూత్నమైన కొత్త కథలతో ప్రేక్షకుల్ని అలరించాలని ఉంది. త్వరలో నా తదుపరి చిత్రాన్ని ప్రకటిస్తా’’.

 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని