వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’ నుంచి వైదొలిగిన సంజయ్‌దత్‌

అక్షయ్‌కుమార్, అనిల్‌ కపూర్, రవీనా టాండన్, దిశా పటానీ, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, లారా దత్తా, తుషార్‌ కపూర్‌లాంటి భారీ తారాగణంతో అహ్మద్‌ఖాన్‌ తెరకెక్కిస్తున్న కామెడీ థ్రిల్లర్‌ ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’.

Updated : 23 May 2024 05:50 IST

అక్షయ్‌కుమార్, అనిల్‌ కపూర్, రవీనా టాండన్, దిశా పటానీ, జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్, లారా దత్తా, తుషార్‌ కపూర్‌లాంటి భారీ తారాగణంతో అహ్మద్‌ఖాన్‌ తెరకెక్కిస్తున్న కామెడీ థ్రిల్లర్‌ ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’. ఇందులో సీనియర్‌ నటుడు సంజయ్‌దత్‌ సైతం ఒక కీలక పాత్ర పోషిస్తున్నట్టు గతంలో అక్షయ్‌కుమార్, ఫిరోజ్‌ నడియాడ్‌వాలా ప్రకటించారు. అయితే తేదీల సర్దుబాటు కారణంగా సంజయ్‌దత్‌ ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్టు సమాచారం. ‘సంజయ్‌దత్‌ ఇతర సినిమాల షూటింగ్‌ కారణంగా ‘వెల్‌కమ్‌ టు ది జంగిల్‌’లో నటించలేకపోతున్నారు. ఈ విషయాన్ని మిత్రుడు అక్షయ్‌ కుమార్‌కి వివరించారు. ఈ సినిమా నుంచి తప్పుకొంటున్నందుకు ఆయన కూడా అసంతృప్తిగానే ఉన్నారు’ అంటూ సన్నిహితవర్గాలు పేర్కొన్నాయి. సంజయ్‌ గతంలో మొదటి షెడ్యూల్‌లో చిత్రీకరణలో సైతం పాల్గొన్నారు. ఆ సన్నివేశాలను అలాగే ఉంచి, అతడిని అతిథి పాత్రగా చూపించనున్నట్టు తెలుస్తోంది.


వాటాల ప్రాతిపదికనే సినిమా ప్రదర్శనలు

జులై 1 నుంచి అమలు చేస్తామని వెల్లడి 
తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ నిర్ణయం

సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్ల మనుగడ కోసం వాటాల ప్రాతిపదికన సినిమా ప్రదర్శనలు జరపాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలంగాణ ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ వెల్లడించింది. జులై 1 నుంచి ఈ విధానం అమలయ్యేలా చూడాలని నిర్మాతల మండలి, చలన చిత్ర వాణిజ్య మండళ్లకి లేఖలు పంపించింది. ప్రస్తుతం అమలులో ఉన్న అద్దె ప్రాతిపదికన ప్రదర్శనలతో థియేటర్ల యాజమాన్యాలకి నష్టం చేకూరుతోందని, అందుకే వాటాలు ఖరారు చేశామని తెలిపింది. ఇటీవల సమావేశమైన ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌  వాటాల వివరాల్ని ప్రకటించింది. సినిమా విడుదలకి ముందు రోజు రాత్రి అభిమానుల కోసం నిర్వహించే ప్రత్యేక ప్రదర్శనలు కూడా థియేటర్‌ యాజమాన్యాలకి ఇబ్బందిగా పరిణమించాయని, వాటిపై కూడా త్వరలోనే ఓ నిర్ణయం తీసుకుంటామని ఎగ్జిబిటర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది. 


ట్రంప్‌ బయోపిక్‌పై వివాదం 

వాషింగ్టన్‌: అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ బయోపిక్‌ ప్రీమియర్‌ షో ఇటీవల కేన్స్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌లో ప్రదర్శించారు. ‘ది అప్రెంటిస్‌’ పేరిట వచ్చిన ఈ చిత్రంపై ఆయన బృందం తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. దీన్ని కోర్టులో సవాల్‌ చేస్తామని వెల్లడించాయి. 1970, 1980లలో ట్రంప్‌ అమెరికా స్థిరాస్తి వ్యాపారంలో ఎలా ఎదిగారో ఈ సినిమాలో చూపించారు. ఇందులో కొన్ని సన్నివేశాలు కల్పితమని.. మాజీ అధ్యక్షుడి ప్రతిష్ఠను దిగజార్చేలా ఉన్నాయని ఆయన ప్రచార బృందం ఆరోపించింది. దీన్ని ఒక చెత్త చిత్రంగా కొట్టిపారేసింది. హాలీవుడ్‌ ప్రముఖుల కుట్రగా అభివర్ణించింది. చాలా సన్నివేశాలు కల్పితాలు అనే డిస్‌క్లెయిమర్‌తోనే ఈ చిత్రం ప్రారంభమవుతుందని సమీక్షకులు వెల్లడించారు. శృంగార తారకు అక్రమ నిధుల బదిలీ కేసులో ట్రంప్‌ ప్రస్తుతం కోర్టు విచారణ ఎదుర్కొంటున్న విషయం తెలిసిందే. మరోవైపు నవంబరులో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో ఆయన రిపబ్లికన్‌ పార్టీ తరఫున బరిలో ఉన్నారు. అలాంటి సమయంలో ఈ చిత్రం తెరపైకి రావడం గమనార్హం.. ప్యామ్‌ అండ్‌ టామీ, డంబ్‌ మనీ సహా పలు ఎంసీయూ చిత్రాల్లో వింటర్‌ సోల్జర్‌గా నటించిన సెబాస్టియన్‌ స్టాన్‌ దీంట్లో ట్రంప్‌ పాత్రను పోషించారు. అలాగే ఆయన మెంటార్, ప్రముఖ న్యాయవాది రాయ్‌ కోన్‌ పాత్రలో సక్సెషన్‌ సినిమా స్టార్‌ జెరెమీ స్ట్రాంగ్‌ కనిపించారు.

ఎన్నికల్లో హాలీవుడ్‌ ప్రముఖుల జోక్యం..

ట్రంప్‌ ప్రచార బృందం డైరెక్టర్‌ స్టీవెన్‌ చియుంగ్‌ ఈ సినిమాపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసత్యాలను సంచలనం చేసేందుకు తీసిన ఒక చెత్త సినిమా అని కొట్టిపారేశారు. ఇందులో చూపించినవన్నీ కల్పితాలని పేర్కొన్నారు. దీన్ని రాబోయే అధ్యక్ష ఎన్నికల్లో హాలీవుడ్‌ ప్రముఖుల జోక్యంగా అభివర్ణించారు. ఈ ఆరోపణలపై డైరెక్టర్‌ అబ్బాసీ స్పందించారు. సినిమా చూడకుండా కోర్టులో సవాల్‌ చేయడం సరికాదని హితవు పలికారు. ఈ చిత్రాన్ని చూసి ట్రంప్‌ కచ్చితంగా ఆశ్చర్యపోతారని.. ఎట్టిపరిస్థితుల్లోనూ ఆయన ఆగ్రహించరని చెప్పుకొచ్చారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని