ఆమె ఓ కదిలే కవిత్వం

ఆమె నడవడిక, మాటలు, ఆలోచనలు, పనులు... అన్నింటిలోనూ స్వచ్ఛతే! అందుకు తగ్గట్టే పేరు కూడా. ..శుద్ధి అయోధ్య. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె చలనం ఉన్న ఓ కవిత్వం లాంటిది.

Published : 08 Jun 2024 01:12 IST

మె నడవడిక, మాటలు, ఆలోచనలు, పనులు... అన్నింటిలోనూ స్వచ్ఛతే! అందుకు తగ్గట్టే పేరు కూడా. ..శుద్ధి అయోధ్య. ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె చలనం ఉన్న ఓ కవిత్వం లాంటిది. ఆమె జీవితంలో 19 నుంచి 27 ఏళ్ల వరకూ సాగిన ప్రయాణం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమే... ‘8 వసంతాలు’. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై రూపొందుతున్న చిత్రమిది. ఫణీంద్ర నర్సెట్టి దర్శకత్వం వహిస్తున్నారు. అనంతిక సనిల్‌ కుమార్‌ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. నవీన్‌ యెర్నేని, వై.రవిశంకర్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తాజాగా ఈ సినిమాలోని ప్రధాన పాత్రధారి అనంతిక లుక్‌ని శుక్రవారం విడుదల చేశారు. శుద్ధి అయోధ్య పేరుతో ఆమె తెరపై కనిపించనున్నారు. ‘‘సున్నితమైన భావాలున్న ఓ కూతురు, ఓ స్నేహితురాలు, ఓ రచయిత, అంతకంటే కూడా మానవతా విలువలున్న వ్యక్తిగా.. ఇలా పలు పాత్రలు పోషించిన ఓ యువతి, తన ఎనిమిదేళ్ల జీవితంలో కలిసిన వ్యక్తులు, ప్రదేశాలు, అనుభూతి చెందిన భావోద్వేగాల చుట్టూ సాగే కథే ఈ చిత్రం. అగ్ర తారలతో భారీ సినిమాలే కాకుండా, ఇలాంటి కథాబలం ఉన్న  చిత్రాల్నీ నిర్మిస్తోంది మైత్రీ మూవీ మేకర్స్‌. ఆ సంస్థలో ఇది గుర్తుండిపోయే చిత్రమవుతుంది. ‘మ్యాడ్‌’ సినిమాతో ఆకట్టుకున్న అనంతిక ఇందులో శుధ్ధి అయోధ్య పాత్రలో ఒదిగిపోయి నటించార’’ని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: నరేశ్‌ కుమారన్, ఛాయాగ్రహణం: విశ్వనాథ్‌ రెడ్డి, ప్రొడక్షన్‌ డిజైన్‌: అరవింద్‌ మ్యూల్‌. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని