వినోదం + సందేశం

‘కె.జి.ఎఫ్‌’ చిత్రాలతో కథానాయకుడు యశ్‌ పేరు మార్మోగిపోయింది. అప్పట్నుంచి ఆయన పాత  సినిమాలన్నీ అనువాదాలై, వరుసగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఆయన కన్నడలో చేసిన  చిత్రాల్లో ‘రాజధాని’ ఒకటి.

Updated : 11 Jun 2024 06:42 IST

‘కె.జి.ఎఫ్‌’ చిత్రాలతో కథానాయకుడు యశ్‌ పేరు మార్మోగిపోయింది. అప్పట్నుంచి ఆయన పాత  సినిమాలన్నీ అనువాదాలై, వరుసగా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. ఆయన కన్నడలో చేసిన  చిత్రాల్లో ‘రాజధాని’ ఒకటి. అది ‘రాజధాని రౌడీ’ పేరుతో ఈ నెల 14న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో యశ్‌కి జోడీగా షీనా నటించారు. నిర్మాత సంతోష్‌ కుమార్‌ మాట్లాడుతూ  ‘‘వినోదం, సందేశం మేళవింపుగా...  నలుగురు యువకుల చుట్టూ సాగే కథ ఇది. ప్రకాశ్‌రాజ్‌ ఓ శక్తిమంతమైన పోలీసు అధికారి పాత్రలో కనిపిస్తారు. ముమైత్‌ఖాన్‌ తన అందచందాలతో కనువిందు చేస్తారు. అర్జున్‌ జన్య సంగీతం కీలకం. ఇలాంటి చిత్రాన్ని తెలుగులో విడుదల చేస్తున్నందుకు గర్వంగా ఉంది’’ అన్నారు. 


రాయన్‌ రాక ఆలస్యం..

‘‘తలవంచి ఎరుగడే.. తలదించి నడువడే.. తన పేరే విజయుడే’’ అంటూ ఇటీవలే ‘రాయన్‌’ సినిమాలోని తన పాత్రను ప్రేక్షకులను పరిచయం చేశారు కథానాయకుడు ధనుష్‌. ఆయన స్వీయ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. సందీప్‌ కిషన్, ఎస్‌జే సూర్య, కాళిదాస్‌ జయరామ్, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే దీన్ని జూన్‌లో విడుదల చేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా జులై 26న రాబోతున్నట్లు తెలుపుతూ.. ఇన్‌స్టా వేదికగా కొత్త పోస్టర్‌ను పంచుకుంది.


కాలభైరవ స్వరాలతో ‘యుఫోరియా’ 

ప్రముఖ దర్శకుడు గుణశేఖర్‌ ఇటీవలే కొత్త చిత్రాన్ని ప్రకటించారు. ‘యుఫోరియా’ పేరుతో రూపొందనున్న ఈ సినిమాని గుణ హ్యాండ్‌మేడ్‌ ఫిలిమ్స్‌ పతాకంపై నీలిమ గుణ నిర్మించనున్నారు. ఈ చిత్రం కోసం సంగీత దర్శకుడిగా కాలభైరవను ఖరారు చేశారు. ఈ విషయాన్ని సోమవారం సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించారు. 


ఆరు భాషల్లో... వరదరాజు గోవిందం

వి జంగు, ప్రీతి కొంగన జంటగా... సముద్ర దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘వరదరాజు గోవిందం’. వి.సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మాత. ఆగస్టులో ఆరు భాషల్లో ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో టీజర్‌ విడుదల కార్యక్రమాన్ని నిర్వహించారు. నటుడు సుమన్, దర్శకులు రేలంగి నరసింహారావు, ముప్పలనేని శివ, చంద్రమహేశ్, రవికుమార్‌ చౌదరి, శివనాగు, నగేశ్‌ నారదాసి, గోసంగి సుబ్బారావు, అమ్మరాజశేఖర్, నిర్మాతలు టి.ప్రసన్నకుమార్, కె.దామోదర్‌ ప్రసాద్, కేకే రాధామోహన్, డి.ఎస్‌.రావు, శోభారాణి తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. దర్శకుడు సముద్ర మాట్లాడుతూ ‘‘శ్రీకృష్ణుడితో ముడిపడిన అంశాలతో ఈ సినిమాని తెరకెక్కించాం’’ అన్నారు. 


సీతాకోకై ఎగిరింది మనసే..

చిమటా రమేశ్‌ బాబు కథానాయకుడిగా నటిస్తూ... దర్శకత్వం వహించిన చిత్రం ‘నేనే కీర్తన’. రిషిత, మేఘన  కథానాయికలు. చిమటా లక్ష్మీకుమారి నిర్మాత. చిమటా జ్యోతిర్మయి సమర్పకులు. ఈ సినిమాలోని ‘సీతాకోకై ఎగిరింది మనసే...’ అంటూ సాగే పాటని దర్శకనిర్మాత సాయిరాజేశ్‌ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ‘‘పాట బాగుంది.  చిత్రంలో సక్సెస్‌ కళ కనిపిస్తోంది.  కథానాయకుడు, దర్శకుడికీ ఉజ్వల భవిష్యత్‌ ఉండాలని కోరుకుంటున్నా’’ అన్నారు. చిమటా రమేశ్‌ బాబు మాట్లాడుతూ ‘‘బహుళ నేపథ్యాలున్న కథని ఎంచుకుని చేసిన చిత్రమిది. కథనం కూడా కొత్తగా ఉంటుంది. కులుమనాలిలో చిత్రీకరించిన పాట, ఆరు పోరాట ఘట్టాలు ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. సెన్సార్‌ కార్యక్రమాలు పూర్తయ్యాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తాం’’ అన్నారు. సంధ్య, జీవా, విజయ రంగరాజు, బబర్దస్త్‌ అప్పారావు, సన్నీ, రాజ్‌కుమార్‌ ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రానికి సంగీతం: ఎం.ఎల్‌.రాజా, ఛాయాగ్రహణం: కె.రమణ.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని