Salaar: ‘సౌత్‌ ఇండస్ట్రీ వర్సెస్‌ బాలీవుడ్‌’.. ప్రభాస్‌ను ప్రశంసించిన టీనూ ఆనంద్‌

‘సలార్‌’ సక్సెస్‌ అయిన సందర్భంగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న టీనూ ఆనంద్‌.. ప్రభాస్‌ గురించి మాట్లాడారు.

Published : 23 Jan 2024 02:22 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘సలార్‌’ (Salaar) సినిమా చిత్రీకరణ రోజులను గుర్తుచేసుకుంటూ ప్రభాస్‌ (Prabhas)పై బాలీవుడ్‌ నటుడు టీనూ ఆనంద్‌ (Tinnu Anand) ప్రశంసలు కురిపించారు. ఇతరులను ప్రోత్సహించడంలో ముందుంటారని అన్నారు. ఆ చిత్రం విజయోత్సవంలో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని మాట్లాడారు. ‘సౌత్‌ ఇండస్ట్రీ వర్సెస్‌ బాలీవుడ్‌’ అంశంపై స్పందించారు. ‘‘ఓ రోజు నేను, ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌, ఆయన భార్య, ప్రశాంత్‌ నీల్‌ ‘సలార్‌’ సెట్స్‌లో ల్యాప్‌టాప్‌లో టీజర్‌ చూశాం. అందులో తన పాత్రకు నేనిచ్చిన ఎలివేషన్‌కు ప్రభాస్‌ ఫిదా అయ్యారు. వెంటనే నా దగ్గరకు వచ్చి హగ్‌ చేసుకున్నారు. టీజర్‌ మొత్తంలో ఒకే ఒక షాట్‌ తనది. అయినా ‘టీనూ సర్‌.. అదిరిపోయింది’ అని నాకు కితాబిచ్చారు. మనం చేసిన పనిని ఎవరైనా.. నలుగురిలో ప్రశంసిస్తే ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మరి, స్టార్‌ హీరో ప్రభాస్‌ పొగిడితే ఎలా ఉంటుంది..? మరోవైపు, టీజర్‌ చూడడం పూర్తయిన వెంటనే ‘ప్రశాంత్‌.. ఇప్పుడే దీన్ని విడుదల చేయండి’ అంటూ పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ సతీమణి అన్నారు. సెట్స్‌లో ఉన్న ఇతరులూ నన్ను అభినందించారు. అప్పుడు నేను పొందిన అనుభూతిని బాలీవుడ్‌లో ఎప్పుడూ పొందలేదు’’ అని తెలిపారు.

నెట్‌ఫ్లిక్స్‌ ట్రెండింగ్‌లో ‘సలార్‌’.. ఏయే స్థానాల్లో ఉందంటే..?

టీజర్‌లో ‘సింపుల్‌ ఇంగ్లిష్‌..’ అంటూ టీనూ చెప్పిన డైలాగ్‌ సినిమాపై అంచనాలు పెంచిన సంగతి తెలిసిందే. ప్రభాస్‌, పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ‘సలార్‌’ గతేడాది క్రిస్మస్‌ కానుకగా విడుదలై బాక్సాఫీస్‌ వద్ద మంచి వసూళ్లు రాబట్టింది. ఖాన్సార్‌ అనే కల్పిత సామ్రాజ్యం నేపథ్యంలో ప్రశాంత్‌ నీల్‌ (Prashanth Neel) తెరకెక్కించిన ఈ సినిమాలో శ్రుతి హాసన్‌, జగపతిబాబు, శ్రియా రెడ్డి, బాబీ సింహా కీలక పాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇటీవల ఓటీటీ ‘నెట్‌ఫ్లిక్స్‌’లో (salaar on netflix) స్ట్రీమింగ్‌కు అందుబాటులోకి వచ్చిన ఈ సినిమా ట్రెండింగ్‌లో నిలిచింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని