Scam 2003: అందుకే ‘స్కామ్‌ 2003’ రెండు భాగాలు చేయాల్సి వచ్చింది!

Scam 2003: ‘స్కామ్‌ 2003’ వెబ్‌సిరీస్‌ను రెండు భాగాలుగా విడుదల చేయటంపై నిర్మాత హన్సల్‌మెహతా స్పందించారు.

Published : 02 Sep 2023 20:08 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: గగన్‌ దేవ్‌ రియార్‌ (Gagan Dev Riar) కీలక పాత్రలో రూపొందిన వెబ్‌సిరీస్‌ ‘స్కామ్‌ 2003’ (Scam 2003). హన్సల్‌ మెహతా (Hansal Mehta) నిర్మించిన ఈ సిరీస్‌కు తుషార్‌ హీరానందాని దర్శకత్వం వహించారు. తాజాగా సోనీలివ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ మొదలైన ఈ సిరీస్‌ మంచి టాక్‌ తెచ్చుకుంది. నటీనటులు, ‘స్కామ్‌ 2003’ని తెరకెక్కించిన విధానానికి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. అయితే, పూర్తి సిరీస్‌ను విడుదల చేయకుండా, కేవలం ఐదు ఎపిసోడ్స్‌ మాత్రమే స్ట్రీమింగ్‌కు తీసుకురావడంపై  మాత్రం వీక్షకులు పెదవి విరుస్తున్నారు. దీనిపై హన్సల్‌ మెహతా స్పందించారు.

‘‘అది ఆలోచించి తీసుకున్న నిర్ణయమే. ఎందుకంటే ఫలనా రోజున సిరీస్‌ స్ట్రీమింగ్‌కు తీసుకొస్తామని ముందే ప్రకటించాం. ఇందులో భాగంగానే మొదట ఐదు ఎపిసోడ్స్‌పై పనిచేశాం. పీరియాడిక్‌ కథను చెప్పే సమయంలో చాలా అంశాలను పరిగణనలోకి తీసుకోవాలి, వీఎఫ్‌ఎక్స్‌, సౌండ్‌ ఇలా ప్రతిదీ కీలక పాత్ర పోషిస్తుంది. పూర్తి సిరీస్‌ను తీసుకురావాలంటే ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుంది. అందుకే రెండు భాగాలుగా విడుదల చేయాలని అనుకున్నాం. అంతేకానీ, వీక్షకుల్లో ఆసక్తిని పెంచి, దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకోవాలనుకోలేదు. మిగిలిన ఐదు ఎపిసోడ్స్‌కు సంబంధించిన పనులు వేగంగా జరుగుతున్నాయి.’’

వేల కోట్ల కుంభకోణంపై వెబ్‌సిరీస్‌.. ‘స్కామ్‌ 2003’ ఎలా ఉందంటే?

‘‘స్కామ్‌ 1992’, ‘స్కామ్‌ 2003’ ఇలా ఏదైనా నటీనటుల ఎంపిక నిజాయతీతో జరిగింది. స్టార్‌లను ఎంపిక చేశామా? సాధారణ నటులను తీసుకున్నామా? అన్నది ఇక్కడ సమస్య కాదు. కథకు, అందులోని పాత్రలకు సరిపోయే నటీనటులను తీసుకున్నామా? లేదా? అన్నదే అసలు విషయం. ‘సంచిరియా’ అప్పుడే గగన్‌ను నేను చూశాను. అయితే, పెద్దగా పరిచయం లేదు. తొలుత ‘స్కామ్‌ 1992’ అనుకున్నప్పుడు సీతారామ్‌ పాత్రకు గగన్‌ను ఎంపిక చేశాం. అయితే, చివరి నిమిషంలో ఆ పాత్రను జెమిని చేయాల్సి వచ్చింది. ఆ సమయంలో గగన్‌కు వేరే కమిట్‌మెంట్స్‌ ఉండటంతో కుదరలేదు. అయితే, ‘స్కామ్‌ 2003’ స్క్రిప్ట్‌ అనుకున్నప్పుడు తెల్గీ పాత్రకు నా మదిలో గగన్‌ ఉన్నాడు. తొలిసారి ఆడిషన్‌లో మేము అనుకున్న స్థాయిలో గగన్‌ చేయలేదు. మరొకసారి ఆడిషన్‌ చేసి, ఫైనల్‌ చేశాం. మా అంచనాలు నిజమయ్యాయి’’ అని హన్సల్‌మెహతా చెప్పుకొచ్చారు.

అబ్దుల్‌ కరీం తెల్గీ స్టాంపు పేపర్ల కుంభకోణం 2003లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఒక సామాన్య నిరుపేదగా జీవితం మొదలు పెట్టిన తెల్గీ ఏకంగా రూ.33వేల కోట్ల కుంభకోణం ఎలా చేశారన్న కథతోనే ఇప్పుడు ‘స్కామ్‌ 2003’ తెరకెక్కింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని