Scam 2003 Review: వేల కోట్ల కుంభకోణంపై వెబ్‌సిరీస్‌.. ‘స్కామ్‌ 2003’ ఎలా ఉందంటే?

2003లో జరిగిన స్టాంప్‌ పేపర్ల కుంభకోణం ఇతివృత్తంగా తెరకెక్కిన వెబ్‌సిరీస్‌ ‘స్కామ్‌ 2003’ ఓటీటీ ‘సోనీలివ్‌’లో విడుదలైంది. ఎలా ఉందంటే?

Published : 01 Sep 2023 17:04 IST

వెబ్‌సిరీస్‌: స్కామ్‌ 2003: ది తెల్గీ స్టోరీ; తారాగణం: గగన్‌ దేవ్‌ రియార్‌, సనా అమిన్‌ షేక్‌, ముకేశ్‌ తివారీ, భరత్‌ జాదవ్‌ తదితరులు; నిర్మాత: హన్సల్‌ మెహతా; దర్శకత్వం: తుషార్‌ హీరానందని; ఓటీటీ ప్లాట్‌ఫామ్‌: సోనీలివ్‌ (1-09-2023).

2003లో సంచలనం సృష్టించిన స్టాంప్‌ పేపర్‌ కుంభకోణం ఆధారంగా దర్శకుడు తుషార్‌ హీరానందని (Tushar Hiranandani) తెరకెక్కించిన వెబ్‌సిరీస్‌ ‘స్కామ్‌ 2003: ది తెల్గీ స్టోరీ’ (Scam 2003). 2003లో స్టాంప్‌ పేపర్‌ మోసానికి పాల్పడ్డ అబ్దుల్ కరీం తెల్గీ (Abdul Karim Telgi) జీవితం ఆధారంగా చేసుకుని రూపొందించిన ఈ సిరీస్‌ ఓటీటీ (ott) ‘సోనీలివ్‌’ (Sony Liv)లో శుక్రవారం విడుదలైంది. హిట్‌ సిరీస్‌ ‘స్కామ్‌ 1992’ని తెరకెక్కించిన హన్సల్‌ మెహతా (Hansal Mehta) నిర్మిస్తున్నారని తెలిసిన క్షణం నుంచే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. మరి, ‘స్కామ్‌ 2003’ ఆడియన్స్‌ అంచనాలు అందుకోగలిగిందా, లేదా? అంటే రివ్యూ చదివేయండి (Scam 2003 Review)..

కథేంటంటే: కర్ణాటకలోని ఖానాపూర్‌కు చెందిన అబ్దుల్‌ కరీం తెల్గీ (గగన్‌ దేవ్‌ రియార్‌) డిగ్రీ పట్టాదారుడు. ఎంత ప్రయత్నించినా ఏ ఉద్యోగం దొరకదు. ఏ దారీ లేక చివరకు రైళ్లలో పండ్లు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తుంటాడు. అందరితో కలివిడిగా మాట్లాడుతూ వ్యాపారం చేసే ఇతడి తీరు ట్రైన్‌లో ప్రయాణించే షౌకత్‌ ఖాన్‌కు బాగా నచ్చుతుంది. దాంతో, ముంబయి వస్తే ఏదైనా ఉద్యోగం ఇప్పిస్తామని తెల్గీకి మాటిస్తాడు. తన మధ్య తరగతి కుటుంబ సమస్యలు తొలగాలంటే ముంబయి వెళ్లాల్సిందేనని తెల్గీ ఫిక్స్‌ అవుతాడు. అలా ఖానాపూర్‌ నుంచి చిరిగిన బట్టలు, మాసిన సంచి పట్టుకుని ముంబయి బయలుదేరిన అతడు వేల కోట్ల కుంభకోణాన్ని ఎలా చేశాడు? ఆ క్రమంలో ఆయనకు సహకరించింది ఎవరు? అసలు తెల్గీ స్టాంప్‌ పేపర్లపైనే మొగ్గు చూపడానికి కారణమేంటి? తదితర ప్రశ్నలకు సమాధానం తెరపై చూసి తెలుసుకుంటేనే బాగుంటుంది (Scam 2003 Review).

ఎలా ఉందంటే: జీవితగాథలు/ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ప్రాజెక్టులపై ప్రేక్షకుల్లో ఎప్పుడూ ఆసక్తి ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని తెరకెక్కించిందే ఈ ‘స్కామ్‌ 2003’. వాస్తవ ఘటనల గురించి తెరపై అర్థవంతంగా వివరించాలంటే దర్శకుడికి కత్తిమీద సామే. ఈ ప్రయత్నంలో తుషార్‌కు మంచి మార్కులే పడ్డాయి. తెల్గీకి నార్కో అనాలసిస్‌ టెస్ట్‌ చేసి, నిజాలు రాబట్టే సన్నివేశంతో ప్రారంభమవుతుందీ సిరీస్‌. ‘వ్యాపారానికి వెన్నెముక రాజకీయ నాయకులు’ అని హాస్పిటల్‌ బెడ్‌పై తెల్గీ చెప్పే మాట ఈ కథలో పొలిటిషన్ల పాత్ర ఉంటుందని ప్రేక్షకుడికి చెప్పకనే చెబుతుంది. తెల్గీ ఆస్పత్రి పాలవ్వడానికి కారణమేంటన్న ఉత్సుకతని అలానే ఉంచి.. 1982లోకి ప్రేక్షకులను తీసుకెళ్లారు దర్శకుడు. తెల్గీ కుటుంబ నేపథ్యాన్ని పరిచయం చేసి, ఏమాత్రం ఆలస్యం చేయకుండా తెల్గీ క్యారెక్టర్‌ ఎలాంటిదో చెప్పేశారు . ‘నేను డబ్బు సంపాదించను. సృష్టిస్తా’ అనే ఆలోచన ఉన్న తెల్గీ దాని కోసం ఎంత రిస్క్‌ చేశాడనేది ప్రధానాంశం (Scam 2003 Review)గా చూపించారు. 5 ఎపిసోడ్లను సుమారు 50 నిమిషాల నిడివితో రూపొందించడంతో అక్కడక్కడా సాగదీత తప్పలేదు.

గల్ఫ్‌ దేశాల్లో ఎక్కువగా డబ్బు సంపాదించి తెల్గీ ఇండియాకు తిరిగొచ్చే సన్నివేశంతో కథ మలుపు తిరుగుతుంది. అక్కడి నుంచి మరింత వేగంగా సాగుతుంది. స్టాంప్‌ పేపర్ల మోసానికి పాల్పడాలని నిర్ణయించుకుని, నాసిక్‌లోని కర్మాగారంలో ప్రింట్‌ అయిన స్టాంప్‌ పేపర్లు దేశవ్యాప్తంగా ఎక్కడి నుంచి ఎక్కడకు ఎలా ట్రాన్స్‌పోర్ట్‌ అవుతాయో తెల్గీ వివరించే క్రమంలో వచ్చే విజువల్స్‌ వావ్‌ అనిపిస్తాయి. ఈ ఎలివేషన్లకు నేపథ్య సంగీతం తోడై మరోస్థాయికి తీసుకెళ్లింది. బిజినెస్‌ పార్ట్‌నర్‌తో కలిసి తెల్గీ తన ప్లాన్‌ను మొదలుపెట్టడం, చిన్న మొత్తం నుంచి పెద్ద మొత్తంలో మోసానికి పాల్పడడం, అందుకు రాజకీయ నాయకులు, ప్రభుత్వ అధికారులు సహకరించడం.. ఇలా ఆయా సీక్వెన్స్‌ చూడడానికి బాగున్నా ఎక్కడో లాజిక్‌ మిస్‌ అవుతుందనే సందేహం కలుగుతుంది. నేరారోపణలు ఎదుర్కొని అరెస్టు అయిన తెల్గీ ఎలా బయటకు వచ్చాడు? తదితర ప్రశ్నలకు సమాధానం ఉండదు. భారత్‌ 1992లో ఎదుర్కొన్న ఆర్థిక సవాళ్ల ప్రస్తావనను తీసుకొచ్చారు గానీ దాన్ని మరింత క్లుప్తంగా చూపించి, ఆ సమయంలో తెల్గీ ఎలా వ్యవహరించాడో చూపించి ఉంటే బాగుండేది. అయితే, ప్రస్తుతానికి.. 2000 వరకు జరిగిన పరిణామాలను మాత్రమే తెరపైకి తీసుకొచ్చారు. ఆ తర్వాత జరిగిన స్కామ్‌ని సీజన్‌ 2గా తీసుకురానున్నారు. 2000 తర్వాత తెల్గీ జీవితంలో చోటు చేసుకున్న సంఘటనలేంటి? 2003లో స్కామ్‌ ఎలా బయటపడింది? కుంభకోణంతో ఎవరెవరికి సంబంధం ఉంది? తెలియాలంటే సీజన్‌ 2 చూడాల్సిందే (Scam 2003 Review). 

ఎవరెలా చేశారంటే: గగన్‌ దేవ్‌ రియార్‌ వన్‌మ్యాన్‌ షో ఇది. ‘ఈయనే తెల్గీనా’ అని అనిపించేలా పాత్రలో జీవించారు. సందర్భానుసారం తెరపైకి వచ్చే ప్రతి పాత్రధారి తమ నటనతో ఆకట్టుకుంటారు. సాంకేతిక బృందం పనితీరు చక్కగా ఉంది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. బయోగ్రాఫికల్‌ చిత్రాలను బాగా తెరకెక్కింగలరని ‘సాండ్‌ కీ ఆంఖ్‌’తో నిరూపించిన తుషార్‌ ఈ సిరీస్‌ విషయంలోనూ సత్తా చాటారు (Scam 2003 Review).

  • బ‌లాలు
  • + కథ 
  • + గగన్‌ దేవ్‌ రియార్‌ నటన
  • + ఎలివేషన్‌ సీన్స్‌
  • బ‌ల‌హీన‌త‌లు
  • - లాజిక్‌ లేని కొన్ని సన్నివేశాలు
  • - అక్కడక్కడా సాగదీత
  • చివ‌రిగా: స్కామ్‌ కొంతే చూపించారు.. అసలు కథ ముందుంది (Scam 2003 Review)
  • గమనిక: ఈ సమీక్ష సమీక్షకుడి దృష్టి కోణానికి సంబంధించింది. ఇది సమీక్షకుడి వ్యక్తిగత అభిప్రాయం మాత్రమే!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని