Hema: సినీ నటి హేమ అరెస్టు.. జూన్‌ 14వరకు జ్యుడీషియల్‌ కస్టడీ!

రేవ్‌పార్టీ కేసులో నటి హేమ అరెస్టయింది. గత నెలలో బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో పార్టీ నేపథ్యంలో నమోదైన కేసులో ఆమెను కోర్టులో హాజరుపరిచారు. 

Updated : 03 Jun 2024 22:03 IST

బెంగళూరు: రేవ్‌పార్టీ కేసులో సినీ నటి హేమ (Hema) అరెస్టయింది. గత నెలలో బెంగళూరులోని ఓ ఫామ్‌హౌస్‌లో పార్టీ జరిగిన నేపథ్యంలో పోలీసులు విచారణ చేపట్టారు. రెండు సార్లు నోటీసులు ఇవ్వగా.. విచారణకు హేమ హాజరుకాలేదు. తాజాగా మరోసారి నోటీసులు ఇచ్చి.. విచారణ అనంతరం ఆమెను అరెస్టు చేశారు. అనంతరం ఆమెను అనేకల్‌లోని నాలుగో అదనపు సివిల్‌, జేఎంఎఫ్‌సీ కోర్టు జడ్జి ముందు పరిచగా.. జూన్‌ 14వరకు ఆమెకు జ్యుడీషియల్‌ కస్టడీ విధిస్తూ ఆదేశాలు జారీచేశారు. 

బెంగళూరు శివారులో నిర్వహించిన రేవ్‌ పార్టీలో పలువురు తెలుగు టీవీ నటీనటులు, మోడళ్లు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇదే పార్టీకి వచ్చిన ఓ కారులో ఏపీ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి సంబంధించిన స్టిక్కర్‌ కూడా దొరికింది. పార్టీలో పలు రకాల డ్రగ్స్‌ వాడినట్లు పోలీసులు గుర్తించారు. 86 మంది మాదక ద్రవ్యాలు తీసుకున్నట్లు వైద్య పరీక్షల్లో తేలిందని నగర నేర నియంత్రణ దళం (సీసీబీ) అధికారులు వెల్లడించారు. 73 మంది పురుషుల్లో 59 మందికి, 30 మంది మహిళల్లో 27 మందికి వైద్య పరీక్షలో డ్రగ్‌ పాజిటివ్‌ వచ్చిందని పేర్కొన్నారు. 

రేవ్‌ పార్టీ కేసులో అరెస్టయిన ఆరుగురు నిందితులతో పాటు సినీ నటి హేమ కూడా విచారణకు హాజరుకావాలని సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే, తనకు వైరల్‌ ఫీవర్‌ వచ్చిందని, విచారణకు హాజరుకాలేనని హేమ (Hema) బెంగళూరు పోలీసులకు లేఖ రాశారు. విచారణకు హాజరుకావడానికి ఇంకాస్త సమయం కావాలని కోరారు. అయితే, హేమ అభ్యర్థనను సీసీబీ పోలీసులు పరిగణనలోకి తీసుకోలేదు. విచారణకు గైర్హాజరైన హేమకు కొత్తగా నోటీసులు పంపారు. తాజాగా ఆమెను అరెస్ట్‌ చేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని