Nani: అందుకే వైజాగ్‌ నాకు ప్రత్యేకం: ‘హాయ్‌ నాన్న’ ఈవెంట్‌లో నాని

సినిమాల విషయంలో తనకు విశాఖపట్నం ప్రత్యేకమని హీరో నాని అన్నారు. తన కొత్త సినిమా ‘హాయ్‌ నాన్న’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఆయన మాట్లాడారు.

Published : 30 Nov 2023 02:05 IST

విశాఖపట్నం: నాని (Nani) హీరోగా నూతన దర్శకుడు శౌర్యువ్‌ తెరకెక్కించిన చిత్రం ‘హాయ్‌ నాన్న’ (Hi Nanna). మృణాల్‌ ఠాకూర్‌ (Mrunal Thakur) కథానాయిక. బేబీ కియారా, శ్రుతిహాసన్‌, ప్రియదర్శి తదితరులు కీలక పాత్రలు పోషించారు. డిసెంబరు 7న సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిత్ర బృందం విశాఖపట్నంలో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ (Hi Nanna Pre Release Event) నిర్వహించింది.

‘స్పిరిట్‌’.. ‘యానిమల్‌’లా కాదు.. మహేశ్‌తో సినిమా ఉంటుంది: సందీప్‌

వేడుకనుద్దేశించి నాని మాట్లాడుతూ.. ‘‘నేను ఇక్కడి అమ్మాయిని పెళ్లి చేసుకున్నానని కాదుగానీ మీకు (విశాఖపట్నం వాసులు), నాకు  మధ్య ప్రత్యేక బంధం ఉంది. నా యాక్షన్‌ చిత్రాలు మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే సీడెడ్‌లో పెద్ద హిట్‌ అయ్యాయి. ఎంటర్‌టైనింగ్‌ సినిమాలు యూఎస్‌, హైదరాబాద్‌లాంటి యారియాల్లో ఎక్కువ విజయాన్ని పొందాయి. నేపథ్యం ఏదైనా అన్ని సినిమాలు బ్రహ్మాండంగా ఆడిన ప్రాంతం వైజాగ్‌. ప్రతి ఒక్కరికీ కృతజ్ఞుడిని. జనవరిలానే డిసెంబరు కూడా సినిమాల పండగ నెలగా మారింది. మన తెలుగు దర్శకుడు.. బాలీవుడ్‌ హీరో (రణ్‌బీర్‌ కపూర్‌)తో తీసిన ‘యానిమల్‌’ డిసెంబరు 1న, నా స్నేహితుడు నితిన్‌ నటించిన ‘ఎక్స్‌ట్రా: ఆర్డినరీ మ్యాన్‌’ డిసెంబరు 8న, నాకు బాగా ఇష్టమైన దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ తెరకెక్కించిన ‘డంకీ’ (షారుక్‌ ఖాన్‌ హీరో) డిసెంబరు 21న, ప్రభాస్‌ అన్న నటించిన ‘సలార్‌’ డిసెంబరు 22న, యాంకర్‌ సుమ తనయుడు నటించిన ‘బబుల్‌గమ్‌’ డిసెంబరు 29న విడుదలకానున్నాయి. ఈ చిత్రాలన్నీ బ్లాక్‌బస్టర్‌ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా’’

‘‘ఇన్ని సినిమాల మధ్యలో వస్తున్నా.. ‘హాయ్‌ నాన్న’ మీ అందరి మనసులో నిలిచిపోయేలా ఉంటుంది. ఇది మీరు అనుకున్నట్లు ఎమోషనల్‌ ఫిల్మ్‌ కాదు. శౌర్యువ్‌లాంటి కొత్త దర్శకులతో పనిచేయడం గర్వంగా అనిపిస్తుంది. అతడు భవిష్యత్తులో మరింత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నా. హేషబ్‌ అద్భుతమైన సంగీతం అందించాడు. జాన్‌ వర్గీస్‌ సినిమాటోగ్రఫీ కట్టిపడేస్తుంది. సినిమాలో ఇంకా ఎన్నో సర్‌ప్రైజ్‌లున్నాయి’’ అంటూ అభిమానుల్లో జోష్‌ నింపారు. ‘‘గతంలో ‘సీతారామం’ సినిమా ప్రచారంలో భాగంగా ఇక్కడికి వచ్చా. ఇప్పుడు ‘హాయ్‌ నాన్న’తో మరోసారి మీ అందరి ముందుకొచ్చా. తెలుగు అమ్మాయిలా నన్ను స్వీకరించినందుకు మీకు ఎప్పటికీ రుణపడి ఉంటా. నాని బెస్ట్‌ కో- యాక్టర్‌. బేబీ కియారా పెర్ఫామెన్స్‌ మీ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ తండ్రీ కూతుళ్ల కథతో మీరు ప్రేమలోపడతారు. అలా జరగకపోతే నా పేరు మార్చుకుంటా’’ అంటూ సినిమాపై మృణాల్‌ ఠాకూర్‌ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నటులు ప్రియదర్శి, విరాజ్‌ అశ్విన్‌, బేబీ కియారా తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని