Kiara Advani: నేనేంటో నిరూపించుకోవడమే ముఖ్యం

‘‘కేన్స్‌ చిత్రోత్సవాల్లో పాల్గొనడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాన’’ని అంటోంది బాలీవుడ్‌ నాయిక కియారా అడ్వాణీ. తనదైన నటనతో  మెప్పించే ఈ భామ.. ఇటీవలే కేన్స్‌ చిత్రోత్సవాల్లో మెరిసి సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది. 

Updated : 21 May 2024 01:18 IST

‘‘కేన్స్‌ చిత్రోత్సవాల్లో పాల్గొనడం నాకు దక్కిన గౌరవంగా భావిస్తాన’’ని అంటోంది బాలీవుడ్‌ నాయిక కియారా అడ్వాణీ. తనదైన నటనతో  మెప్పించే ఈ భామ.. ఇటీవలే కేన్స్‌ చిత్రోత్సవాల్లో మెరిసి సినీప్రియుల దృష్టిని ఆకర్షించింది.  ఇందులో భాగంగా ఏర్పాటు చేసిన ‘ఉమెన్‌ ఇన్‌ సినిమా’ అంశంపై జరిగిన చర్చా వేదికలో పాల్గొంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఈ వేడుకలోని తన అనుభవాలు, రాబోయే ప్రాజెక్టుల గురించి కొన్ని ఆసక్తిర విషయాలను పంచుకుంది కియార.

‘నేను ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను. కేన్స్‌ చిత్రోత్సవాలకు హాజరవ్వడం సంతోషంగా ఉంది. నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఇది నా కెరీర్‌లోనే ఎంతో మధురమైన జ్ఞాపకంగా ఉండిపోతుంది. దాదాపు 20ఏళ్ల క్రితం నా కుటుంబ సభ్యులతో కలిసి ఈ వేడుకకు హాజరయ్యాను. చిన్నప్పుడు దీని గురించి ఇంటర్నెట్‌ ద్వారా తెలుసుకునేదాన్ని. కానీ.. నేను  ఒక సెలబ్రెటీగా ఇలాంటి ప్రతిష్ఠాత్మక వేడుకలో పాల్గొంటానని ఆ సమయంలో నాకు తెలీదు. కేన్స్‌ చిత్రోత్సవం నాకు ఎప్పటికీ మర్చిపోలేని ఒక అనుభవం’.

యాక్షన్‌ చిత్రాల్లో నటించడానికి చాలా రోజుల నుంచి ఎదురుచూస్తున్నాను. ‘వార్‌ 2’, ‘డాన్‌ 3’లతో ఆ కోరిక నెరవేరబోతుంది. ఇవి నా కెరీర్‌లోనే పెద్ద ప్రాజెక్టులు. ప్రేమకథలు, కామెడీ..ఇలా అన్ని జానర్లలో పనిచేశాను. కానీ చాలా కాలంగా పూర్తిగా యాక్షన్‌ నేపథ్యంలో సాగే చిత్రాల్లో నటించడం కోసం వేచి చూస్తున్నాను. ఆ అవకాశం ఇప్పుడు వచ్చింది. ఒకానొక సమయంలో ‘షేర్షా’ సినిమాలో నేను భాగమైనప్పుడు.. ‘ఓ మై గాడ్‌ ఇదొక యుద్ధానికి సంబంధించిన యాక్షన్‌ చిత్రం. ఇలాంటి ప్రాజెక్టులో ఈమె నటిస్తుందా..?’ అని కొంతమంది నా మీద విమర్శలు చేశారు. కానీ.. ప్రస్తుతం భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న రెండు పెద్ద ప్రాజెక్టులు నా చేతుల్లో ఉన్నాయి. ఈ సినిమాల్లో నన్ను నేను నిరూపించుకోవడమే ముఖ్యం’. 

  • ‘మరికొద్ది రోజుల్లో ‘గేమ్‌ఛేంజర్‌’తో మీ ముందుకు రాబోతున్నాను. ఇందులో ‘జరగండి జరగండి’ పాటకు నాకు మంచి ప్రశంసలు వచ్చాయి. ఇప్పటి వరకు నేను చేసిన వాటిల్లో ఇదే కష్టమైనది. దాదాపు 10రోజుల పాటు ఈ పాట చిత్రీకరణ జరిగింది. ఒక పాటకు ఇన్ని రోజుల షూటింగ్‌ ఇంతకు ముందెప్పుడు చేయలేదు. దీని కోసం షూటింగ్‌ తర్వాత కూడా 3నుంచి 4గంటల పాటు రిహార్సల్స్‌ చేశాను. రామ్‌చరణ్‌ స్టెప్పులను మ్యాచ్‌ చేసేందుకు ఇంకాస్త ఎక్కువ శ్రమించాల్సి వచ్చింది. ఇందులో చాలా కష్టమైన స్టెప్స్‌ ఉన్నా.. ఇది నాకొక మంచి అనుభవం. శంకర్‌ సర్‌తో పని చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నా. సినిమాల పట్ల అంకితభావం ఉన్న వ్యక్తి ఆయన. ముందటి సినిమా కంటే రాబోయే చిత్రం అత్యుత్తమంగా ఉండాలని కష్టపడతారు. ఆయనలో ఇదే నాకు ఎక్కువగా నచ్చుతుంది’.
  • ‘‘షేర్షా’ సినిమాతో సిద్ధార్థ్‌కి, నాకు మంచి ప్రశంసలు వచ్చాయి. ప్రేక్షకులు మళ్లీ మమ్మల్ని జోడీగా తెరపై చూడడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు. మేమిద్దరం కలిసి నటిస్తే అది వర్కౌవుట్‌ అవుతుందా..? లేదా అనేది ఎప్పుడు ఆలోచించను. మా ఇద్దరికీ కూడా కలిసి పనిచేయడం చాలా ఇష్టం. మంచి స్క్రిప్ట్‌ దొరికితే కచ్చితంగా కలిసి నటిస్తాము. కానీ.. కథ మమ్మల్ని ఉత్తేజపరిచేలా.. కొత్తదనంతో నిండి ఉండాలి. అలాంటి ప్రాజెక్టు కోసమే ఎదురుచూస్తున్నాము’.
  • ‘ఎన్నో భిన్నమైన కథలు, పాత్రలను ఎంచుకుంటూ చిత్రపరిశ్రమలో విజయవంతంగా 10ఏళ్లు పూర్తి చేసుకున్నానని చెప్పుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది. ఈ పదేళ్ల ప్రయాణంలో ఎన్నో సవాళ్లను అధిగమించి ఈరోజు ఈస్థాయిలో ఉన్నాను. ఇప్పుడిప్పుడే భిన్నమైన పాత్రలను ఎంచుకుంటూ ప్రేక్షకులకు దగ్గరవుతున్నాను. కానీ.. నా పాత్రకు ప్రాధాన్యత లేని ప్రాజెక్టుల్లో భాగం కావాలని నేను ఎప్పుడూ కోరుకోను. కథలో కంటెంట్‌ ఉండాలి.. నేను పోషించే పాత్ర సినిమాకి ముఖ్యమైనదై ఉంటేనే అందులో నటించడానికి ఆసక్తి చూపిస్తుంటాను’.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని