Getup Srinu: ఇదొక పాత్రే తప్ప... హీరో అనుకోలేదు!

‘‘టెలివిజన్‌ నాకు పేరు తీసుకొచ్చింది. ఆర్థికంగా స్థిరత్వాన్ని ఇచ్చింది. అయితే  టెలివిజన్‌కే ఎక్కువ సమయం కేటాయిచండంతో సినిమాలతో వస్తున్న మంచి పాత్రల్ని దూరం చేసుకుంటున్న అభిప్రాయం కలిగింది.

Published : 24 May 2024 01:27 IST

‘‘టెలివిజన్‌ నాకు పేరు తీసుకొచ్చింది. ఆర్థికంగా స్థిరత్వాన్ని ఇచ్చింది. అయితే  టెలివిజన్‌కే ఎక్కువ సమయం కేటాయిచండంతో సినిమాలతో వస్తున్న మంచి పాత్రల్ని దూరం చేసుకుంటున్న అభిప్రాయం కలిగింది. అందుకే ఇప్పుడు సినిమాల్లో.. మంచి పాత్రలు చేయడంపైనే దృష్టి పెట్టా’’ అన్నారు గెటప్‌ శ్రీను. జబర్దస్త్‌ షోతో బుల్లితెర కమల్‌హాసన్‌గా పేరు తెచ్చుకున్న ఈయన... ‘రాజు యాదవ్‌’ సినిమాతో కథానాయకుడిగా పరిచయం అవుతున్నారు. కృష్ణమాచారి దర్శకుడు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తున్న సందర్భంగా గురువారం హైదరాబాద్‌లో విలేకర్లతో ముచ్చటించారు గెటప్‌ శ్రీను. ‘‘నేను హీరో కావాలని ఎప్పుడూ ప్రణాళికలు రచించుకోలేదు. నటనకి ప్రాధాన్యమున్న పాత్రల్ని చేస్తూ ప్రయాణం చేశా. ఓ క్యారెక్టర్‌ నటుడిగా, హాస్య నటుడిగానే కొనసాగాలనుకున్నా. ‘రాజు యాదవ్‌’ కథ విన్నాక కూడా నటనకి ప్రాధాన్యమున్న ఓ పూర్తిస్థాయి పాత్ర చేసే అవకాశం కలుగుతుందనే ఈ సినిమా చేశా. నా వరకూ ఇదొక పూర్తిస్థాయి పాత్రే తప్ప, హీరోగా చేస్తున్న సినిమా అనుకోలేదు. ఇందులో నవ్వుతో కనిపించే పాత్రని చేశా. చాలా కష్టంతో కూడుకున్న పాత్ర ఇది. ఒకానొక దశలో ఆర్టిస్ట్‌గా ఫెయిల్‌ అయిపోయానేమో అనిపించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ దర్శకుడు ఎంతో స్ఫూర్తిని పంచుతూ ఈ పాత్రని నాతో చేయించారు. సహజత్వంతో కూడుకున్న కథ, పాత్రలున్న సినిమా ఇది. ప్రేక్షకులు ఇలాంటి సినిమాల్నే ఆదరిస్తున్నారు. తప్పకుండా వినోదం పంచుతుంది. తల్లిదండ్రుల కలల్ని సాకారం చేసే క్రమంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వెనకడుగు వేయకూడదనే అంశం ఈ కథకు మూలం. దర్శకుడు కృష్ణమాచారి ఓ నిజ జీవిత కథకి, కల్పిత పాత్రని జోడించి ఈ చిత్రాన్ని తీర్చిదిద్దారు. కథానాయకులు చిరంజీవి సర్‌కి షో రీల్‌ చూపించా. చాలా మంచి ప్రయత్నం అని అభినందించారు. బ్రహ్మానందం సర్‌ చూసి ‘నటుడిగా ఎదగాలనుకునేవారు ఇలాంటి ప్రయత్నాలు చేయాల’ని భుజం తట్టారు. కుటుంబం మొత్తానికీ కనెక్ట్‌ అయ్యే కథ ఇది. నిర్మాత బన్నీ వాస్‌ ట్రైలర్‌ చూసి నా ఆధ్వర్యంలో విడుదల చేస్తానని చెప్పడం ఎంతో సంతోషాన్నిచ్చింది’’ అన్నారు. సుధీర్, రామ్‌ప్రసాద్‌లతో కలిసి ఓ సినిమా చేసే ఆలోచన ఉందని, అందుకోసం రామ్‌ప్రసాద్‌ కథని సిద్ధం చేస్తున్నాడని చెప్పారు గెటప్‌ శ్రీను.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని