Sivakarthikeyan: అలాంటి చిత్రాల్లో నేను ఎప్పటికీ నటించను: శివ కార్తికేయన్‌

‘అయలాన్‌’ (Ayalaan) సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటుడు శివ కార్తికేయన్‌ (SivaKarthikeyan). తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన సినీ కెరీర్‌ గురించి ఆయన మాట్లాడారు.

Published : 28 Dec 2023 17:46 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: శివ కార్తికేయన్‌ (Siva karthikeyan) హీరోగా నటించిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ ‘అయలాన్‌’ (Ayalaan). ఏలియన్స్‌ నేపథ్యంలో సాగే విభిన్నమైన కథాంశంతో ఈ సినిమా సిద్ధమైంది. ఆర్‌.రవికుమార్‌ దర్శకుడు. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ కథానాయిక. జనవరి 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో భాగంగా శివ కార్తికేయన్‌ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. తన సినీ కెరీర్‌ పట్ల ఆనందం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించే చిత్రాల్లో నటించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.

‘‘సినిమా ఫలితంతో సంబంధం లేకుండా.. ఇప్పటివరకూ నేను నటించిన అన్ని చిత్రాల విషయంలో సంతోషంగా ఉన్నా. చిన్నాపెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ చూసే కథలను మాత్రమే ఎంచుకుంటున్నా. ‘ఏ’ సర్టిఫికేట్‌ చిత్రాల్లో నటించాలనుకోవడం లేదు. ఎందుకంటే, అందరికీ వినోదాన్ని అందించే చిత్రాల్లో నటించడమే నాకు ఇష్టం. ఇటీవల నేను నటించిన ‘ప్రిన్స్‌’ బాక్సాఫీస్‌ వద్ద పరాజయాన్ని అందుకుంది. నా వరకూ ఆ చిత్రానికి మైనస్‌ నేనే. అదే కథను నూతన హీరోతో తెరకెక్కించి ఉంటే తప్పకుండా విజయం అందుకునేది’’ అని ఆయన తెలిపారు.

Vijayakanth: డిస్ట్రిబ్యూటర్‌గా మొదలై.. పారితోషికం తీసుకోకుండా నటించి..!

అనంతరం తన కుటుంబం గురించి మాట్లాడుతూ.. ‘‘కెరీర్‌ పరంగా ఏమీ లేనప్పుడు నా భార్య ఆర్తి నాకు అండగా నిల్చుంది. ఆమె నాలో ఎంతో స్ఫూర్తి నింపింది. నా సినిమాలన్నింటినీ చూసి తన అభిప్రాయాన్ని చెబుతుంటుంది. సినిమాల్లో నేను ఎంత బిజీగా ఉన్నా.. కుటుంబానికి సంబంధించిన అన్ని విషయాలను తనే దగ్గరుండి చూసుకుంటుంది. నేను ఎప్పుడైనా డల్‌గా ఉన్నా.. మాటలతోనే తను నాలో ప్రేరణ నింపుతుంది’’ అని ఆయన చెప్పారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని