Vijayakanth: డిస్ట్రిబ్యూటర్‌గా మొదలై.. పారితోషికం తీసుకోకుండా నటించి..!

నటుడు విజయకాంత్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు..

Updated : 28 Dec 2023 16:48 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ప్రముఖ కోలీవుడ్‌ నటుడు, డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్‌ (Vijayakanth) మరణవార్తతో చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ఈ నేపథ్యంలో కోలీవుడ్‌ చిత్ర పరిశ్రమకు విజయకాంత్‌ అందించిన సేవలు.. నటుడిగా ఆయన ప్రయాణాన్ని ప్రముఖులు, సినీ ప్రియులు గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా కెప్టెన్‌ విజయకాంత్‌కు సంబంధించిన పలు ఆసక్తికర విశేషాలు.

డిస్ట్రిబ్యూటర్‌గా మొదలై..!

నటుడిగా తెరంగేట్రం చేయడానికంటే ముందు విజయకాంత్‌ డిస్ట్రిబ్యూటర్‌గా వ్యవహరించారు. తమిళంలో విడుదలైన పలు చిత్రాలను పంపిణీ చేశారు. ఆ సమయంలోనే ఆయనకు సినిమాల్లోకి అడుగుపెట్టాలనిపించింది. ఆయన నటించిన తొలి సినిమా ‘ఇనిక్కుమ్‌ ఇలమై’ (Inikkum Ilamai) (1979). ఇందులో ఆయన విలన్‌గా కనిపించారు. మూడు దశాబ్దాలకు పైగా సినీ కెరీర్‌లో దాదాపు 158 చిత్రాల్లో ఆయన నటించారు. హీరో, విలన్‌, సహాయనటుడు, అతిథి పాత్రల్లో కనిపించారు. నటుడిగా కొనసాగినంత కాలం కేవలం కోలీవుడ్‌ చిత్రాల్లోనే ఆయన నటించారు. అలా, ఆయన నటించిన పలు చిత్రాలు తెలుగు, హిందీలోకి డబ్‌ అయ్యాయి. ఆవేశపూరితమైన, పోలీస్‌ పాత్రలకు కోలీవుడ్‌లో ఆయనే కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచారు. ఆయన నటనకు ఫిదా అయిన తమిళ సినీ ప్రియులు ‘పురట్చి కలైంజ్ఞర్‌’ (విప్లవ కళాకారుడు) అని ప్రేమగా పిలిచేవారు.

గొప్ప మనసు..!

వైవిధ్యభరితమైన పాత్రలు పోషించడానికి విజయకాంత్‌ ఆసక్తి చూపించేవారు. వరుస సినిమాల్లో నటిస్తూ ఒకానొక సమయంలో కోలీవుడ్‌ అగ్ర నటులకు ఆయన గట్టి పోటీ ఇచ్చారు. సినీ పరిశ్రమ బాగుండాలంటే నిర్మాత బాగుండాలని నమ్మే మనస్తత్వం ఆయనది. అందుకు అనుగుణంగానే.. పారితోషికం విషయంలో నిర్మాతలకు అండగా నిలిచేవారు. సినిమా విడుదలై.. అది విజయం అందుకున్న తర్వాతే పారితోషికం తీసుకున్న సందర్భాలు కోకొల్లలు. ఆయన నటించిన ఏదైనా సినిమా ఫ్లాప్‌ అయితే.. నిర్మాతకు అండగా ఉండటం కోసం రెమ్యునరేషన్‌ని వదులుకునేవారు. డబ్బులు తీసుకోకుండానే పలు చిత్రాల్లో అతిథిపాత్రలూ పోషించారు. విజయ్‌ తొలి విజయం అందుకున్న ‘సెంధూర పాండి’లో విజయకాంత్‌ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రానికి ఆయన రెమ్యునరేషన్‌ తీసుకోలేదు.

వడివేలుకు కెరీర్‌ ఇచ్చి..!

చిన్న నటీనటులకు చేయూతనందించడంలో విజయకాంత్‌ ఎప్పుడూ ముందుండేవారు. హాస్యనటుడు వడివేలుకు కెరీర్‌పరంగా విజయకాంత్‌ ఎంతో సాయం చేశారు. ఆయన హీరోగా నటించిన ‘చిన్న గౌండర్‌’లో వడివేలుకు సహాయనటుడిగా పాత్ర ఇప్పించారు. చిన్న గౌండర్‌ (విజయకాంత్‌) సహాయకుడిగా వడివేలు నటనకు అంతటా గుర్తింపు లభించింది. ఈ సినిమా తర్వాత తాను హీరోగా నటించిన పలు చిత్రాల్లో వడివేలుకు కీలక పాత్రలు ఇప్పించారాయన. పలు ఇండస్ట్రీలకు చెందిన నటీనటులతో ఆయనకు మంచి స్నేహబంధం ఉంది. శరత్‌కుమార్‌, విజయ్ తండ్రి చంద్రశేఖర్‌ ఆయనకు ఆప్తమిత్రులు.

‘నడిగర్‌’ కోసం..!

సౌత్‌ ఇండియన్‌ ఆర్టిస్ట్స్‌ అసోసియేషన్‌ (నడిగర్‌ సంఘం) అభివృద్ధి కోసం విజయకాంత్‌ ఎంతో శ్రమించారు. నడిగర్‌ సంఘం అప్పులభారం ఎదుర్కొంటోన్న వేళ.. దాని అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. ఆ సంఘానికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు ఎన్నో కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. సింగపూర్‌, మలేసియా వంటి దేశాల్లో పలు సెలబ్రిటీ ఈవెంట్స్‌ నిర్వహించి నటీనటులందరినీ ఒకేతాటి మీదకు తీసుకువచ్చారు. ఈవిధంగా వచ్చిన డబ్బును నడిగర్‌ సంఘంలోని సభ్యుల సంక్షేమం కోసం ఉపయోగించారు.

పెద్దలు కుదిర్చిన వివాహం..!

విజయకాంత్‌ సతీమణి పేరు ప్రేమలత. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహం. తమ పెళ్లి గురించి గతంలో ప్రేమలత ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. ‘‘పెళ్లిళ్లు స్వర్గంలో నిర్ణయమవుతాయి’ అనడానికి మా జంటే సరైన ఉదాహరణ. వివాహం తర్వాత ఆ మాట నిజమనే భావన నాకు కలిగింది. ఎందుకంటే, వాళ్లది మధురైకు చెందిన కుటుంబం. మేము వేలూరులో ఉండేవాళ్లం. ఇరు కుటుంబాల మధ్య ఎలాంటి పరిచయం లేదు. మాది పూర్తిగా పెద్దలు కుదిర్చిన పెళ్లి. విజయకాంత్‌ సినిమాల్లో రాణిస్తోన్న రోజుల్లో ఆయనతో నా పెళ్లి జరిగింది. పెళ్లి చూపుల సమయంలో.. హీరో అనే ఆర్భాటం లేకుండా ఒక సాధారణ వ్యక్తిలా ఆయన మా ఇంటికి వచ్చాడు. ఆయన ప్రవర్తనకు మా నాన్న ఆనందించాడు. నన్ను ఆయనకు ఇచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు. అలా, 1990 జనవరి 31న మా వివాహం జరిగింది’’ అని ఆమె చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని