Tillu Square: టిల్లు స్క్వేర్‌.. రూ.100 కోట్ల గ్రాస్‌ వస్తుందనుకుంటున్నా: నాగవంశీ

సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్‌ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్‌’. శుక్రవారం ఇది ప్రేక్షకుల ముందుకువచ్చింది.

Published : 29 Mar 2024 18:39 IST

హైదరాబాద్‌: ‘టిల్లు స్క్వేర్‌’కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించిన నేపథ్యంలో చిత్రబృందం తాజాగా ప్రెస్‌మీట్‌ నిర్వహించింది. ప్రేక్షకులు చూపిస్తోన్న ఆదరణకు ధన్యవాదాలు చెప్పింది. ఈసందర్భంగా నిర్మాత నాగవంశీ ‘టిల్లు స్క్వేర్‌’కు కొనసాగింపుగా మరో సినిమా రానుందని చెప్పారు. ‘‘తొలిరోజు రూ.25 కోట్ల గ్రాస్‌ ఉండొచ్చనుకుంటున్నా. ప్రేక్షకుల స్పందనను దృష్టిలోపెట్టుకొని థియేటర్లు, షోలు పెంచడానికి ప్రయత్నిస్తున్నా. ఓవర్‌సీస్‌లో ఓపెనింగ్స్‌ బాగా వచ్చాయి. ఐపీఎల్‌ ఇప్పుడు మన జీవితంలో ఒక భాగమైంది. దాని కారణంగా సినిమా కలెక్షన్స్‌ ఎఫెక్ట్‌ కావడం లేదు. మా సినిమా దాదాపు రూ.100 కోట్లు గ్రాస్‌ చేస్తుందని నా అంచనా. క్లైమాక్స్‌కు ‘టిల్లు 3’ అనౌన్స్‌మెంట్‌ అటాచ్‌ చేసి సోమవారం నుంచి ప్రదర్శిస్తాం’’ అని నాగవంశీ అన్నారు.

అనుపమ మాట్లాడుతూ.. ‘‘టిల్లు స్క్వేర్‌’ కోసం ఈ టీమ్‌తో దాదాపు రెండేళ్లు కలిసి జర్నీ చేశా. ఈ ప్రయాణం ఎంతో సరదాగా సాగింది. లిల్లీగా నా నటన అద్భుతంగా ఉందని.. నేహాశెట్టి (డీజే టిల్లు హీరోయిన్‌) కాల్‌ చేసి మెచ్చుకుంది. ఆమె ప్రశంసలు నాకెంతో ఆనందాన్నిచ్చాయి’’ అని తెలిపారు.

సిద్ధు జొన్నలగడ్డ హీరోగా 2022లో విడుదలైన ‘డీజే టిల్లు’ సూపర్‌హిట్‌ అయింది. దానికి కొనసాగింపుగా వచ్చిన చిత్రమే ‘టిల్లు స్క్వేర్‌’. యూత్‌ఫుల్‌, రొమాంటిక్‌ క్రైమ్‌ కామెడీ చిత్రంగా ఇది రూపుదిద్దుకుంది. మల్లిక్‌రామ్‌ దర్శకుడు. అనుపమ పరమేశ్వరన్‌ కథానాయిక. మురళీశర్మ, మురళీధర్‌ గౌడ్, నేహా శెట్టి, ప్రిన్స్ కీలక పాత్రలు పోషించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని