Thug Life: ‘థగ్‌ లైఫ్‌’.. కమల్‌ ప్రాజెక్ట్‌ నుంచి వైదొలగిన మరో హీరో..?

కమల్‌హాసన్‌ కొత్త చిత్రం ‘థగ్‌ లైఫ్‌’ (Thug Life) నుంచి మరో హీరో వైదొలగినట్లు తెలుస్తోంది. దీనిపై నెట్టింట జోరుగా ప్రచారం సాగుతోంది.

Published : 23 Mar 2024 16:32 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: కమల్‌హాసన్‌ (Kamal Haasan) హీరోగా ప్రముఖ దర్శకుడు మణిరత్నం (Mani Ratnam) తెరకెక్కిస్తోన్న చిత్రం ‘థగ్‌ లైఫ్‌’. పాన్‌ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకుంటోన్న ఈ ప్రాజెక్ట్‌లో దుల్కర్‌ సల్మాన్‌, జయం రవి భాగమైన విషయం తెలిసిందే. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా నుంచి జయం రవి వైదొలగినట్లు తెలుస్తోంది. డేట్స్ విషయంలో క్లాష్‌ రావడంతో ఆయన పక్కకు జరిగారన్న కథనాలు ప్రచురితమవుతున్నాయి. ఇదే కారణంతో దుల్కర్‌ సల్మాన్‌ కూడా ఈ చిత్రాన్ని వదులుకున్నారని ఇటీవల జోరుగా ప్రచారం సాగింది. దుల్కర్‌ స్థానంలో చిత్రబృందం శింబును తీసుకునే ఆలోచనలో ఉందని.. ఇప్పటికే చర్చలు కూడా జరిగాయని టాక్‌. ‘థగ్‌ లైఫ్‌’ గురించి వస్తోన్న ఈ వరుస కథనాలపై చిత్రబృందం స్పందించలేదు.

‘పొన్నియిన్‌ సెల్వన్‌ -1, 2’ తర్వాత మణిరత్నం దర్శకత్వం వహిస్తోన్న చిత్రమిదే. సముద్రపు దొంగల నేపథ్యంలో యాక్షన్‌ డ్రామాగా ఇది సిద్ధమవుతోంది. ‘నాయకన్‌’ (1987) లాంటి హిట్‌ తర్వాత కమల్‌హాసన్‌ - మణిరత్నం కాంబోలో వస్తోన్న సినిమా కావడంతో ప్రేక్షకుల్లో దీనిపై అంచనాలు ఏర్పడ్డాయి. రాజ్‌కమల్‌ ఇంటర్నేషనల్‌ ఫిలింస్‌, మద్రాస్‌ టాకీస్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్రిష కథానాయిక. మలయాళ నటుడు జోజు జార్జ్‌తో పాటు యువ హీరో గౌతమ్‌ కార్తీక్‌, కథానాయిక ఐశ్వర్య లక్ష్మీ ఇందులో కీలకపాత్రలు పోషించనున్నారు. ఎ.ఆర్‌.రెహమాన్ స్వరాలు అందించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని